Peddapalli News : పోలీస్ స్టేషన్ లో పందెం కోళ్ల వేలం పాట, దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం
06 August 2024, 16:28 IST
- Peddapalli News : పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. పోలీసులే స్వయంగా కోళ్లను వేలం వేశారు. ఈ తంతు చూసేందుకు కోళ్లను వేలంలో దక్కించుకునేందుకు జనం ఎగబడ్డారు.
పోలీస్ స్టేషన్ లో పందెం కోళ్ల వేలం పాట, దక్కించుకునేందుకు ఎగబడ్డ జనం
Peddapalli News : పెద్దపల్లి జిల్లాలో రెండు కోళ్లు ఠాణా మెట్లెక్కాయ్. పది రోజులుగా పోలీస్ స్టేషన్ లో పందెం కోళ్లు బంధీగా మారాయి. కోర్టు ఆదేశంతో పోలీసులు పందెం కోళ్లను బహిరంగ వేలం వేయగా పోటీ పడి ఇద్దరు పందెం కోళ్లను కొనుగోలు చేశారు.
పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం పెంచుకలపేటలో జూన్ 27న పోలీసులు కోడి పందాల స్థావరంపై దాడి చేశారు. పందెం రాయుళ్లను అరెస్టు చేసి రెండు పందెం కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ అయిన పందెం రాయుళ్లను కటకటాల వెనక్కి పంపించిన పోలీసులు పది రోజులుగా ఠాణాలో ఉన్న పందెం కోళ్లను ఏం చేయాలో అర్థం కాలేదు. చివరకు కోర్టులో ప్రవేశపెట్టగా వేలంవేసి కోళ్లు పెంచుకునే వారికి అప్పగించాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశంతో కమాన్ పూర్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం బహిరంగ వేలం నిర్వహించారు.
పోటీ పడి పందెం కోళ్లను దక్కించుకున్న ఇద్దరు
ఠాణా సాక్షిగా పోలీసులు పందెం కోళ్ల బహిరంగం వేలం పాట నిర్వహించగా పలువురు పోటీ పడ్డారు. ఒక కోడిని 4 వేల రూపాయలకు పురాణం సారయ్య దక్కించుకుకోగా, మరో కోడిని 2500 రూపాయలకు సత్యనారాయణ అనే వ్యక్తి దక్కించుకున్నారు. పోలీసుల సమక్షంలో ఠాణా సాక్షిగా పందెం కోళ్లను దక్కించుకున్న ఇద్దరు స్టేషన్ లో ఫొటోలకు ఫోజులిచ్చారు.
చుక్కలో నంజుకు ముక్క అవుతుందో...పందెంకే పనికొస్తుందో?
పందెం రాయుళ్లతో పట్టుబడి 10 రోజులపాటు ఠాణాలో శిక్ష అనుభవించిన పందెం కోళ్లను బహిరంగ వేలంతో విక్రయించడం చర్చనీయాంశంగా మారింది. పందెం కోళ్లను పెంచుకోవడానికి మాత్రమే వేలంతో విక్రయించాలని కోర్టు ఆదేశించగా వేలంపాటలో పాల్గొన్నవారు పెంచుకోవడానికే కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ ఖరీదైన ఆ పందెం కోళ్లను ఎన్ని రోజులు పోషిస్తారనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పోషించడం దేవుడెరుగు.. వాటిని మళ్లీ కోడిపందాలకు ఉపగించడమో లేదా మత్తెక్కించే మద్యం చుక్కలో నంజుకోవడానికి ముక్కగా మారుతుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. పోలీసులకే చుక్కలు చూపిన ఆ పందెం కోళ్ళను తినే అదృష్టం ఎవరికి ఉందోనని జనం ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
రిపోర్టింగ్ : కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా, కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు