Gutha Sukhender: బీఆర్ఎస్ కు కాక పుట్టిస్తున్న శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి
Gutha Sukhender: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన సొంత పార్టీ బీఆర్ఎస్ లో కాక రేపుతున్నారు. పార్టీ విధానాలపై, నాటి ప్రభుత్వ పాలనపై, పాలకుల తీరుపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కు పెడుతున్నారు.
Gutha Sukhender: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తన సొంత పార్టీ బీఆర్ఎస్ లో కాకరేపుతున్నారు. సాంకేతికంగా శాసన సభ స్పీకర్ కానీ, శాసన మండలి చైర్మన్ కానీ ఏ పార్టీకి చెందిన వారై ఉండరు. ఆ పదవికి ఎన్నికయ్యే వరకు ఉన్న పార్టీ క్రియాశీలక, సాధారణ సభ్యత్వాలకు రాజీనామా చేస్తారు. అపుడు ఏ పార్టీకి చెందిన వారుగా వారు ఉండరు.
వాస్తవానికి శాసన మండలి సభ్యునిగా ఎమ్మెల్యే కోటాలో అవకాశం ఇచ్చింది, శాసన మండలి చైర్మన్ గా రెండో సారి ఆ పదవిలో కూర్చోబెట్టింది బీఆర్ఎస్ అయినా, సాంకేతికంగా ఆయన పార్టీ సభ్యుడు కారు. దీనికి అవకాశంగా తీసుకుని ఇపుడు పార్టీ విధానాలపై, నాటి ప్రభుత్వ పాలనపై, పాలకుల తీరుపై అవకాశం చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నారు.
తాజాగా .. సంచలన విమర్శలు
శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తాజాగా (గురువారం) గత బీఆర్ఎస్ పాలనపై విమర్శలు చేయడమే కాకుండా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానికి కితాబు ఇచ్చారు. ‘‘ కృష్ణా బేసిన్ లో నల్గొండ జిల్లాకి చెందిన సాగునీటి ప్రాజెక్టుల పనులను పూర్తి చేయడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం, గత పాలకులు నిర్లక్ష్యం చేశారు.
గోదావరి నదిపైన ప్రాజెక్టులు త్వరగా పూర్తి చేసి, కృష్ణా బేసిన్లో నిర్మించే ప్రాజెక్టులను అశ్రద్ధ చేశారు. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై చూపించినన శ్రద్ధ, కృష్ణా బేసిన్ లో నిర్మిస్తున్న ప్రాజెక్టులపై చూపలేదన్నారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉమ్మడి నల్గొండ జిల్లాలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టు లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరగా పూర్తి చేసి , జిల్లాను సస్యశ్యామలం చెయ్యాలి. మూసీ రివర్ ఫ్రంట్ ఏర్పాటు మంచి పరిణామం అన్నారు.
సుంకిశాల అవసరం లేని ప్రాజెక్టు అని సుంకిశాల ప్రాజెక్టును ఆనాడే వ్యతిరేకించినట్టు చెప్పారు. సుంకిశాల కోసం పెట్టిన ఖర్చు ఎస్.ఎల్.బి.సి ప్రాజెక్టుకు పెట్టి ఉంటే నల్గొండ జిల్లా రైతులకు, ప్రజలకు మేలు జరిగేది...’’ అని గుత్తా సుఖేందర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ లో దుమారం రేపుతున్నాయి. ఈ ఒక్క సారే అని కాదు.. ఇటీవల కొద్ది నెలలుగా అవకాశం దొరికినప్పుడల్లా ఆయన బీఆర్ఎస్ నాయకత్వంపై విమర్శల దాడి చేస్తూనే ఉన్నారు.
అసలు ఎందుకిలా...?
గుత్తా సుఖేందర్ రెడ్డి మూడుపర్యాయాలు ఎంపీగా పనిచేశారు. మొదటి సారి టీడీపీ నుంచి కాగా, ఆ తర్వాత రెండు పర్యాయాలు కాంగ్రెస్ నుంచి ఎంపీగా గెలిచారు. 2014 లో మూడో సారి ఎంపీగా గెలిచినా.. కొన్నాళ్ళకే ఆయన గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. తన ఎంపీ పదవిలోనే దాదాపు చివరికంటా కొనసాగి ఆ తర్వాత రాజీనామా చేసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన రైతు సమితికి తొలి చైర్మన్ గా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తర్వాత శాసన మండలి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికై, మండలి చైర్మన్ కూడా అయ్యారు.
