BRS to boycott President address: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్-brs to boycott president murmu s joint address to parliament today
Telugu News  /  Telangana  /  Brs To Boycott President Murmu's Joint Address To Parliament Today
ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (PTI)

BRS to boycott President address: రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనున్న బీఆర్ఎస్

31 January 2023, 7:50 ISTHT Telugu Desk
31 January 2023, 7:50 IST

BRS to boycott President address: రాష్ట్రపతి ప్రసంగాన్ని బీఆర్ఎస్ బహిష్కరించనుంది. విపక్షాలు కూడా కలిసివస్తాయని ఆశిస్తోంది.

న్యూఢిల్లీ: కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో తలపడుతున్న బీఆర్ఎస్ నేడు పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేడు ఉభయ సభల సభ్యులను ఉద్దేశించి ప్రసంగించనున్నారు.

బీఆర్ఎస్‌ సభ్యులతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించనుంది. ఎన్‌డీఏ ప్రభుత్వ వైఫల్యాలకు నిరసనగా రెండు పార్టీలు ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టనున్నాయి.

దేశంలో అత్యున్నత రాజ్యాంగ పదవిలో ఉన్న రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడానికి గల కారణాలను బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి సమర్థించారు. రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించేందుకు చాలినన్ని కారణాలు ఉన్నాయని అన్నారు.

‘గవర్నర్ పదవి కూడా రాజ్యాంగబద్ధమైనదే. కానీ తెలంగాణ గవర్నర్ ఏం చేస్తున్నారో చూడండి. అదొక్క కారణం చాలు మేం రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించడానికి..’ అని రంజిత్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా ఇతర విపక్షాలు కూడా రాష్ట్రపతి ప్రసంగాన్ని బహిష్కరించేలా బీఆర్ఎస్ ప్రయత్నం చేసినట్టు తెలుస్తోంది.

‘ఏది ముఖ్యమో మేం చేస్తాం. తెలంగాణ ప్రజల వాణిని వినిపిస్తాం. ఇతర ప్రతిపక్ష పార్టీల మద్దతు కూడా దక్కుతుందని ఆశిస్తున్నాం..’ అని ఎంపీ వివరించారు.

కేంద్రంలో బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం, రాష్ట్రంలో బీఆర్‌ఎస్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఇటీవలికాలంలో సఖ్యత కొరవడింది. ప్రధాన మంత్రి నేతృత్వంలో జరుగుతున్న పలు సమావేశాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ గైర్హాజరయ్యారు.

కాగా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు నేడు మంగళవారం ప్రారంభం కానున్నాయి. అయితే వివిధ అంశాలపై విపక్షాలు సభను స్తంభింపజేసే అవకాశం కనిపిస్తోంది. అదానీ గ్రూప్ స్టాక్స్ పతనం, ప్రధాన మంత్రిపై బీబీసీ డాక్యుమెంటరీ సిరీస్ వంటి అంశాలను విపక్షాలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది.

అయితే ప్రతిపక్షాలు లేవెనెత్తే అన్ని అంశాలపై చర్చించేందుకు కట్టుబడి ఉన్నామని అధికార పక్షం ఇప్పటికే స్పష్టం చేసింది.

ఉభయ సభల సభ్యులను ఉద్దేశించే చేసే రాష్ట్రపతి ప్రసంగంతో పార్లమెంటు బడ్జెట్ సెషన్ ప్రారంభమవుతుంది. ప్రసంగం పూర్తయ్యాక ఆర్థిక మంత్రి ఎకనమిక్ సర్వేను ప్రవేశపెడతారు. అనంతరం సభ వాయిదా పడుతుంది. రేపు ఫిబ్రవరి 1న ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెడతారు. బడ్జెట్ సెషన్ ఫిబ్రవరి 13న తొలి విడత ముగుస్తుంది. రెండో విడత సమావేశాలే మార్చి 13న ప్రారంభమై ఏప్రిల్ 6న ముగుస్తాయి.

 

టాపిక్