TG Roosters Stolen : అంతర్రాష్ట్ర పందెం కోళ్ల దొంగలు- పగలు కారులో వచ్చి రెక్కీ రాత్రికి చోరీ
TG Roosters Stolen : పగలు పక్కా రెక్కీ చేసి రాత్రికి పందెం కోళ్లు చోరీ చేస్తున్న ముఠాను పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ఏపీకి చెందిన ముగ్గురిని అరెస్టు చేశారు. వీరు కోళ్లను చోరీ చేసి కారులో ఏపీకి తరలిస్తున్నట్లు గుర్తించారు.
TG Roosters Stolen : పందెం కోళ్ల దొంగలు పట్టుబడ్డారు. అంతరాష్ట్ర కోళ్ల దొంగల ముఠాకు చెందిన ముగ్గురిని పెద్దపల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. కారుతో పాటు 22 కోళ్లను స్వాధీనం చేసుకున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ ఏసీపీ కృష్ణ సమక్షంలో అరెస్ట్ అయిన కోళ్ల దొంగలను చూపించి వివరాలు వెల్లడించారు. జులై 26న సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో చీటి సతీష్ కు చెందిన 20 పందెం కోళ్లు, నాటు కోళ్లు చోరీకి గురయ్యాయి. అటు రామగుండం మండలం బ్రాహ్మణపల్లిలో సైతం నాటు కోళ్లు అపహరణకు గురయ్యారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో రెండు చోట్ల కోళ్ల చోరిని సీరియస్ గా తీసుకున్న పోలీసులు నిఘా పెట్టగా ముగ్గురు పట్టుబడ్డారని ఏసీపీ కృష్ణ తెలిపారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల మండలం పరిటాలకు చెందిన మేచర్ల యేసు బాబు(38), గ్యార విష్ణు (26), మేచర్ల కిషోర్ (38) ముగ్గురు ముఠాగా ఏర్పడి జల్సాలకు అలవాటు పడి కోళ్లను దొంగలించడమే వృత్తిగా పెట్టుకున్నారు. ఏపీ తెలంగాణలో పలు చోట్ల చోరీలకు పాల్పడ్డారు. మార్కెట్లో మంచి ధర పలికే కోళ్ల ఆచూకీ కోసం పగలు కారులో తిరిగి రెక్కి నిర్వహించి రాత్రి పూట చోరీలకు పాల్పడేవారు. చోరీల కోసం ఏపీ7 ఏవీ 7659 అనే నెంబరు గల కారును వినియోగించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో పందెం కోళ్లు నాటు కోళ్లే లక్ష్యంగా కోళ్లను చోరీలకు పాల్పడ్డారని ఏసీపీ తెలిపారు. కోళ్ల చోరీలపై ఏపీ తెలంగాణలో యేసు బాబుపై ఐదు కేసులు, కిషోర్ పై ఏడు కేసులు, గ్యార విష్ణు రెండు కేసులు ఉన్నాయని ఏసీపీ తెలిపారు.
కోళ్ల కోసం షిప్ట్ కారు
నిందితులు కోళ్లను దొంగలించేందుకు ప్రత్యేకంగా ఓ కారును కొనుగోలు చేశారు. పగలంతా రెక్కి నిర్వహించి రాత్రి వేళల్లో మార్కెట్ లో ధర పలికే కోళ్లను ఎంచుకుని వాటిని ఎత్తుకెల్తుంటారు. ఏపీలో సంక్రాంతి సమయంలో జరిగే పందెం కోళ్లను పోషకాలతో యజమానులు పెంచి పోషిస్తుంటారు. ఈ కోళ్లను దొంగలించినట్టయితే ధర కూడా బాగా పలుకుతుందని భావించిన ఈ ముఠా ఎక్కువ ధర పలికే కోళ్ల ఆచూకీ దొరకబట్టేందుకు పగటిపూట అన్వేషణ చేస్తారు. రాత్రి సమయంలో చోరీ చేసి అదే కారులో ఏపీకి తరలించేవారు. ప్రస్తుతం కోళ్ల దొంగలు పట్టుబడడంతో చోరీకి కాదేది అనర్హం అన్నట్లు ఉందని జనం భావిస్తున్నారు.
రిపోర్టింగ్ కె వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం