Peddapally Crime: పెద్దపల్లి జిల్లాలో కోళ్ళ దొంగల కలకలం, లక్షల ఖరీదు చేసే పందెం కోళ్ళ చోరీపై ఫిర్యాదు-complaints about the theft of betting chickens costing lakhs ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Peddapally Crime: పెద్దపల్లి జిల్లాలో కోళ్ళ దొంగల కలకలం, లక్షల ఖరీదు చేసే పందెం కోళ్ళ చోరీపై ఫిర్యాదు

Peddapally Crime: పెద్దపల్లి జిల్లాలో కోళ్ళ దొంగల కలకలం, లక్షల ఖరీదు చేసే పందెం కోళ్ళ చోరీపై ఫిర్యాదు

HT Telugu Desk HT Telugu
Jul 30, 2024 06:00 AM IST

Peddapally Crime: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కోళ్ళ దొంగలు కలకలం సృష్టిస్తున్నారు. రెండు చోట్ల కోళ్ళ చోరీ జరగడంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

పెద్దపల్లిలో పందెం కోళ్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు
పెద్దపల్లిలో పందెం కోళ్ల చోరీపై పోలీసులకు ఫిర్యాదు

Peddapally Crime: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం కాట్నపల్లి, రామగుండం సమీపంలోని బ్రాహ్మణపల్లి గ్రామాల్లో రెండు రోజుల్లో 30 కోళ్ళు చోరీ గురయ్యాయి. రాత్రి వేళల్లో గుట్టు చప్పుడు కాకుండా కోళ్లను ఎత్తుకెళ్లడం సంచలనంగా మారింది. అయితే బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయా ఠాణాల పోలీసులు కోళ్ల దొంగలను పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

కోళ్లను చోరీ చేసేందుకు వచ్చిన ముఠా పకడ్బందీగా వ్యవహరించినట్టుగా తెలుస్తోంది. చోరీ చేసేందుకు గ్యాంగులు వ్యవహరించినట్టుగానే రెక్కి నిర్వహించి మరీ చోరీలకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్నారు. దొంగతనానికి ముందు ఓ కారులో కోళ్లను పెంచుతున్న ప్రాంతాల్లో సంచరించిన ముఠా రెక్కీ నిర్వహించి అదే రోజు రాత్రి వాటిని ఎత్తుకెళ్లినట్టుగా తెలుస్తోంది.

కోళ్ల కోసం శ్రమ..?

అయితే దేశీ కోళ్లు గ్రామీణ ప్రాంతాల్లో పెంచుకోవడం సహజమే. పల్లెల్లో ఆహారం కోసం తిరిగే ఇంటి కోళ్లను పిల్లులు ఎత్తుకెళ్లడం సాధారణంగా వింటుంటాం. కానీ ఇక్కడ పెంచుతున్న కోళ్లకు స్పెషాలిటీ ఉన్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ ముఠా రెక్కి వేసి మరీ చోరీ చేసినట్టుగా అనుమానిస్తున్నారు. కోళ్ల స్పెషాలిటీ ఏంటంటే... పందెం కోసం వాటి యజమానులు పెంచుతున్నట్టుగా తెలుస్తోంది.

సినిమాల్లో చూపించిన విధంగా కోళ్లకు ఇచ్చే దాణా అంతా కూడా ప్రత్యేకంగా ఉంటుంది. జీడిపప్పు, బాదం పిస్తా వంటి పోషకాలు ఉన్న ఆహారాన్ని ఇచ్చి ఈ కోళ్లను పెంచుతుంటారని తెలుస్తోంది. వీటిని సంక్రాంతి సమయంలో ఏపీలో జరిగే కోడి పందాల కోసం సిద్దం చేస్తున్నట్టుగా సమాచారం. ఉక్రోషం, పౌరుషం నింపి వాటిని పెంచినట్టయితే కాలికి కత్తికట్టి మైదానంలోకి దింపితే ప్రత్యర్థి కోడిని ఓడిస్తాయని భావిస్తుంటారు పందెంరాయుళ్లు.

ఇందులో భాగంగానే పందెం కోళ్లను పెంచి పోషించేందుకు కేర్ తీసుకునే యజమానుల వద్ద కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు పందెం కాసేవాళ్లు. ఈ కోళ్ల కోసం ప్ర్యతేకంగా చొరవ తీసుకుని వాటి బలిష్టంగా పెంచితేనే మార్కెట్లో ధర పలుకుతుందని యజమానులు భావిస్తుంటారు.

ధర ఎంతో తెలుసా..?

అయితే ఈ కోళ్లకు మార్కెట్లో డిమాండ్ కూడా బాగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. కాట్నపల్లిలో చోరికి గురైన వాటిలో ఒక కోడికి రూ. 2 లక్షల వరకూ ధర పలుకుతుందని యజమాని చెప్పారు. మిగతా వాటిలో కోడికి రూ. 50 వేల వరకు ధర గిట్టుబాటు అవుతుందని తెలుస్తోంది. బ్రాహ్మణపల్లిలో చోరీకి గురైన ఒక్కో కోడి రూ.50 వేల వరకు ధర పలుకుతుందని ప్రచారం జరుగుతోంది.

తెలంగాణ టు ఏపీ...

సంక్రాంతి సందర్భంగా ఏపీలో కోస్తా జిల్లాల్లో జరిగే కోడి పందాలకు తెలంగాణ కోళ్లు తరలివెల్తున్నాయన్న విషయం ఈ ఘటనతో వెలుగులోకి వచ్చింది. ఏపీలో పౌరుషంతో పెరిగే కోళ్లతో పాటు తెలంగాణలో ఉక్రోషం, పౌరుషం కలగలిపి, బలవర్ధకంగా తయారైన కోళ్లకు కూడా సంక్రాంతి సందర్బంగా డిమాండ్ ఎక్కువగానే ఉన్నట్టుగా స్పష్టం అవుతోంది.

అయితే మార్కెట్లో అత్యంత ఖరీదు పలుకుతున్న ఈ కోళ్లను తస్కరించిన దొంగలు సొమ్ము చేసుకోవాలని భావించారో లేక వాటిని తీసుకెళ్లి సంక్రాంతి పోటీలకు సిద్ధం చేయాలనుకున్నారో తెలియదు కానీ పెద్దపల్లి జిల్లాలో చోరీకి గురైన కోళ్ల వ్యవహారంపై సంచలనంగా మారింది. ఈ విషయంపై పోలీసులు సీరియస్ గా ఆరా తీసేందుకు రంగంలోకి దిగడంతో తమ కోళ్లు తను చేతికి వస్తాయని యజమానులు ఆశిస్తున్నారు.

(రిపోర్టింగ్ కె.వి.రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు)

Whats_app_banner