Hyderabad Metro: మళ్లీ టెక్నికల్ సమస్య… ఎక్కడికక్కడే ఆగిన మెట్రో రైళ్లు
11 November 2022, 13:59 IST
- Hyd Metro Train Technical Problem:హైదరాబాద్ మెట్రో రైలు మరోసారి ఆగిపోయింది. మియాపూర్-ఎల్బీ నగర్, ఎల్బీనగర్-మియాపూర్ రూట్ లో సుమారు 30 నిమిషాలకు పైగా సేవలు నిలిచిపోయాయి.
హైదరాబాద్ మెట్రో (ఫైల్ ఫొటో )
Hyd Metro Train Stopped: హైదరాబాద్‌లో మెట్రోలో మరోసారి సాంకేతిక లోపం తలెత్తింది. ఫలితంగా లక్డీకాపూల్ స్టేషన్‌లో మెట్రో రైలు నిలిచిపోయింది. మియాపూర్-ఎల్బీ నగర్, ఎల్బీనగర్-మియాపూర్ మార్గాల్లో సుమారు అరగంటకు పైగా సేవలు నిలిచిపోయాయి. ఆ తర్వాత పునరుద్ధరణ చర్యలు చేపట్టడంతో రైళ్లు తిరిగి బయల్దేరాయి. సేవలకు అంతరాయం కలగడంతో ఆయా మార్గాల్లో వెళ్తున్న రైళ్లను వివిధ స్టేషన్లలో నిలిపేశారు.
ఇక హైదరాబాద్ మెట్రోలో సాంకేతిక లోపం తలెత్తటం ఇదే తొలిసారికాదు. ఇటీవలి కాలంలో తరచుగా సాంకేతికంగా లోపాలు బయటపడుతున్నాయి.మరోవైపు రైళ్లు ఆగిపోవడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. మెట్రో రైళ్లు 30 నిమిషాలకు పైగా నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు.
గతంలోనూ ఇలాగే...
మే నెలలోనూ మెట్రో రైలులో సాంకేతిక లోపం తలెత్తింది. ఈ కారణంగా మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ మెట్రో కారిడార్‌లో రాకపోకలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. లక్డీకపూల్ స్టేషన్ ముందు 35 నిమిషాలు ఆగింది రైలు. రైలులో సమస్య వచ్చిందని ప్రయాణికులను అధికారులు దించేశారు. ఇదే నెలలో ముసారాంబాగ్ స్టేషన్‌లో సాంకేతిక కారణంతో రైలు ఆగింది. 20 నిమిషాల పాటు రైలు ఆగడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముందు రైలు ఆగడంతో.. వెనక వస్తున్న రైళ్లకు అంతరాయం ఏర్పడుతుంది. దీంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేశారు.
ఫిబ్రవరి నెలలోనూ హైదరాబాద్ మెట్రో సేవల్లో అంతరాయం ఏర్పడింది. మియాపూర్-ఎల్బీ నగర్ మార్గంలో అసెంబ్లీ స్టేషన్‌లో మెట్రో రైలు ఆగిపోయింది. 20 నిమిషాలకుపైగా ఎక్కువ సమయం రైలు ఆగిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే భాగ్యనగరంలో ఇలా అప్పుడప్పుడు సాంకేతిక సమస్యలతో మెట్రో రైళ్లు నిలిచిపోతున్నాయి. రద్దీ సందర్భాల్లో మెట్రో సేవలు నగరవాసులకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయనేది నిజం. రోడ్డు మీద వెళితే ట్రాఫిక్ సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కానీ మెట్రోతో ఎల్బీ నగర్ నుంచి మియాపూర్, నాగోల్ నుంచి రాయదుర్గం వరకు ప్రయాణికులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్కువ సమయంలో ప్రయాణం చేస్తున్నారు.
టాపిక్