Medak Crime : మెదక్ జిల్లాలో దారుణం, చున్నీతో తండ్రికి ఉరేసి హత్య చేసిన కొడుకు-medak crime news son killed father due to family disputes ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medak Crime : మెదక్ జిల్లాలో దారుణం, చున్నీతో తండ్రికి ఉరేసి హత్య చేసిన కొడుకు

Medak Crime : మెదక్ జిల్లాలో దారుణం, చున్నీతో తండ్రికి ఉరేసి హత్య చేసిన కొడుకు

HT Telugu Desk HT Telugu
Published Mar 17, 2024 09:03 PM IST

Medak Crime : ఇంట్లో తరచూ గొడవ పడుతున్నాడని తండ్రిని హత్య చేశాడో కొడుకు. వాటర్ హీటర్ తో కొట్టి, చున్నీతో ఉరి వేసి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన మెదక్ జిల్లాలో చోటుచేసుకుంది.

మెదక్ జిల్లాలో దారుణం
మెదక్ జిల్లాలో దారుణం

Medak Crime : మెదక్ జిల్లాలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. నిత్యం ఇంట్లో కుటుంబ సభ్యులతో గొడవ పడుతుండడంతో విసిగి పోయిన కొడుకు వాటర్ హీటర్ తో కొట్టి, చున్నీతో మెడకు ఉరి వేసి తండ్రిని హత్య చేశాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా(Medak Crime ) పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో శనివారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రామతీర్థం గ్రామానికి చెందిన సంగెం ప్రేమానందం (35) భార్య సుగుణమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ప్రేమానందం తరచూ కుటుంబీకులతో గొడవ పడుతున్నాడు. దీంతో భార్య సుగుణమ్మ పిల్లలతో కలిసి రెడ్డిపల్లిలోని తన పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి నచ్చజెప్పడంతో భార్య ఇంటికి వచ్చింది. అయినా ప్రేమానందంలో మార్పు రాలేదు. మరలా మూడు రోజుల క్రితం గొడవ జరగింది. ఈ ఘర్షణలో భార్య,పెద్దకొడుకు కలిసి ప్రేమానందాన్ని కొట్టడంతో అతడికి గాయాలయ్యాయి.

వాటర్ హీటర్ తో తండ్రిని కొట్టి, చున్నీతో ఉరేసి

అనంతరం సుగుణమ్మ పిల్లలతో కలిసి పుట్టింటికి వెళ్లింది. ప్రేమానందం, తన తండ్రి ప్రసాద్ ఇంటివద్ద ఉన్నారు. తరచూ గొడవలు జరుగుతుండడంతో విసిగిపోయిన పెద్దకొడుకు సందీప్ తండ్రిని ఎలాగైనా హత్య చేయాలని భావించాడు. ఈ క్రమంలో శనివారం రామతీర్థానికి వచ్చాడు. ఇంట్లో ఉన్న తాతను బయటకు పంపించి తలుపులు మూసి గడియపెట్టాడు. అనంతరం వాటర్ హీటర్ తో తండ్రిని కొట్టి, చున్నీతో ఉరేసి చంపాడు. సందీప్ సిద్ధిపేటలో డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి (Medak Govt Hospital)తరలించారు. ప్రేమానందం తండ్రి ప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్య

తల్లిదండ్రులు మందలించారని ఓ యువకుడు కుంటలో దూకి ఆత్మహత్య చేసుకున్న ఘటన మెదక్ జిల్లా(Medak District) చిన్నశంకరంపేట మండలం దర్పల్లి గ్రామంలో శనివారం జరిగింది. దర్పల్లి గ్రామానికి చెందిన శ్యామల, నెల్లూరు దంపతులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారూడు మింటూ (18) చదువు మానేసి జులాయిగా తిరుగుతున్నాడు. కొంతకాలంగా మద్యానికి బానిసై గ్రామస్థులతో తరచూ గొడవలు పడుతుండేవాడు. శుక్రవారం రాత్రి ఒక విషయంలో తల్లిదండ్రులతో గొడవ జరగడంతో వారు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన మింటూ గ్రామశివారులోని సాయమ్మకుంటలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడి తల్లి శ్యామల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Whats_app_banner

సంబంధిత కథనం