Danam Nagender : ఏవీ రంగనాథ్ కు కొత్త పదవి ఇష్టం లేనట్లుంది, ఆ అధికారులకు ప్రివిలేజ్ నోటీసులిస్తా - దానం నాగేందర్
Danam Nagender Vs AV Ranganath : నందగిరిహిల్స్ జీహెచ్ఎంసీ స్థలంలో ప్రహరీ గోడ కూల్చివేత ఘటనలో కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై కేసు నమోదైంది. ఈ వ్యవహారంపై స్పందించిన దానం నాగేందర్...హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పై మండిపడ్డారు. తనపై కేసు పెట్టిన అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానన్నారు.
Danam Nagender Vs AV Ranganath : హైదరాబాద్ లో నాలాలు, చెరువులపై ఆక్రమణలపై హైడ్రా(హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) కొరడా ఝుళిపిస్తుంది. అక్రమ నిర్మాణాలను తొలగిస్తుంది. అక్రమ నిర్మాణాల్లో కొందరి రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్‌లోని పార్కులు, నాలాలు, సరస్సుల్లో ఆక్రమణల తొలగించడానికి ప్రయత్నిస్తున్న హైడ్రాకు రాజకీయ నాయకులు అడ్డుపడుతున్నారు. ఇదిలా ఉంటే నందగిరి హిల్స్‌లోని కాంపౌండ్ వాల్‌ను కూల్చివేశారన్న ఆరోపణలపై ఖైరతాబాద్ కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ ఇన్‌ఛార్జ్ వి.పాపయ్య దాఖలు చేసిన ఫిర్యాదు ప్రకారం... గురు బ్రహ్మ నగర్ ప్రాంతానికి చెందిన కొందరు అక్రమంగా చొరబడి కాంపౌండ్ వాల్ ను కూల్చివేశారని ఆరోపించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలోనే వారు ఈ పని చేశారు, ఆయనే నిందితులను రెచ్చగొట్టారని ఆరోపించారు. జీహెచ్ఎంసీకి చెందిన భూమిలో ఉన్న గోడను కూల్చివేశారని, సుమారు రూ.10 లక్షల నష్టం వాటిల్లినట్లు అధికారి తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు దానం నాగేందర్ పై కేసు నమోదు చేశారు. ఈ వ్యవహారం వెనుక హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ ఉన్నారన్న అనుమానంతో దానం నాగేందర్ ఆయన ఆరోపణలు చేస్తున్నారు.
నన్నెవ్వరూ ఏం చేయలేరు - ఎమ్మెల్యే దానం నాగేందర్
ఈ వివాదంపై ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సంచలన వ్యాఖ్యలు వ్యాఖ్యలు చేశారు. ఏవీ రంగనాథ్ కాదు కదా నన్నెవ్వరూ ఏం చేయలేరన్నారు. జీహెచ్‌ఎంసీ ఎన్‌ఫోర్స్‌మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కమిషనర్ ఏవీ రంగనాథ్‌కు కొత్తగా వచ్చిన పదవీ ఇష్టం లేనట్లు ఉందన్నారు. అందుకే నాపైన కేసు పెట్టారని ఆరోపించారు. అధికారులు వస్తుంటారు పోతుంటారు, కానీ తాను లోకల్ తనను ఎవడు ఏం చేయలేరన్నారు. నందగిరిహిల్స్ హుడా లే ఔట్ లో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని తాను అక్కడకి వెళ్లానన్నారు. హైదరాబాద్ నగరం కాస్మోపాలిటన్ సిటీ అన్నివర్గాల ప్రజలకు సౌకర్యాలు, సమస్యలు నెరవేర్చడం ప్రజాప్రతినిధిగా తన బాధ్యత అన్నారు. కేసు పెట్టిన అధికారులకు ప్రివిలేజ్ నోటీసులు ఇస్తానని, వారి పై ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేస్తానన్నారు. ప్రజాప్రతినిధిగా తనకు తన నియోజకవర్గంలో ఎక్కడికైనా వెళ్లే హక్కు ఉందన్నారు. తనను అడ్డుకునే అధికారం ఏ అధికారికి లేదన్నారు.
అసలేం జరిగింది?
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్తో పాటు మరికొందరిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. జూబ్లీహిల్స్ రోడ్ నెం.69 నందగిరి హిల్స్లో జీహెచ్ఎంసీకి చెందిన ప్రభుత్వ స్థలంలోని ప్రహరీ గోడను ఈ నెల 10న కొందరు గుర్తుతెలియని వ్యక్తులు కూల్చివేశారని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు గుర్తించారు. ఎమ్మెల్యే దానం నాగేందర్ సమక్షంలో గురు బ్రహ్మ నగర్కి చెందిన గోపాల్ నాయక్, రాంచందర్ మరికొందరు ఈ కూల్చివేత ఘటనలో ఉన్నారని ఎన్ఫోర్స్మెంట్ ఇన్ఛార్జ్ పాపయ్య జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాంపౌండ్ వాల్ కూల్చివేతతో రూ.10 లక్షల మేరకు నష్టం వాటిల్లిందని ఫిర్యాదులో తెలిపారు. దీంతో పోలీసులు ఎమ్మెల్యే దానం నాగేందర్ను ఈ కేసులో ఏ3గా చేర్చారు.
సంబంధిత కథనం