Adultered Toddy: కల్లుతాగి మహబూబాబాద్‌లో ఇద్దరు మృతి, మరొకరికి సీరియస్..ఘటనపై అనుమానాలు-two dead by drinking adultered toddy in mahabubabad ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Adultered Toddy: కల్లుతాగి మహబూబాబాద్‌లో ఇద్దరు మృతి, మరొకరికి సీరియస్..ఘటనపై అనుమానాలు

Adultered Toddy: కల్లుతాగి మహబూబాబాద్‌లో ఇద్దరు మృతి, మరొకరికి సీరియస్..ఘటనపై అనుమానాలు

HT Telugu Desk HT Telugu

Adultered Toddy: మహబూబాబాద్ జిల్లాలో ఇద్దరు యువకుల అనుమానాస్పద మృతి కలకలం రేపుతోంది. మరో యువకుడు ప్రాణాలతో పోరాడుతున్నారు.

కల్తీ కల్లు తాగి అనుమానాస్పద స్థితిలో మహబూబాబాద్‌లో ఇద్దరు యువకుల మృతి

Adultered Toddy: కల్లు తాగి ఇద్దరు యువకులు అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయారు. మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. దాదాపు నెల రోజుల కిందట స్నేహితుడి బర్త్ డే వేడుకలకు హాజరైన ముగ్గురు యువకులు కల్లు, మద్యం తాగి అస్వస్థతకు గురి కావడం, ఆ తరువాత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్రమంలోనే ఇద్దరు మరణించడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.

మరో యువకుడి హైదరాబాద్ లోని ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకుంటుండగా, ఆయన పరిస్థితి విషమం ఉంది. మమబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండలం రామన్నగూడెంలో ఈ ఘటన జరగగా కల్తీ కల్లే యువకుల ప్రాణాల మీదకు తెచ్చిందనే చర్చ జరగుతోంది.

బాధిత కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. గత నెల జూన్ 10న రామన్నగూడెంకు చెందిన దొంతు విజయ్ పుట్టిన రోజు కాగా, ఆ వేడుకలకు అదే గ్రామానికి చెందిన బోగోజు శ్రవణ్(25), షేక్ రహీం(28), తాడూరి ఉపేంద్రచారి అనే యువకులు హాజరయ్యారు. బర్త్ డే సందర్భంగా అంతా కలిసి కల్లు తాగారు. ఆ తరువాత మద్యం కూడా సేవించారు.

వాంతులు, విరేచనాలు, జ్వరంతో అస్వస్థత

బర్త్ డే పార్టీ జరిగిన వారం రోజల తరువాత జూన్ 17న బోగోజు శ్రవణ్ కుమార్ అస్వస్థతకు గురయ్యాడు. వాంతులు, విరేచనాలు కావడంతో పాటు జ్వరం కూడా రావడంతో ట్యాబ్లెట్స్ వేసుకున్నాడు. అయినా ఎంతకూ తగ్గకపోవడంతో మహబూబాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నాడు.

గ్రామానికి చెందిన షేక్ రహీమ్ కూడా అలాగే అస్వస్థతకు గురయ్యాడు. ఈ క్రమంలో ఇద్దరూ ఖమ్మంలోని ఆసుపత్రికి వెళ్లి చికిత్స తీసుకున్నారు. కాగా అక్కడ శ్రవణ్ పరిస్థితి విషమంగా మారడంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న క్రమంలో బుధవారం రాత్రి శ్రవణ్ మరణించాడు.

షేక్ రహీం నిమ్స్ ఆసుపత్రిలో చేరగా, ట్రీట్ మెంట్ జరుగుతున్న సమయంలోనే గురువారం సాయంత్రం ఆయన కూడా ప్రాణాలు కోల్పోయాడు. గంటల వ్యవధిలోనే ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోగా, మరో యువకుడు తాడూరి ఉపేంద్రచారి హైదరాబాద్ లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. కాగా ఆయన పరిస్థితి కూడా విషమంగా ఉందని బాధిత కుటుంబ సభ్యులు తెలిపారు.

కల్తీ కల్లు వల్లేనా..?

విజయ్ బర్త్ డే సందర్భంగా అందరూ కలిసి కల్లు తాగి, ఆ తరువాత ఆల్కహాల్ కూడా తీసుకున్నారు. కాగా అస్వస్థతకు గురైన తరువాత శ్రవణ్ ఆసుపత్రిలో చేరగా, కుటుంబ సభ్యులు ఏం జరిగిందనే విషయంపై ఆరా తీశారు. దీంతో బర్త్ డేలో కల్లు, మద్యం తాగిన తరువాత వాంతులు, వీరేచనాలతో అస్వస్థత కలిగినట్లు శ్రవణ్ కుటుంబ సభ్యులకు తెలిపాడు.

అనంతరం శ్రవణ్, షేక్ రహీం మరణించడంతో అసలు కారణం ఏమై ఉంటుందనే చర్చ జరుగుతోంది. దీంతో కల్తీ కల్లు తాగడం వల్లే ముగ్గురు యువకులు తీవ్ర అస్వస్థతకు గురై ఉంటారనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాగా అస్వస్థతకు గురైన మూడో వ్యక్తి ఉపేంద్రచారి పరిస్థితి కూడా విషమంగా ఉందని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఇదిలాఉంటే తన కొడుకు పాటు మిగతా షేక్ రహీం మృతి పట్ల అనుమానం ఉందని శ్రవణ్ తల్లి బోగోజు జయప్రద గురువారం నర్సింహులపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు వివరించారు.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)