Podu Lands: ఆదివాసీలకు కేసీఆర్ సర్కార్ ద్రోహం చేసింది - రాహుల్ గాంధీ
Rahul Gandhi on Podu Lands Issue: పోడు భూముల హక్కులపై ఆదివాసీలు చేస్తున్న పోరాటానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మద్దతు పలికారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ ను రీట్వీట్ చేశారు.
Rahul Gandhi on Podu Lands: మంచిర్యాల జిల్లాలో పోడు భూములపై హక్కుల కోసం ఆదివాసీలు ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్న సంగతి తెలిసిందే. అటవీ భూముల్లో ఆక్రమణలకు పాల్పడుతున్నారంటూ అధికారులు... ఆదివాసీలపై కేసులు నమోదు చేస్తున్న నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పలువురు ఆదివాసీ మహిళలను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో పోడు భూముల అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కాంగ్రెస్, బీజేపీలు కూడా టీఆర్ఎస్ సర్కార్ లక్ష్యంగా విమర్శలు గుపిస్తున్నాయి. ఇదే అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కూడా స్పందించారు. 'జల్ జంగల్ జమీన్' పోరాటంలో ఆదివాసీలకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు.
సర్కార్ వైఖరి దారుణం...
తెలంగాణలో భూమి హక్కుల కోసం పోరాడుతున్న ఆదివాసీలపై ప్రభుత్వ వైఖరి దారుణం అని పేర్కొన్నారు రాహుల్ గాంధీ. అర్హులైన ఆదివాసీలకు పోడ్డు భూమి సాగు పట్టాలు ఇస్తామని ప్రకటించిన కేసీఆర్ సర్కారు ఆ తర్వాత వెనక్కి తగ్గిందని, ఇది ప్రజలకు ద్రోహం చేయడమేనని మండిపడ్డారు. ఆదివాసీ గళాన్ని అణచివేసేందుకు పోలీసు బలగాలను వినియోగించడం అమానుషమని పేర్కొన్నారు. ఇది తెలంగా ఆకాంక్షలకు అవమానం అన్నారు. రాష్ట్రంలోని కోట్లాది ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని రాహుల్ గాంధీ గుర్తు చేశారు. ఆదివాసీ హక్కుల పరిరక్షణ అందులో ఒక ముఖ్య భాగమన్నారు. పోడు భూమి పట్టాలను అర్హులైన ఆదివాసీలకు బదలాయిస్తామని ప్రకటించి.. ఆ తర్వాత వెంటనే వెనక్కి తగ్గిన కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ద్రోహం చేసిందని మండిపడ్డారు.
పలు ప్రాంతాల్లో ఆందోళనలు
రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతోంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్ పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా పలు జిల్లాల్లో పోడు రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలం కోయపోషగూడెంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోడుభూముల్లో ఆదివాసీసులు వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు. గిరిజనులు కాళ్లపై పడి వేడుకున్నా పట్టించుకోకుండా గుడిసెలను బలవంతంగా పీకేశారు. దీంతో అధికారులు-గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ లో పోడు రైతులు, బీట్ అధికారి చందర్ రావుకు మధ్య గొడవ జరిగింది. మరోవైపు పట్టాభూములను ఇవ్వాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో గిరిజనులు దీక్ష కొనసాగిస్తున్నారు. మొత్తంగా పోడు భూముల వ్యవహరంపై గిరిజనుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.