Hyderabad Metro: అలర్ట్… మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తే ఇక జైలుకే-hyd metro strong warning to public over posters on metro pillars ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  Telangana  /  Hyd Metro Strong Warning To Public Over Posters On Metro Pillars

Hyderabad Metro: అలర్ట్… మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తే ఇక జైలుకే

HT Telugu Desk HT Telugu
Sep 23, 2022 03:19 PM IST

hyderabad metro alert: హైదరాబాద్ మెట్రో సంస్థ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇష్టానుసారంగా మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేసింది.

హైదరాబాద్ మెట్రో అలర్ట్
హైదరాబాద్ మెట్రో అలర్ట్ (twitter)

Hyd Metro On Posters Ban:మెట్రో పిల్లర్లకు పోస్టర్లు అతికించటాన్ని సీరియస్ గా తీసుకుంది హైదరాబాద్ మెట్రో సంస్థ. ఇలా చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. రాజకీయ నాయకులు, వాణిజ్య ప్రకటనకర్తలు మెట్రో పిల్లర్లు, రైల్వే స్టేషన్లను ప్రకటనల కేంద్రంగా మార్చుకోవటం సరికాదని... ఇలా అనుమతుల్లేకుండా పిల్లర్లకు పోస్టర్లు అతికిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. నిబంధనలు అతిక్రమిస్తే వెయ్యి రూపాయల జరిమానాతో పాటు 6 నెలల జైలు శిక్ష విధిస్తామని మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు

మెట్రో పిల్లర్స్‌పై ఇష్టానుసారంగా పోస్టర్లు అంటించిన వారిపై సెంట్రల్‌ మెట్రో యాక్ట్‌ ప్రకారం ఆరు నెలల జైలు శిక్ష విధించే చట్టాన్ని పకడ్బందీగా అమలుచేయనున్నట్లు సంస్థ యాజమాన్యం ప్రకటించింది. ఇక మీదట ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని స్పష్టం చేసింది. మెట్రో పిల్లర్స్‌కు ఏర్పాటు చేసిన ప్రకటన బోర్డుల ద్వారా తమ ప్రచార కార్యకలాపాలను కొనసాగించుకోవచ్చని, అందుకోసం ప్రకటన ఏజెన్సీలను ఆశ్రయించాలని సూచించింది. ఎవరికి వారు పోస్టర్లు అంటిస్తే చర్యలు తప్పవని.. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరింది.

గతంలో కూడా ఆదేశాలు...

hyderabad metro strong notice to public: కొద్దిరోజుల కిందట హైదరాబాద్‌ మెట్రో సంస్థ...ఓ బహిరంగ ప్రకటన కూడా చేసింది. మెట్రో సంస్థలకు ఎలాంటి నష్టం కలిగించినా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. హైదరాబాద్‌ మెట్రో రైల్‌కు సంబంధించిన ప్రాపర్టీల్లో పోస్టర్లు అతికించడం/పెట్టడం వంటివి చేయొద్దని... ఏదైనా విషయాన్ని రాయడం, గీయడం లాంటి నష్టం కలిగిస్తే చర్యలుంటాయని పేర్కొంది. హైదరాబాద్ మెట్రో రైల్ అడ్మినిస్ట్రేషన్ ఏర్పాటు చేసిన లేదా పోస్ట్ చేసిన ఏదైనా బోర్డు, డాక్యుమెంట్‌లను క్రిందికి లాగకూడదని, ఉద్దేశపూర్వకంగా పాడు చేయకూడదని వెల్లడించింది. అలాంటి బోర్డు లేదా డాక్యుమెంట్‌లపై, ఏదైనా ఇతర హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాపర్టీలపై ఉన్న అక్షరాలు లేదా బొమ్మలను తుడిచివేయకూడదని, మార్చకూడదని స్పష్టం చేసింది. హైదరాబాద్ మెట్రో ప్రాంగణంలో ఏ అనధికార కార్యకలాపాన్ని నిర్వహించకూడదని ప్రకటనలో ప్రస్తావించింది.

హైదరాబాద్ మెట్రో రైలు ఆస్తులు, ప్రాంగణంలో ఏదైనా అనధికారిక కార్యకలాపాలు, నష్టం కలిగించడం లాంటివి చేసిన వారిపై చర్యలుంటాయని స్పష్టం చేసింది. ఏ వ్యక్తి అయినా అలా చేసినట్లు గుర్తించినట్లయితే, మెట్రో రైల్వేస్ (ఆపరేషన్ & మెయింటెనెన్స్) చట్టం- 2002లోని సెక్షన్ 62 ఆర్‌డబ్ల్యూ, సెక్షన్ 72 ప్రకారం 6 నెలల వరకు జైలు శిక్ష విధించబడుతుందని, వెయ్యి రూపాయల వరకు జరిమానా విధిస్తారని పేర్కొంది. తీవ్రతను బట్టి రెండింటిని కూడా విధించే అవకాశం ఉందని తెలిపింది. మెట్రో సంస్థకు ఎలాంటి నష్టాన్ని కలగజేయవద్దని ప్రకటనలో కోరింది.

కొద్దిరోజుల కిందట మెట్రో స్టేషన్ లో ఓ అమ్మాయి డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. ఈ ఘటనపై మెట్రో అధికారులు తీవ్రంగా పరిగణించారు. ఏకంగా వీడియో చేసిన యువ‌తిపై ఫిర్యాదు కూడా చేశారు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేప‌ట్టిన సంగతి కూడా తెలిసిందే.

IPL_Entry_Point