Hydra Action : బఫర్‌ జోన్‌ లో అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే భయపడేలా చేస్తాం -హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్-hyderabad hydra commissioner av ranganath says works on three phases to restore ponds ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hydra Action : బఫర్‌ జోన్‌ లో అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే భయపడేలా చేస్తాం -హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

Hydra Action : బఫర్‌ జోన్‌ లో అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే భయపడేలా చేస్తాం -హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

Bandaru Satyaprasad HT Telugu
Aug 12, 2024 08:31 PM IST

Hydra Action On Illegal Constructions : జీహెచ్ఎంసీ పరిధిలో చెరువుల ఆక్రమణలపై హైడ్రా కొరడా ఝుళిపిస్తుంది. చెరువుల ఆక్రమణలను గుర్తించి, అక్రమ కట్టణాలను కూల్చి వేస్తుంది. చెరువులు పునరుద్ధరణే హైడ్రా లక్ష్యమని కమిషనర్ ఏవీ రంగనాథ్ తెలిపారు.

బఫర్‌ జోన్‌ లో అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే భయపడేలా చేస్తాం -హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్
బఫర్‌ జోన్‌ లో అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే భయపడేలా చేస్తాం -హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్

Hydra Action On Illegal Constructions : జీహెచ్ఎంసీ పరిధిలో లేక్ బఫర్ జోన్ లో నిర్మించిన అక్రమ కట్టడాలపై హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ (హైడ్రా) చర్యలు చేపట్టింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణే లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ఏర్పాటు చేశారు. ఇది నగరంలోని బఫర్ జోన్ లో అక్రమ కట్టడాలను కొరడా ఝళిపిస్తుంది. బఫర్ జోన్ లో భవనాల కూల్చివేతపై హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ మీడియాతో మాట్లాడారు. ఆక్రమణలను హైడ్రా వదలబోదని అన్నారు. నగరంలో ఆక్రమణలకు సంబంధించి ప్రజల నుంచి పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. దశలవారీగా హైడ్రా పనిచేస్తుందని స్పష్టం చేశారు. మొదటి విడతలో ఆక్రమణలను అడ్డుకుంటామని, రెండో విడతలో అక్రమ నిర్మాణాలపై చర్యలు, అనుమతుల నిరాకరణ ఉంటుందన్నారు. మూడో దశలో చెరువుల పూడిక తీసి, వాన నీటిని మళ్లించే ప్రక్రియ చేపడతామన్నారు.

చాలా చెరువులు మాయం

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని 400కు పైగా చెరువులు, కుంటలు ఉన్నాయని ఏవీ రంగనాథ్ తెలిపారు. ఎన్‌ఆర్‌ఎస్‌సీ నివేదిక ప్రకారం గడిచిన 44 ఏళ్లలో నగరంలో చాలా చెరువులు కనుమరుగయ్యాయన్నారు. చాలా చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారన్నారు. అలాంటి అక్రమ కట్టడాలు గుర్తించి వాటిని తొలగిస్తు్న్నామన్నారు. బఫర్ జోన్ లో అక్రమ నిర్మాణాలు తొలగించకపోతే హైదరాబాద్‌ భవిష్యత్‌ ప్రశ్నార్థకంగా మారుతుందన్నారు. త్వరలో హైడ్రాకు ప్రభుత్వం పెద్దఎత్తున సిబ్బందిని సమకూరుస్తుందన్నారు. హైడ్రా పరిధిలో పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేస్తామన్నారు. 2,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో హైడ్రా పరిధి అని తెలిపారు. అవకాశవాదం వల్ల గొలుసుకట్టు చెరువులన్నీ ఆక్రమణలకు గురైయ్యాయని తెలిపారు. చెరువులకు నీటిని మళ్లించే నాలాలు కూడా పూడుకుపోయాయన్నారు. చెరువు ఎఫ్‌టీఎల్‌, బఫర్‌ జోన్‌లో ప్రజలు స్థలాలు కొనుగోలు చేయొద్దని కోరారు.

అక్రమ నిర్మాణాలు చేపట్టాలంటే భయపడే స్థితి తీసుకొస్తాం

రాజకీయ ఆరోపణలపై స్పందించనని ఏవీ రంగనాథ్ తెలిపారు. నందగిరి హిల్స్‌ సొసైటీతో హైడ్రాకు ఒప్పందం లేదన్నారు. చందానగర్‌లో 2023లో బఫర్‌ జోన్‌లో నిర్మాణాలకు జీహెచ్ఎంసీ అధికారులు అనుమతులిచ్చారన్నారు. ఈ అనుమతులపై ఆరా తీస్తున్నామన్నారు. బఫర్‌ జోన్‌, ఎఫ్‌టీఎల్‌ పరిధిలో నిర్మాణాలు చేపట్టాలంటేనే భయపడే పరిస్థితి తీసుకోస్తామని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్‌ తెలిపారు.

సంబంధిత కథనం