Warangal Health City : వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ - కీలక ఫైళ్లు స్వాధీనం-vigilance inquiry on warangal health city ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Warangal Health City : వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ - కీలక ఫైళ్లు స్వాధీనం

Warangal Health City : వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ - కీలక ఫైళ్లు స్వాధీనం

HT Telugu Desk HT Telugu
Aug 31, 2024 07:51 AM IST

వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ షురూ అయింది. ఇందులో భాగంగా ఆర్ అండ్ బీ ఆఫీస్ నుంచి పలు ఫైళ్లు స్వాధీనం చేసుకున్నారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన అంచనాలు… ఆ తరువాత నిర్మాణ వ్యయం పెంచడానికి గల కారణాలపై అధికారులు ఆరా తీశారు.

వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ
వరంగల్ హెల్త్ సిటీపై విజిలెన్స్ విచారణ

వరంగల్ లో నిర్మిస్తున్న హెల్త్ సిటీ(మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్)పై విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు విచారణ ప్రారంభించారు. గత ప్రభుత్వ హయాంలో దాదాపు రూ.1,100 కోట్ల అంచనా వ్యయంతో ఈ హాస్పిటల్ నిర్మాణ పనులు చేపట్టగా.. ఆ తరువాత ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్మాణ వ్యయాన్ని రూ.1725.95 కోట్లకు పెంచారనే ఆరోపణలు ఉన్నాయి. అంటే ఏకంగా రూ.625.95 కోట్లు అంచనా వ్యయం పెంపు పై వివిధ అనుమానాలు రేకెత్తుతుండగా.. సీఎం రేవంత్ రెడ్డి సర్కారు ఏర్పడిన తరువాత ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకుంది.

దాదాపు రెండు నెలల కిందట వరంగల్ నగర పర్యటనకు వచ్చిన ఆయన హెల్త్ సిటీ అంచనా వ్యయం పెంపు పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా ఐదు రోజుల కిందట హైదారాబాద్ లో అఫేసర్లతో సమావేశమై ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని నిర్ణయించారు. ఈ మేరకు విజిలెన్స్ ఎన్ఫోర్స్ మెంట్ డీజీ సివీ ఆనంద్ ను విచారణకు ఆదేశించారు.

అంచనా వ్యయం పెంపుపై అనుమానాలు

రూ.1100 కోట్ల అంచనా వ్యయంతో పనులు చేపట్టిన ఆసుపత్రిలో మొదట సివిల్, వర్క్స్ కోసం 509 కోట్లు, మంచి నీళ్ళు, పారిశుద్యానికి సంబంధించిన పనుల కోసం 20.36 కోట్లు, మెకానికల్, ప్లంబింగ్ అండ్ ఎలక్ట్రిసిటీ పనులకు 182.18 కోట్లు కేటాయించారు. మెడికల్ ఎక్విప్మెంట్ కు 105 కోట్లు, ట్యాక్స్, ఇతర చార్జీలకు 229.18 కోట్లు, వివిధ అనుబంధ పనుల కోసం 54 కోట్లకు పైగా మంజూరు చేసి పనులు స్టార్ట్ చేశారు. కానీ ఆ తర్వాత గత ప్రభుత్వ ముగుస్తుంది అన్న సమయంలోనే హెల్త్ సిటీ అంచనా వ్యయాన్ని ఏకంగా 1725.95 కోట్లకు పెంచారు.

దీంతో ఈ విషయంలో అంచనాలు పెరగడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ అంశాన్ని సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సీరియస్ గా తీసుకుని విచారణకు ఆదేశించగా.. ఆయన ఆదేశాలతో వరంగల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఎంక్వైరీ స్టార్ట్ చేశారు. ఎలాంటి పర్మిషన్లు లేకుండా రూ.625.95 కోట్లు అంచనా వ్యయం పెరగడం పట్ల వరంగల్ విజిలెన్స్ ఆఫీసర్ ఏఎస్పీ బాలకోటి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభించారు.

ఆసుపత్రి నిర్మాణం ఆర్ అండ్ బీ ఆధ్వర్యంలో చేపట్టగా శుక్రవారం ఉదయం ఆర్ అండ్ బీ ఎస్ఈ ఆఫీస్ ను పరిశీలించారు. అక్కడ సూపర్ స్పెషాలిటీ హస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన సమాచారాన్ని ఆర్ అండ్ బీ అధికారుల నుంచి సేకరించారు. ఆ తరువాత నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులను ఆర్ అండ్ బీ ఆఫేసర్లతో జాయింట్ ఇన్ స్పెక్షన్ చేశారు. అక్కడ సివిల్ వర్క్స్ తో పాటు అన్నిరకాల వసతులపై ఆరా తీశారు.

దాదాపు గంటన్నర పాటు హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించి వివిధ వివరాలు సేకరించారు. ఈ ఎంక్వైరీలో విజిలెన్స్ ఆఫీసర్ బాలకోటితో పాటు డీఈ రామ్మోహన్ రెడ్డి, ఏఈ విద్య, ఇన్ స్పెక్టర్లు అనిల్ కుమార్, రాకేశ్, ఆర్ అండ్ బీ ఈఈ జితేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఫైల్స్ స్వాధీనం

విజిలెన్స్ ఎంక్వైరీలో భాగంగా అధికారులు శుక్రవారం ఉదయం గంటల సుమారులో ఆర్ అండ్ బీ ఆఫీస్ కు వెళ్లి అక్కడ విచారణ ప్రారంభించారు. అక్కడ నుంచి హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన పలు రికార్డులను స్వాధీనం చేసుకుని వాటిని పరిశీలించే పనిలో పడ్డారు. హాస్పిటల్ నిర్మాణానికి సంబంధించిన అంచనాలు, ఆ తరువాత నిర్మాణ వ్యయం పెంచడానికి గల కారణాలపై ఆరా తీశారు.

ఎలాంటి అనుమతులు లేకుండానే రూ.625.95 కోట్లు బడ్జెట్ పెంచిన నేపథ్యంలో దానికి సంబంధించి ఏమైనా సర్క్యూలర్లు, జీవోలు ఇచ్చారా అనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. విజిలెన్స్ విచారణలో మొదటి రోజు విజిలెన్స్ ఇంజినీరింగ్ వింగ్ ఆధ్వర్యంలో స్క్రూటీని చేస్తుండగా, ఏకంగా అన్ని కోట్ల బడ్జెట్ పెంచడంపై ఆర్ అండ్ బీ అధికారుల నుంచి కూడా ఎలాంటి సమాధానం రాలేదని సమాచారం.

కాగా పూర్తి విచారణ అనంతరం రిపోర్టును ప్రభుత్వానికి అందజేస్తామని అధికారులు తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కారు వరంగల్ హెల్త్ సిటీ అంచనా వ్యయం పెంపు పై విజిలెన్స్ విచారణ మొదలు పెట్టడంతో ఇటు ఆర్ అండ్ బీ అధికారులతో పాటు బీఆర్ఎస్ నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నట్టు తెలుస్తోంది.

(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి)