AP Crime News : కోళ్ల కోసం భార్యను నరికి చంపిన భర్త
AP Crime News : కోళ్లు చనిపోయిన విషయాన్ని చెప్పలేదన్న కారణంతో భార్యను భర్త నరికి చంపాడు. ఈ దారుణ ఘటన చిత్తూరు జిల్లాలో వెలుగు చూసింది. ఇదిలా ఉంటే.. రెండో భార్య మృతికి మొదటి భార్యనే కారణమని భావించిన భర్త… హత్య చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లాలో జరిగింది.
AP Crime News : రాష్ట్రంలోని రెండు జిల్లాలలో ఘోరం చోటు చేసుకుంది. రెండు వేర్వేరు ఘటనల్లో భార్యలను కట్టుకున్న భర్తలే హతమార్చారు. ఒక ఘటనలో ఇంట్లో ఉన్న కోళ్లు చనిపోయిన విషయం భర్తకు చెప్పకపోవడంతో హత్య జరిగింది. మరొక ఘటనలో రెండో భార్యాపిల్లలు ఆత్మహత్యకు తన మొదటి భార్యే కారణమని భర్త భావించడం, కాగా కారణాలుగా ఉన్నాయి.
కోళ్ల కోసం భార్యను హతమార్చిన భర్త
చిత్తూరు జిల్లాలోని కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీ మేకలవారిపల్లెలో లక్ష్మీరెడ్డి (47), రమణమ్మ (43) నివాసం ఉంటున్నారు. అయితే తమ ఇంట్లో ఉన్న కోళ్లు అనారోగ్యంతో చనిపోయాయి.
ఈ విషయం భార్య రమణమ్మ… లక్ష్మీరెడ్డికి చెప్పలేదు. కోళ్లు చనిపోయిన విషయం తనకు ఎందుకు చెప్పలేదని కోపంతో భార్యతో భర్త లక్ష్మీరెడ్డి గొడవపడ్డాడు. గొడవ మరింత ఎక్కువ అయ్యేసరికి కోపోద్రికుడైన లక్ష్మీరెడ్డి కొడవలితో రమణమ్మను విచక్షణా రహితంగా నరికి చంపాడు. అనంతరం అక్కడి నుంచి లక్ష్మీరెడ్డి పరారయ్యాడు.
సమాచారం తెలుసుకున్న పోలీసులు ముదివేడు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రూరల్ సర్కిల్ సీఐ సద్గురుడు, ఎస్ఐ మల్లికార్డున ఆధ్వర్యంలో పోలీసులు బృందాలు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. ముదివేడు సమీపంలో కడప క్రాస్‌లో లక్ష్మీరెడ్డి ఉన్నట్లు సమాచారం పోలీసులకు సమాచారం వచ్చింది. దీంతో సీఐ ఆధ్వర్యంలో బృందం అక్కడికి వెళ్లి నిందితుడు లక్ష్మీరెడ్డిని అరెస్టు చేశారు. అనంతరం హత్యకు ఉపయోగించిన కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించారు.
మొదటి భార్యను హత్య చేసిన భర్త
రెండో భార్య, పిల్లలు ఆత్మహత్యకు కారణం తన మొదటి భార్యేనని భావించిన భర్త, మొదటి భార్యను హత్య చేశాడు. ఈ ఘటన అన్నమయ్య జిల్లా బి.కోత్తకోట మండలం నాయనిబావి పంచాయతీ పట్రవారిపల్లెలో జరిగింది.
గ్రామానికి చెందిన అన్నపూర్ణ (30)ను చిన్న వయస్సులోనే కర్ణాటక రాష్ట్రం ఎగువకోటకు చెందిన మల్లికార్జున 10 ఏళ్ల క్రితం వివాహం ఆడారు. వీరికి ఒక కుమారుడు కూడా ఉన్నారు. భార్య, కుమారుడిని విడిచిపెట్టి మల్లికార్జున కర్ణాటకలోని బాగేపల్లెకు చెందిన మరో మహిళను రెండో పెళ్లి చేసుకున్నాడు.
ఆ భార్యకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఏడాది జనవరిలో రెండో భార్య, పిల్లలు చెరువులో పడి ఆత్మహత్య చేసుకున్నారు. దీంతో కర్ణాటక పోలీసులు మల్లికార్జునను అరెస్టు చేసి జైలుకు పంపించారు. ఇటీవలి జైలు నుంచి విడుదల అయిన మల్లికార్జున పట్రవారిపల్లెకు వచ్చాడు.
మొదటి భార్య అన్నపూర్ణను కలfసి మాయ మాటలు చెప్పి నమ్మించాడు. మల్లికార్జున మాయమాటలను అమాయకంగా అన్నపూర్ణ నమ్మింది. బయటకు వెళ్దామని చెప్పి అన్నపూర్ణను ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లాడు.
ఈనెల 24 న రాత్రి బి.కొత్తకోట మండలం కొండకిందపల్లె సమీపంలో జమాలమ్మ దర్గా వద్ద బీడు భూముల్లోకి తీసుకెళ్లి అంతం చేశాడు. అన్నపూర్ణ ఎంత అరిచినప్పటికీ ఫలితం లేకపోయింది. అటుగా ఎవ్వరూ రాకపోవడంతో ఆమెను కాపాడలేకపోయారు.
తన రెండో భార్య, ఇద్దరు చిన్న పిల్లలు ఆత్మహత్య చేసుకోవడానికి మొదటి భార్య అన్నపూర్ణ కారణమన్న కక్షతోనే ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు… నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. చివరికి నిందితుడు బి.కొత్తకోట-బెంగళూరు రహదారిలోని ఠాణామిట్ట చెక్‌పోస్టు వద్ద ఉన్నట్లు సమాచారం వచ్చింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి నిందితుడిని పట్టుకొని రిమాండ్‌కు పంపించారు.