Telangana ACB : వామ్మో.. తెలంగాణలో ఈ స్థాయిలో అవినీతి అధికారులు ఉన్నారా.. ఒక్క ఏడాదిలోనే 145 కేసులు!-telangana acb registered 145 criminal cases in one year ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Acb : వామ్మో.. తెలంగాణలో ఈ స్థాయిలో అవినీతి అధికారులు ఉన్నారా.. ఒక్క ఏడాదిలోనే 145 కేసులు!

Telangana ACB : వామ్మో.. తెలంగాణలో ఈ స్థాయిలో అవినీతి అధికారులు ఉన్నారా.. ఒక్క ఏడాదిలోనే 145 కేసులు!

Basani Shiva Kumar HT Telugu
Sep 09, 2024 11:05 AM IST

Telangana ACB : తెలంగాణలో ఏసీబీ కొత్త రికార్డును నెలకొల్పింది. ఒక్క ఏడాదిలోనే ఏకంగా 145 క్రిమినల్ కేసులు నమోదు చేసింది. గడిచిన ఐదేళ్లలో ఇదే రికార్డ్ అని అధికారులు చెబుతున్నారు. ఒక్క ఏడాదిలోనే 145 కేసులు నమోదు కావడంతో.. తెలంగాణలో అవినీతి ఈ స్థాయిలో ఉందా అనే చర్చ జరుగుతోంది.

తెలంగాణ ఏసీబీ కొత్త రికార్డు
తెలంగాణ ఏసీబీ కొత్త రికార్డు (Telangana ACB)

తెలంగాణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అవినీతిపై గట్టిగా పోరాటం చేసింది. ఈ ఏడాది 145 క్రిమినల్ కేసులు నమోదు చేసింది. గత ఐదేళ్లలో అత్యధికంగా కేసులు నమోదు చేసినట్టు ఏసీబీ అధికారులు చెబుతున్నారు. ఈ ఏడాది అత్యధికంగా రెవెన్యూ శాఖ ఉద్యోగులపై 31 కేసులు నమోదు అయ్యాయి. ఆ తర్వాత హోం శాఖ (పోలీసులు) ఇతర ఉద్యోగులపై 21 కేసులు నమోదు అవ్వగా.. మున్సిపల్ శాఖ ఉద్యోగులపై 18 కేసులు నమోదయ్యాయి.

94 కేసులు అవే..

లంచాలు డిమాండ్ చేసిన అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న కేసులు 94 ఉన్నాయి. మిగతా కేసుల్లో అక్రమాస్తులు, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఉన్నాయి. ఈ ఏడాది నమోదైన 145 కేసుల్లో.. 85 మంది ప్రభుత్వ ఉద్యోగులు సహా 109 మందిని ఏసీబీ అరెస్ట్ చేసింది. 2023లో 99 మందిని అరెస్టు చేశారు. 86 మందికి సంబంధించిన 72 కేసుల్లో.. ప్రభుత్వం ప్రాసిక్యూషన్ అనుమతిని పొందింది.

బాలకృష్ణ కేసు సంచలనం..

ఈ ఏడాది హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్‌ శివ బాలకృష్ణ అక్రమాస్తుల కేసులో అరెస్ట్‌ అయ్యారు. బాలకృష్ణ కేసుకు సంబంధించి చార్జిషీట్‌ను రూపొందిస్తున్నట్లు సీవీ ఆనంద్ వివరించారు. అక్రమ మార్గాల్లో సంపాదించిన 200కు పైగా ఆస్తులను గుర్తించారు. అటు గొర్రెలకు సంబంధించిన కుంభకోణం వెలుగులోకి వచ్చి సంచలనంగా మారింది. పశుసంవర్ధక శాఖలో జరిగిన కుంభకోణంపై ఏసీబీ దూకుడుగా వ్యవహరించింది.

రెడ్ కార్నర్ నోటీసులు..

గొర్రెల కుంభకోణంలో దుబాయ్‌లో ఉన్నట్లు అనుమానిస్తున్న నిందితుల కోసం రెడ్ కార్నర్ నోటీసును కోరాలని ఏసీబీ యోచిస్తోంది. రెడ్ కార్నర్ నోటీసు కోరే ముందు ఛార్జిషీట్ దాఖలు చేయాలని ఏసీబీ పూర్వపు డీజీ సీవీ ఆనంద్ వివరించారు. ఈ ఏడాది 10 కేసుల్లో లంచం తీసుకున్న నిందితులను ఏసీబీ ప్రత్యేక కోర్టు దోషులుగా నిర్ధారించిందని వెల్లడించారు.

తెలంగాణ ఏసీబీ డీజీగా విజయ్ కుమార్..

తెలంగాణ ఏసీబీ దూకుడు మీద ఉన్న సమయంలో.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏసీబీ డీజీగా ఉన్న సీవీ ఆనంద్‌ను బదిలీ చేసింది. హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్‌గా నియమించింది. ఆయన స్థానంలో సీనియర్ ఐపీఎస్ అధికారి విజయ్‌కుమార్‌ను నియమించింది. ఆదివారం విజయ్ కుమార్ ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్ నుంచి బాధ్యతలు స్వీకరించారు. కీలక కేసుల్లో పురోగతి ఉన్న సమయంలో సీవీ ఆనంద్‌ను మార్చడం తెలంగాణలో చర్చనీయాంశంగా మారింది.