పదవీ కాలం ముగిశాక, రెండో సారి కూడా ఎమ్మెల్సీగా, మండలి చైర్మన్ గా బాధ్యతలు చేపట్టారు. కానీ, ఆయన కోరుకున్న విధంగా, పార్టీలో చేరే ముందు ఇచ్చిన హామీ మేరకు ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఇవ్వలేక పోయారు. తన రాజకీయ వారసునిగా తన తనయుడు గుత్తా అమిత్ రెడ్డి రాజకీయ అరంగేట్రానికి గుత్తా చాలా ప్రయత్నాలు చేశారు.
నల్గొండ లోక్ సభ స్థానం లేదంటే, భువనగిరి స్థానం నుంచి ఏదో ఒక చోటు నుంచి టికెట్ కావాలని కోరారు. కానీ, జిల్లా నాయకులంతా ముక్త కంఠంతో గుత్తా తనయుడికి టికెట్ ఇవ్వొద్దని, తమ ఓటమిలో గుత్తా సుఖేందర్ రెడ్డి పాత్ర ఉందంటూ అధిష్ఠానికి ఫిర్యాదు చేశారు. దీంతో గుత్తా అమిత్ కు బీఆర్ఎస్ నుంచి ఎంపీ టికెట్ దక్కలేదు. ఈ పరిణామాల తర్వాత అమిత్ బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ గూటికి చేరారు. ఇక, అప్పటి నుంచి గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వంపై, గత ప్రభుత్వంలోని మంత్రులు, నాటి సీఎం కేసీఆర్ పై విమర్శలు చేస్తూనే ఉన్నారు.
మండలి చైర్మన్ పదవిని కాపాడుకునేందుకేనా...?
బీఆర్ఎస్ నుంచి మండలి చైర్మన్ గా ఎన్నికైన గుత్తా సుఖేందర్ రెడ్డి, ఆ పార్టీ అగ్ర నాయకత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుండడంతో తనపై అవిశ్వాసం పెట్టి ఆ పదవి నుంచి తప్పిస్తారేమో అన్న ఆందోళనలో ఉన్నారు. మండలిలో 40 మంది సభ్యులు ఉన్నారు. వాస్తవానికి కాంగ్రెస్ కు ఏమాత్రం బలం లేదు.
చేరికల ముందు వరకు బీఆర్ఎస్ కు 29 మంది సభ్యులు ఉంటే, కాంగ్రెస్ కు కేవలం 4 ఎమ్మెల్సీలే ఉన్నారు. ఇటీవల బీఆర్ఎస్ నుంచి 6 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్ గూటికి చేరారు. ఇపుడు బీఆర్ఎస్ చేతిలో 23 మంది, కాంగ్రెస్ వద్ద 10 మంది ఎమ్మెల్సీలు ఉన్నారు. టీచర్ ఎమ్మెల్సీ(ఇండిపెండెంట్లు ) సహా అంతా కలిపి 38 మంది సభ్యులు ఉన్నారు.
శాసస మండలిలో బీఆర్ఎస్ శాసన సభా పక్షం లేకుండా మూడింట రెండొంతుల మందిని లాగేసే ప్రయత్నాల్లో కాంగ్రెస్ ఉంది. దీనిలో భాగంగానే ఆరుగురు ఎమ్మెల్సీలను చేర్చుకుంది. ఇలా బీఆర్ఎస్ నుంచి కావాల్సినంత మంది వస్తే చైర్మన్ పై అవిశ్వాసం పెట్టడానికే వీలుండదు. ఈ కారణంగానే కాంగ్రెస్ పార్టీలో నేరుగా చేరే అవకాశం లేకపోవడం, గుత్తా అనధికారికంగా కాంగ్రెస్ వ్యక్తిగానే భావిస్తూ బీఆర్ఎస్ పై, గత ప్రభుత్వ విధానాలపై విమర్శల గళం వినిపిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఆయన ఇప్పటికే బీఆర్ఎస్ కు దూరమై, మానసికంగా కాంగ్రెస్ కు దగ్గర అయ్యారని అభిప్రాయ పడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఆయన సొంత జిల్లా నల్గొండ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో బీఆర్ఎస్ పట్టించుకోలేదని విమర్శించడానికి సుంకిశాలలో చేపట్టిన తాగునీటి ప్రాజెక్టు పంప్ హౌజ్ సర్జ్ పూల్ రిటైనింగ్ వాల్ కూలిపోవడం, ఈ పథకం కోసం ఏకంగా రూ.2,215 కోట్లు వెచ్చించనుండడం, ఎస్.ఎల్.బి.సి సొరంగ మార్గాన్ని అసలే పట్టించుకోవపోవడం వంటి అంశాల ప్రాతిపదికగా మరో మారు గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ పై విరుచుకుపడ్డారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
( రిపోర్టింగ్ : క్రాంతీపద్మ, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు, ఉమ్మడి నల్గొండ ప్రతినిధి )