Tamil Nadu: అసెంబ్లీ నుంచి గవర్నర్ వాకౌట్.. అనూహ్య సంఘటన: సర్కార్ వర్సెస్ గవర్నర్.. కారణమిదే..
Tamil Nadu Governor RN Ravi Walked out of Assembly: తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య సంఘటనలు జరిగాయి. గవర్నర్ ఆర్ఎన్ రవి సభ నుంచి వాకౌట్ చేశారు. గవర్నర్‌పై సీఎం స్టాలిన్‍తో పాటు అధికార డీఎంకే ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Tamil Nadu Governor RN Ravi Walked out of Assembly: తమిళనాడు అసెంబ్లీలో అనూహ్య సంఘటనలు జరిగాయి. శీతాకాల సమావేశాల తొలి రోజున ఏకంగా గవర్నర్.. సభ నుంచి వాకౌట్ చేశారు. సాధారణంగా ప్రభుత్వ తీరును నిరసిస్తూ ప్రతిపక్ష సభ్యులు వాకౌట్ చేస్తుంటారు. అయితే, తమిళనాడు అసెంబ్లీ నుంచి గవర్నర్ ఆర్ఎన్ రవి.. సోమవారం (జనవరి 9) వాకౌట్ చేయడం దుమారాన్ని రేపుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రారంభ ప్రసంగంలో కొన్ని పదాలను గవర్నర్ ఉద్దేశ్యపూర్వకంగా వదిలేశారని, తన మాటలను జత చేశారని అధికార డీఎంకే ఆగ్రహం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ (Tamil Nadu CM MK Stalin) తో పాటు డీఎంకే ఎమ్మెల్యేలు (DMK MLAs) అసెంబ్లీలో నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగానికి వ్యతిరేకంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టడంతో పాటు నినాదాలు చేశారు. పూర్తి వివరాలు ఇవే.
పదాలను ఎగరగొట్టిన గవర్నర్
రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగంలోని కొన్ని పదాలను తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి.. అసెంబ్లీలో చదవలేదని డీఎంకే ఎమ్మెల్యేలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిని స్కిప్ చేస్తూ ప్రసంగం చేశారని ఆరోపించారు. ‘ద్రవీడియన్ మోడల్ ఆఫ్ గవర్నెన్స్’ (Dravidian Model of Governance)తో పాటు మరికొన్ని పదాలను గవర్నర్ ఎగరగొట్టారు. కొన్ని వాక్యాలను ఆయన సొంతంగా చెప్పారు. దీంతో గవర్నర్ ప్రసంగాన్ని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్‍తో పాటు ఎమ్మెల్యేలు అడ్డుకున్నారు. ప్రసంగంలో కొన్ని భాగాలను వదిలేస్తున్నారంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ సంప్రదాయాలను గవర్నర్ మంటగలిపారని సీఎం స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘గవర్నర్ ప్రసంగం తొలగింపు’పై తీర్మానం
రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన ప్రారంభ ప్రసంగాన్ని మాత్రమే అసెంబ్లీ రికార్డుల్లో ఉంచాలని, గవర్నర్ జత చేసిన భాగాన్ని రికార్డుల నుంచి తొలగించాలని అధికార డీఎంకే.. సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో గవర్నర్ ఆర్ఎన్ రవి.. అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. బహుశా ఓ గవర్నర్ సభ నుంచి వాకౌట్ చేయడం అసెంబ్లీ చరిత్రలో ఇదే తొలిసారి కావొచ్చు.
మరోవైపు, గవర్నర్ తీరుకు నిరసనగా డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం, వీసీకే పార్టీల ఎమ్మెల్యేలు కూడా సభ నుంచి వాకౌట్ చేశారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ భావజాన్ని రుద్దొద్దు అంటూ గవర్నర్‌కు వ్యతిరేకంగా డీఎంకే ఎమ్మెల్యేలు నినాదాలు చేశారు. క్విట్ తమిళనాడు అనే నినాదాలు సభలో హోరెత్తాయి. గవర్నర్‌ను వెంటనే తొలగించాలని కాంగ్రెస్ ఎంపీ కార్తీ పి.చిదంబరం ట్వీట్ చేశారు.
తమిళనాడు పేరును తమిళగమ్‍గా మార్చాలని గవర్నర్ ఆర్ఎన్ రవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు కూడా దుమారాన్ని రేపాయి. దీనిపై కూడా అధికార డీఎంకే ఆగ్రహంతో ఉంది.