TS Assembly Elections 2023: కీలకమైన ఆ సీటుపై కేటీఆర్ తేల్చేశారా..?
01 February 2023, 15:57 IST
- telangana assembly election 2023: ఎన్నికల ఏడాది కావటంతో తెలంగాణలో రాజకీయాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. ఇక అధికార పార్టీ(బీఆర్ఎస్)లో స్వరాలు మారుతున్నాయి. మరోవైపు టికెట్ల అంశం కూడా తెరపైకి వస్తోంది. ఈ క్రమంలో బీఆర్ఎస్ హుజురాబాద్ టికెట్ అంశం మరోసారి చర్చనీయాంశంగా మారింది.
హుజురాబాద్ లో మంత్రి కేటీఆర్
BRS Huzurabad Politics: హుజురాబాద్... గతేడాది తెలంగాణ రాజకీయాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా కూడా చర్చ జరిగిన నియోజకవర్గం. ప్రభుత్వం వర్సెస్ ఈటల రాజేందర్ అన్నట్లు సాగిన ఇక్కడి ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన ఈటల.. ఘన విజయం సాధించారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గెల్లు శ్రీనివాస్ ఓటమిపాలయ్యారు. ఈ ఉపఎన్నికల వేళ... చేరికలు కూడా ఆసక్తిని రేపాయి. ఈ సీటును కోల్పోయినప్పటికీ... అధికార బీఆర్ఎస్ మాత్రం నియోజకవర్గంపై ఓ కన్నేసే ఉంచింది. తాజాగా మంత్రి కేటీఆర్ పర్యటించిన వేళ... వచ్చే ఎన్నికలకు సంబంధించి క్లియర్ కట్ హింట్ ఇచ్చేశారు. ఇదీ కాస్త... హుజురాబాద్ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.
ఇదే ఏడాది తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీలు లెక్కలు వేసుకునే పనిలో పడ్డాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ పార్టీ కూడా పక్కాగా పావులు కదుపుతోంది. జిల్లాల వారీగా ఫోకస్ పెడుతోంది. ఈ క్రమంలో ముఖ్య నేతలు జిల్లాల పర్యటనకు వెళ్తున్నారు. తాజాగా మంత్రి కేటీఆర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించారు. ఇందులో భాగంగా హుజురాబాద్ లో తలపెట్టిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేటీఆర్.. ఈటెలను ఓ రేంజ్ లో టార్గెట్ చేశారు. ఇదే సమయంలో కేటీఆర్... మరో హింట్ ఇచ్చారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో హుజురాబాద్ ను బీఆర్ఎస్ ఖాతాలోకి వేసుకోవాలని అంటూనే... అభ్యర్థి విషయంలోనూ పరోక్షంగా పలు వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎనిమిది నెలలు ప్రజాక్షేత్రంలో ఉండాలని ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డికి సూచించారు. ఫలితంగా వచ్చే ఎన్నికలలో ఈటల రాజేందర్ ను కౌశిక్ రెడ్డి ఢీ కొట్టబోతున్నట్టుగా అటు పార్టీ వర్గాలలోను, స్థానికులలోను చర్చ జరుగుతుంది.
నిజానికి గత ఎన్నికల్లో ఈ సీటు నుంచి విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ పోటీ చేశారు. ప్రస్తుతం కూడా ఆయనే నియోజకవర్గం ఇంఛార్జ్ గా ఉన్నారు. మరోవైపు కౌశిక్ రెడ్డి, గెల్లు మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉంది. ఈ క్రమంలో హుజురాబాద్ వేదికగా మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు... ఆసక్తికరంగా మారాయి. గత ఉపఎన్నికలో హుజురాబాద్ టికెట్ దక్కించిన గెల్లు శ్రీనివాస్... వచ్చే ఎన్నికల్లోనూ మరోసారి అవకాశం దక్కుతుందని భావిస్తూ వస్తున్నారు. యాక్టివ్ గా పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలతో... గెల్లుకు షాక్ తగిలినట్లు అయింది. అయితే గెల్లుకు ఎమ్మెల్సీ లేదా కార్పొరేషన్ ఛైర్మన్ ఇచ్చే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. అయితే దీనిపై ఎన్నికల నాటికి పూర్తిస్థాయిలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.