Telangana Politics: ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాక్… మాజీ ఎమ్మెల్యే రాజీనామా-ex mla budida bikshamaiah goud resigns to bjp party ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Telangana Politics: ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాక్… మాజీ ఎమ్మెల్యే రాజీనామా

Telangana Politics: ఉప ఎన్నిక వేళ బీజేపీకి షాక్… మాజీ ఎమ్మెల్యే రాజీనామా

HT Telugu Desk HT Telugu
Oct 20, 2022 02:25 PM IST

తెలంగాణ బీజేపీకి షాక్ తగిలింది. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్య గౌడ్‌ రాజీనామా చేశారు. బీజేపీలో బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.

మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్,
మాజీ ఎమ్మెల్యే బిక్షమయ్య గౌడ్, (twitter)

bikshamaiah goud resigns to bjp: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో వేగంగా పావులు కదుపుతోంది బీజేపీ. గౌడ సామాజికవర్గానికి చెందిన నర్సయ్య గౌడ్ ను పార్టీలోకి తీసుకురావటంతో... టీఆర్ఎస్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో గత కొద్దిరోజుల కిందట బీజేపీలో చేరిన ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్.... కీలక నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

బీజేపీలో బడుగు, బలహీనవర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు బిక్షమయ్య గౌడ్. తెలంగాణపై బీజేపీ వివక్ష చూపుతోందని అన్నారు. బీజేపీలో అడుగడుగునా అవమానాలే ఎదురయ్యాయని తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఆర్థిక లాభం కోసమే మునుగోడు ఉప ఎన్నిక అని విమర్శించారు.

లేఖలో ఏం చెప్పారంటే...

కేంద్రం నుంచి వచ్చిన ప్రధానమంత్రి నుంచి మొదలుకొని కేంద్ర మంత్రుల దాకా ప్రతి ఒక్కరు డబుల్ ఇంజన్ సర్కార్ పేరిట మాటలు చెప్పడమే కానీ ఇప్పటిదాకా ఒక్క పైసా అదనపు సహాయాన్ని తెలంగాణకు చేయలేదు.

గత రెండున్నర దశాబ్దాల నా రాజకీయ ప్రస్థానంలో బడుగు బలహీన వర్గాల ప్రయోజనాల కోసం కృషి చేశాను. భారతీయ జనతా పార్టీలో చేరిన తర్వాత అనేక పర్యాయాలు కేంద్రంలో బలహీన వర్గాల మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ వచ్చిన ప్రతిసారి ఎంతో ఆశగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అశించాను. కానీ ప్రతిసారి నిరాశను ఎదురైంది. దీంతోపాటు నాతోటి బిసి సోదరులైన నేతన్నల సమాజం భవిష్యత్తును సంక్షోభంలోకి నెట్టేలా, వారికున్న అన్ని సంక్షేమ కార్యక్రమాలను రద్దు చేయడంతోపాటు, దేశం చరిత్రలో చేనేతపైన తొలిసారి పన్ను వేసిన కేంద్ర నిర్ణయం వెనక్కి తీసుకోవాలని నా పద్మశాలి సొదరులు చేసిన విజ్ఝప్తిని కేంద్రం పెడచెవిన పెట్టింది.

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న స్థానిక నాయకత్వంపైన ఢిల్లీలోని బిజెపి హై కమాండ్ కి ఏ మాత్రం పట్టులేదనే విషయం నాకు పార్టీలో చేరిన కొద్ది కాలనికే అర్థమైంది. గత దశాబ్ద కాలంగా తెలంగాణలో ఎలాంటి మత సంఘర్షణలు ఆందోళనలు లేకుండా కొనసాగుతున్న ప్రశాంతమైన శాంతియుత వాతావరణాన్ని చెడగొట్టేలా స్థానిక బిజెపి నాయకులు ఉద్వేగాలు పెంచేలా మాట్లాడినా, బిజెపి హై కమాండ్ స్పందించకపోవడం నన్ను ఎంతో కలతకు గురిచేసింది. హిందు సమాజం భావోద్వేగాలను రెచ్చగొట్టి, వాటిని రాజకీయాల కోసం ఉపయోగించుకోవడమే పనిగా పెట్టుకున్న భారతీయ జనతా పార్టీ, ఇప్పటిదాకా ఆధునిక భారతదేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అద్భుతంగా నిర్మించిన యాదాద్రి దేవాలయానికి ఒక్క రూపాయి కూడా సహాయం చేయలేదు.

నల్లగొండలో కోమటిరెడ్డి సోదరుల తీరుతో వందల మంది గౌడ సోదరుల రాజకీయ జీవితాలను సమాధి చేశారు. కోమటి రెడ్డి సొదరుల దుర్మార్గపు రాజకీయల నుంచి దూరంగా పోయేందుకే బీజేపీలో చేరాను. కానీ రాజగోపాల్ రెడ్డి తన కాంట్రాక్టుల కోసం పార్టీ మారి బిజెపిలోకి వచ్చారు. అయన వేల కోట్ల అర్ధిక లాభం కోసం ఉపఎన్నిక తెచ్చి, బిజెపి పార్టీ బిసిల మనోభావాలకు విలువ లేకుండా చేసింది. రాజగోపాల్ రెడ్డి రాజకీయాలకు వ్యతిరేఖంగా బిజెపి పార్టికి రాజీనామా చేయాలని నిర్ణయం తీసుకున్నాను.

ఇక, భిక్షమయ్య గౌడ్ విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీలో రాజకీయ జీవితం ప్రారంభించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా(2009) పనిచేశారు. ఇక 2014 , 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన భిక్షమయ్య గౌడ్.. టీఆర్ఎస్ అభ్యర్థి గొంగిడి సునీత చేతిలో పరాజయం పాలయ్యారు. అయితే ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన టీఆర్ఎస్ పార్టీలో చేరారు. టీఆర్‌ఎస్‌లో సరైన గుర్తింపు దక్కడం లేదని భావించిన భిక్షమయ్య గౌడ్.. ఈ ఏడాది ఏప్రిల్‌లో బీజేపీలో చేరారు.

మళ్లీ టీఆర్ఎస్ లోకి...!

బిక్షమయ్య గౌడ్ తిరిగి టీఆర్ఎస్ లోకి వస్తారని తెలుస్తోంది. శుక్రవారం మంత్రి కేటీఆర్... చౌటుప్పల్ లో రోడ్ షోను నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన కేటీఆర్ సమక్షంలో చేరుతారని సమాచారం.

మరోవైపు మునుగోడు నియోజకవర్గానికి చెందిన పలువురు బీజేపీ నేతలు, కార్యకర్తలు టీఆర్ఎస్ లో చేరారు. టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మునుగోడు జెడ్పీటీసీ సభ్యులు నారబోయిన రవి ముదిరాజ్ ఆధ్వర్యంలో వీరందరూ మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు.

IPL_Entry_Point