TG Govt Holiday : మే 27న ప్రభుత్వ ఉద్యోగులకు హాలీ డే…! వీరికి మాత్రమే
24 May 2024, 17:29 IST
- Govt Holiday in Telangana : ఈనెల 27వ తేదీన నల్గొండ- ఖమ్మం- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. అయితే ఈ జిల్లాల పరిధిలో పరిధిలో పని చేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు హాలీ డేగా ప్రకటించారు.
తెలంగాణలో మే 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్
MLC Election in Telangana : తెలంగాణలో మే 27వ తేదీన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది.
ఉప ఎన్నిక నేపథ్యంలో ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల పరిధిలోని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 27న సెలవు దినంగా(క్యాజువల్ లీవ్) ప్రకటించింది. ఈ మేరకు ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇందుకు అనుగుణంగా…. తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేయనుంది.
వైన్స్ షాపులు బంద్….
ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ జరిగే 3 ఉమ్మడి జిల్లాలలో పరిధిలో మే 27న వైన్ షాపులు, బార్లు బంద్ కానున్నాయి. 48 గంటల పాటు ఈ నిర్ణయం అమల్లో ఉండనుంది. మే 25వ తేదీ సాయంత్రం 4.00 గంటల నుంచి 27వ తేదీ సాయంత్రం 4.00 గంటల వరకు షాపులు మూసివేసి ఉంటాయి.
బరిలో 52 మంది అభ్యర్థులు…!
ఎమ్మెల్సీ ఉపఎన్నిక బరిలో మొత్తం 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ప్రధానంగా బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీల మధ్య గట్టి పోటీ ఉంది. కొందరు స్వతంత్ర అభ్యర్థులు కూడా గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ మూడు ఉమ్మడి జిల్లాల్లో కలిపి మొత్తం 4,61,806 మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. మే 27వ తేదీన పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. మే 25వ తేదీతో ప్రచారం కార్యక్రమం కూడా ముగియనుంది. జూన్ 5వ తేదీన ఫలితాలను ప్రకటిస్తారు.
పల్లా రాజీనామాతో ఉప ఎన్నిక...
వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన బీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి 2023 డిసెంబర్ లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నియోజకవర్గంలో పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఆయన... ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.
ఫలితంగా మండలిలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానం కాస్తా ఖాళీ అయ్యింది. 2021 మార్చి 14న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక జరగగా... ఆ సమయంలో మొత్తంగా 76 మంది వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి పోటీ పడగా.. ఇండిపెండెంట్ గా బరిలో నిలిచిన తీన్మార్ మల్లన్న టఫ్ ఫైట్ ఇచ్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, తీన్మార్ మల్లన్న మధ్య హోరాహోరీ పోరు నడవగా... చివరకు పల్లా రాజేశ్వర్ రెడ్డి విజేతగా నిలిచారు. ఆయన ఆ పదవిలో ఆరేళ్ల పాటు కొనసాగాల్సి ఉంది. కానీ తాజా ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి గెలవడంతో ఆయన రాజీనామా అనివార్యమైంది.
ఇక గతంలో ఈస్థానం నుంచి అత్యంత కష్టం మీద గెలిచిన బీఆర్ఎస్.... మరోసారి గెలవటం అతిపెద్ద సవాల్ గా మారనుంది. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాలో ఉండగా.. కాంగ్రెస్ అధికారంలో ఉంది. అయితే ఈసారి కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. ఇక బీఆర్ఎస్ నుంచి రాకేశ్ రెడ్డి బరిలో ఉండగా, బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి రేసులో ఉన్నారు. కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్ కు గురైన బక్కా జడ్సన్ కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.