Medak Goat Theft : డమ్మీ తుపాకీతో బెదిరించి మేక చోరీ, మెదక్ జిల్లాలో ఇద్దరు అరెస్ట్!
23 March 2024, 15:39 IST
- Medak Goat Theft : హైదరాబాద్ షాపూర్ నగర్ కు చెందిన ఇద్దరు యువకులు నర్సాపూర్ లో ఓ మహిళను డమ్మీ తుపాకీతో బెదిరించి మేకను చోరీ చేశారు. వారిని వెంబడించిన స్థానిక యువకులు వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
డమ్మీ తుపాకీతో బెదిరించి మేక చోరీ
Medak Goat Theft : ఇద్దరు యువకులు తుపాకీతో బెదిరించి మేకను చోరీ(Medak Goat Theft) చేసి పారిపోతుండగా స్థానిక యువకులు పట్టుకొని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన పోచమ్మ తన మేకలను మేపుకొని సాయంత్రం తిరిగి ఇంటికి తోలుకొని వస్తున్న క్రమంలో మార్గమధ్యలో ఇద్దరు వ్యక్తులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమెను డమ్మీ తుపాకీతో(Fake Gun) బెదిరించి మేకను బైక్ పై పెట్టుకుని పరారయ్యారు. పోచమ్మ అరవడంతో గమనించిన స్థానికులు శివ ప్రణయ్ గౌడ్, విష్ణు, మరో యువకుడు కలిసి దుండగులను ద్విచక్ర వాహనాలపై వెంబడించి నర్సాపూర్ చౌరస్తా వద్ద వారిని పట్టుకున్నారు. శివ ప్రణయ్ వారిని బైక్ పై కుర్చోబెట్టుకొని రెడ్డిపల్లి గ్రామానికి తీసుకొస్తుండగా మార్గమధ్యలో వారు తుపాకీతో బెదిరించారు. దీంతో భయపడిపోయిన శివ ప్రణయ్ వెంటనే బైక్ మీద నుంచి కింద పడిపోయాడు. మరో ఇద్దరు నిందితులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తుపాకీతో పాటు ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఈ ఘటనలో శివ ప్రణయ్ కు తీవ్ర గాయాలయ్యాయి. కాగా వారు ఇద్దరు హైదరాబాద్(Hyderabad) నగరంలోని షాపూర్ నగర్ కి చెందిన యువకులుగా గుర్తించారు. పోలీసులు వారి వద్ద ఉన్న తుపాకీ డమ్మీగా తేల్చారు.
వృద్ధ దంపతులకు నర్సాపూర్ కోర్టులో న్యాయం
స్థిర,చరాస్థులను కోల్పోయి కన్న కొడుకు చేసిన మోసంతో కన్నీరు పెట్టుకుంటూ వృద్ధ దంపతులు మెదక్ జిల్లా(Medak) నర్సాపూర్ సివిల్ కోర్టును ఆశ్రయించారు. ఆ వృద్ధ దంపతుల గోడును విన్న జడ్జి వెంటనే స్పందించి తగిన సహాయం అందేలా చర్యలు తీసుకున్నారు. కౌడిపల్లి మండలం వెంకట్రావుపేట్ గ్రామానికి చెందిన గండి లచ్చయ్య, తులసమ్మ దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు మధుసూదన్ ఉన్నాడు. కొన్నాళ్ల కిందట మధుసూదన్ తల్లిదండ్రుల(Son Cheating Parents) పేరిట ఉన్న స్థిర,చరాస్థులను తమకు తెలియకుండా మోసపూరితంగా అతడి పేరు మీదికి మార్పించుకున్నాడు. ఇంట్లో ఉండకుండా ఇంటికి తాళం వేయడంతో తాము రోడ్డున పడ్డామని శుక్రవారం తమకు న్యాయం చేయాలనీ వృద్ధ దంపతులు వేడుకున్నారు. నర్సాపూర్ జూనియర్ సివిల్ కోర్టు(Narsapur Court) జడ్జి అనిత స్పందించారు. మధుసూదన్ తో ఫోన్ లో మాట్లాడి తల్లిదండ్రులను మోసం చేసి పొందిన ఇంటిని తక్షణమే వారికి స్వాధీనం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో అతడు తాళాలు పంపించడంతో వాటిని న్యాయమూర్తి... వృద్ధ దంపతులకు అందజేశారు. తల్లిదండ్రుల ఆలనా పాలనా కూతుర్లు, కొడుకులే చూసుకోవాలని లేని పక్షంలో సీనియర్ సిటిజన్ చట్టం ప్రకారం వారసులను కఠినంగా శిక్షిస్తామని జడ్జి అనిత హెచ్చరించారు. తల్లిదండ్రులను పట్టించుకోకుంటే వారి నుంచి పొందిన ఆస్తులను కొడుకులు, కూతుర్ల దగ్గర నుంచి జప్తు చేసే అవకాశం ఉంటుందని హెచ్చరించారు.