Maoists enter in Komaram Bheem : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో ప్రవేశించిన మావోయిస్టులు
29 August 2022, 20:42 IST
- Maoists Enter Forest In Komaram Bheem Asifabad : కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో 10 నుంచి 15 మంది మావోయిస్టులు అడవుల్లోకి ప్రవేశించినట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి. తిర్యాణి మండల అడవుల్లో సంచరిస్తున్నట్లు సమాచారం.
ప్రతీకాత్మక చిత్రం
కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టులు ప్రవేశించినట్టుగా తెలుస్తోంది. గతంలో గ్రామస్థులతో ఉన్న సంబంధాలను పునరుద్ధరించుకోవడం ద్వారా మావోయిస్టులు రిక్రూట్‌మెంట్లపై దృష్టి సారించినట్లు సమాచారం. పోడు భూముల సమస్యపై మావోయిస్టులు చర్చించి ఆదివాసీలకు పట్టాలు ఇచ్చేందుకు సహకరించే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలతో అడవుల్లో పచ్చదనం సంతరించుకుంది. ఈ కారణంగా కదలికలు ఉన్నా.. పెద్దగా తెలియదనే అభిప్రాయం ఉంది. మావోయిస్టులు దీనిని సద్వినియోగం చేసుకోవాలని చూస్తున్నట్టుగా.. తెలుస్తోంది. అంతేకాకుండా, వర్షాల కారణంగా కదలికల గుర్తించడంలో ఇబ్బంది.. ఉందని పోలీస్ వర్గాలు తెలిపాయి. మవోయిస్టులు ప్రాణహిత, గోదావరి దాటి జిల్లాలోకి ప్రవేశిస్తున్నట్టుగా తెలిసింది.
ఆదివాసీ గూడెంలలో మావోయిస్టుల వ్యతిరేక ప్రచారాన్ని పోలీసులు ప్రారంభించారు. పెరిగిన రాజకీయ కార్యకలాపాల కారణంగా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు. ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే.. సమాచారం ఇవ్వాలని.. చెబుతున్నారు.
మరోవైపు మావోయిస్టులను పట్టుకునేందుకు మంగి, వాంకిడి, ఆసిఫాబాద్, ప్రాణహిత నదీ తీర ప్రాంతాల్లో పోలీసులు కూంబింగ్‌ను ముమ్మరం చేశారు. గతేడాది వర్షాకాలంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు మైలారపు అడెల్లు అలియాస్ భాస్కర్ ఆధ్వర్యంలో కొందరు మావోయిస్టులు తిర్యాణిలోని మంగి అడవుల్లోకి ప్రవేశించి రిక్రూట్‌మెంట్‌పై దృష్టి పెట్టారు. కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా కదంబ వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.
తిర్యాణి మండలంలోని తాటిగూడ, కెరిగూడ, ఎర్రబండ గ్రామాల్లో ఆగస్టు 27న ఆసిఫాబాద్ ఎస్పీ కె.సురేష్‌కుమార్ పర్యటించి గ్రామస్తులతో మాట్లాడారు. ఆదివాసీలు మావోయిస్టులకు.. మద్దతును ఇవ్వొద్దని కోరారు.