Minister Ponnam Prabhakar : మంత్రి పొన్నం ప్రభాకర్ కు చుక్కెదురు, రుణమాఫీ కాలేదని ప్రశ్నించిన మహిళా రైతు
Minister Ponnam Prabhakar : రుణమాఫీపై గొప్పగా చెప్పేందుకు ప్రయత్నించిన మంత్రి పొన్నం ప్రభాకర్ కు మహిళా రైతు షాకిచ్చారు. తన రూ.80 వేల రుణం మాఫీ కాలేదని, రేషన్ కార్డు ఉంటేనే రుణమాఫీ చేస్తున్నారని, ఎప్పుడు రేషన్ కార్డులు ఇస్తారని ప్రశ్నించింది.
Minister Ponnam Prabhakar : అనుకున్నదొక్కటి.. అయింది మరొకటి... అన్నచందంగా మారింది మంత్రి పొన్నం ప్రభాకర్ పరిస్థితి. రైతుల పంట రుణ మాఫీపై మంత్రి పొన్నం గొప్పగా చెప్పేందుకు ప్రయత్నించగా ఓ మహిళా రైతు నిలదీసినంత పనిచేశారు. 1,50,000 వరకు రుణమాఫీ అయిందా అంటూ ఆరా తీసిన మంత్రిని, రేషన్ కార్డు లేదని తన 80 వేల రుణం మాఫీ కాలేదని, అది ఎప్పుడు చేస్తారని ప్రశ్నించారు. అవాక్కైన మంత్రి పొన్నం, మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు అందజేస్తే త్వరలోనే సమస్య పరిష్కారం అవుతుందని తెలిపారు.
రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న ఉమ్మడి కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పర్యటించారు. 1,50,000 రుణమాఫీ అయిన తర్వాత, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో నియోజకవర్గంలో మంత్రి సుడిగాలి పర్యటనతో హల్ చల్ చేశారు. గతంలో కేసీఆర్ దత్తత తీసుకున్న చిగురుమామిడి మండలం చిన్నములకనూర్ గ్రామ శివారులో వరి నాట్లు వేస్తున్న రైతులను చూసి ఆగి పంట రుణమాఫీపై ఆరా తీశారు. వరి నాట్లు వేస్తున్న మహిళలతో ముచ్చటించారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం రైతుల పంట రుణాలు మాఫీ చేస్తుందని తెలిపారు. ఇప్పటికే లక్ష , లక్ష 50 వేల లోపు ఉన్న వారికి రుణమాఫీ పూర్తయిందని చెప్పారు.
మీలో ఎంతమందికి రుణమాఫీ అయిందని ప్రశ్నించగా ఓ మహిళా రైతు తనకు 80 వేలు మాత్రమే రుణం ఉందని, రేషన్ కార్డు లేదని రుణమాఫీ చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మరి రేషన్ కార్డు ఎప్పుడు ఇస్తారు.. మా రుణమాఫీ ఎప్పుడైతదని ప్రశ్నించడంతో అవాక్కైన మంత్రి త్వరలోనే అందరికీ రెండు లక్షల వరకు మాఫీ అవుతుందన్నారు. ఒకవేళ ఇప్పుడు రుణమాఫీ కాని వారు వెంటనే మండల వ్యవసాయ అధికారిని కలిసి వివరాలు ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వం పంటల బీమా పథకాన్ని అమలు చేస్తుందని చెప్పారు. గతంలో పంట నష్టపోయిన వారికి ఎలాంటి నష్ట పరిహారం వచ్చేది కాదు.. ఇప్పుడు పంటల బీమా తో రైతులకు నష్టపరిహారం సైతం వస్తుందని తెలిపారు. రైతులు ఆందోళన చెందవద్దని, తమది రైతు ప్రభుత్వమని, రైతు సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు.
బండిపై గ్రామంలో పర్యటించిన మంత్రి పొన్నం
చిగురుమామిడి మండలం ఇందుర్తి గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ బైక్ పై గ్రామంలో పర్యటించారు. కార్యకర్త బైక్ పై కూర్చుని గ్రామంలో వాడవాడలా తిరిగారు. ఇటీవల కురిసిన వర్షానికి రోడ్లు ధ్వంసమై గుంతలు పడ్డ రోడ్డు మీద బైక్ పై ప్రయాణించిన మంత్రి పొన్నం, గ్రామంలోని సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రోడ్లు ఇలా ఉన్నాయి... ఏంటని ఆరా తీశారు. వెంటనే రోడ్డు మరమ్మత్తు పనులు చేపట్టి గ్రామంలో పారిశుద్ధ్య పనులను మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్థులకు సూచించారు.
పరామర్శలు.. సమస్యల పరిశీలన
నియోజకవర్గంలోని చిగురుమామిడి, సైదాపూర్, కొహెడా, హుస్నాబాద్ మండలాల్లో పర్యటించిన మంత్రి పొన్నం ప్రభాకర్ పలు గ్రామాల్లో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించారు. ఆయా గ్రామాల్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. గౌరవెల్లి ప్రాజెక్టుకు రాష్ట్రం ప్రభుత్వం రూ.437 కోట్లు కేటాయించడంతో త్వరలోనే గోదావరి జల్లాలు మెట్ట ప్రాంతమైన హుస్నాబాద్ నియోజకవర్గంతో పాటు స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గానికి అందుతాయని ప్రకటించారు. ఇప్పటికే గౌరవెల్లి ప్రాజెక్టు పనులు దాదాపు పూర్తికాగ కెనాల్ పనులు చేయాల్సి ఉందని రాబోయే మూడేళ్లలో కాలువ పనులు పూర్తిచేసి సాగునీరు అందిస్తామని తెలిపారు.
రిపోర్టింగ్: కె.వి రెడ్డి ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగు.
సంబంధిత కథనం