TG Loan Waiver : రైతు రుణమాఫీ కాని వారికి మరో ఛాన్స్, త్వరలో స్పెషల్ డ్రైవ్
13 August 2024, 21:05 IST
- TG Loan Waiver : తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు రెండు విడతల్లో రూ.1.50 లక్షల వరకు రుణమాఫీ చేసింది. అయితే పలు కారణాలతో కొందరికి రుణమాఫీ కాలేదని, అలాంటి వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
రైతు రుణమాఫీ కాని వారికి మరో ఛాన్స్, త్వరలో స్పెషల్ డ్రైవ్
TG Loan Waiver : తెలంగాణ ప్రభుత్వం రూ.2 లక్షల వరకు రైతు రుణాలు మాఫీ చేస్తుంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ.1.50 లక్షలు వరకు రుణాలు మాఫీ చేసింది. మూడో విడతలో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయనున్నారు. అయితే కొందరు రైతులు తమ రుణాలు మాఫీ కాలేదని ఫిర్యాదు చేస్తున్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని వారికి కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అర్హులై ఉండి రుణమాఫీ కాని వారి కోసం స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఆధార్, పాస్ బుక్ లలో పేర్లు మార్పులు, కుటుంబ సభ్యుల మధ్య పంపకాలు కారణాలతో పలువురికి రుణమాఫీ కాలేదని మంత్రి అభిప్రాయపడ్డారు. రైతులు ఆందోళనకు గురికావొద్దని, అర్హులైన ప్రతి రైతుకు రుణమాఫీ అవుతుందని తెలిపారు.
ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ
కాంగ్రెస్ ప్రభుత్వం జులై 18న రైతు రుణమాఫీని ప్రారంభించింది. మెుత్తం మూడు విడతల్లో మాఫీ చేస్తుంది. ఇప్పటికే రెండు విడతల్లో రూ. లక్షన్నర రుణాలు మాఫీ చేసింది. ఆగస్టు 15న మూడో విడతగా రూ. లక్షన్నర నుంచి రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేయనుంది. మూడో విడత రుణమాఫీ లిస్ట్ ను అధికారులు విడుదల చేయనున్నారు. దీనికి సంబంధించి లిస్ట్ ను రైతులు https://clw.telangana.gov.in/Login.aspx వెబ్ సైట్ లో చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ లిస్ట్ విడుదల చేయకపోతే సంబంధిత ఏఈఓలను సంప్రదించాలని రైతులకు సూచించారు. రెండు విడతల్లో కలిపి 18 లక్షల మంది రైతుల రుణాలు మాఫీ చేశామన్నారు. ఇంకా అర్హులైన రైతులుంటే రుణమాఫీ చేస్తామన్నారు. సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు త్వరలోనే పరిష్కారం చూపుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల తెలిపారు. ఇక తొలివిడత రూ. 6,098 కోట్లతో 11.42 లక్షల మంది రైతులకు రూ.లక్ష వరకు రుణాలు మాఫీ చేసింది ప్రభుత్వం. రెండో విడత రూ.6,500 కోట్లతో 7 లక్షల మందికి లక్షన్నర వరకు రుణమాఫీ చేసింది.
రుణమాఫీ మూడో విడత కార్యక్రమాన్ని ఖమ్మం జిల్లా వైరాలో నిర్వహించనున్నారు. ఈ వేదికపై నుంచే రూ.2 లక్షల వరకు రుణాలున్న రైతుల అకౌంట్లలోకి నిధులు జమ చేయనున్నారు. ఆగస్టు 15 నాటికి రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు ఈ ప్రక్రియను పూర్తి చేయనున్నారు.
రుణమాఫీ కాని వారు తమకు కాల్ చేయాలని బీఆర్ఎస్ కాల్ సెంటర్ నిర్వహిస్తోందని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదేదో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు చేస్తే రైతుల ఆత్మహత్యలు తగ్గేవని కాంగ్రెస్ కౌంటర్ ఇస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు బీమా ఎగ్గొట్టిందని, సాంకేతిక కారణాల సాకుతో 3 లక్షల మంది రైతులకు రుణామాఫీ చేయలేదని విమర్శలు చేస్తున్నారు.