KTR: శిఖండి రాజకీయం చేస్తున్నారు... బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్-minister ktr fires on bjp leaders over munugodu bypoll ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Ktr: శిఖండి రాజకీయం చేస్తున్నారు... బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

KTR: శిఖండి రాజకీయం చేస్తున్నారు... బీజేపీపై మంత్రి కేటీఆర్ ఫైర్

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 09:50 PM IST

munugodu bypoll 2022: ఆలేరు మాజీ ఎమ్మెల్యే భిక్షమయ్య గౌడ్ టీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటీఆర్‌, జగదీశ్ రెడ్డి సమక్షంలో చేరారు. ఈ సందర్బంగా మాట్లాడిన కేటీఆర్… బీజేపీ నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

<p>టీఆర్ఎస్ లోకి బిక్షమయ్య గౌడ్</p>
టీఆర్ఎస్ లోకి బిక్షమయ్య గౌడ్ (twitter)

Minister KTR Fires On BJP: బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసిందన్నారు మంత్రి కేటీఆర్. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని మండిపడ్డారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీజేపీ నేత, ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్ తో పాటు పలువురు బీజేపీ నేతలు టీఆర్ఎస్ లో చేరారు. వీరికి మంత్రి కేటీఆర్, జగదీశ్ రెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. బీజేపీ ఒక దుష్ట సంస్కృతికి తెర తీసిందన్నారు. అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేసింది అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. మునుగోడులో ధనబలంతో గెలవాలని బీజేపీ ప్రయత్నిస్తున్నది అని మండిపడ్డారు. చిత్తశుద్ధితో సంక్షేమానికి, అభివృద్ధికి కట్టుబడి పని చేస్తున్నామని కేటీఆర్ స్పష్టం చేశారు. ఫ్లోరైడ్ విషయంలో ఆరు దశాబ్దాలుగా కాని పనిని నాలుగేండ్లలో చేసి చూపెట్టామని తెలిపారు. ఆడబిడ్డలకు నీటి కష్టాలు లేకుండా చేశామన్నారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ ఉపాధి కల్పన దిశగా దండుమల్కాపూర్‌లో పారిశ్రామిక సమూహాన్ని ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు.

భిక్షమయ్య గౌడ్‌ రాకతో మరింత బలంతో, ఉత్సాహంతో ముందుకు పోతామన్నారు మంత్రి కేటీఆర్. వ్యవస్థలన్నీ దుర్వినియోగం చేస్తున్న విషయం మనకు కనబడుతుందని... వ్యవస్థలను అడ్డం పెట్టుకుని, బీజేపీ శిఖండి రాజకీయం చేస్తోందని కేటీఆర్ నిప్పులు చెరిగారు. కానీ నల్లగొండ బిడ్డలు చైతన్యవంతులు, సాగర్ హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో బ్రహ్మాండమైన తీర్పు ఇచ్చారని గుర్తు చేశారు. ఈసారి కూడా మునుగోడులో కూడా అదే తీర్పు పునరావృతం అవుతుందన్నారు.

జైలుకు వెళ్లొచ్చిన బిడ్డ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అని కేటీఆర్ అన్నారు. ఉద్యమం ప్రారంభించినప్పటి నుంచి టీఆర్‌ఎస్‌ పార్టీని వెన్నంటి ఉన్న నాయకుడు అని తెలిపారు. అలాంటి నాయకుడిని ప్రజలు గుండెలకు హత్తుకుంటారన్న నమ్మకం పేర్కొన్నారు. ఈ ఎన్నిక తెలంగాణ భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపనుందని చెప్పారు. చైతన్యంతో కూడిన తీర్పును ఇవ్వాలన్నారు. తిరుగులేని తీర్పును ఇచ్చి.. తప్పకుండా బీజేపీకి బుద్ధి చెప్పాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.

ఇక మునుగోడు నియోజకవర్గానికి చెందిన బీజేపీ నేత జగన్నాథంతో మాట్లాడింది తానే అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేసిన అభివృద్ధి గురించి చెప్పామని తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం