Bandi Sanjay : పాదయాత్ర చేయోద్దన్న పోలీసులు.. బండి సంజయ్ ఏమన్నారంటే?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్రను నిలిపివేయాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని తెలిపారు. దీనిపై బండి సంజయ్ స్పందించారు.
బండి సంజయ్ పాదయాత్రపై పోలీసులు నోటీసులు జారీ చేశారు. నిలిపివేయాలని చెప్పారు. ప్రముఖ్ డాక్టర్ గంగిడి మనోహర్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, దుగ్యాల ప్రదీప్ కుమార్‌లకు వర్దన్నపేట ఏసీపీ నోటీసులు ఇచ్చారు. జనగామ జిల్లాలో ప్రజాసంగ్రామ యాత్రకు అనుమతి లేదని నోటీసుల్లో చెప్పారు.
పాదయాత్ర పేరుతో విద్వేషపూరిత ప్రకటనలు చేస్తున్నారని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. ధర్మదీక్ష పేరుతో వివిధ జిల్లాల నుంచి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నట్టుగా తెలిపారు. రెచ్చగొట్టే ప్రకటనలతో, ఇతర జిల్లాల నుంచి కార్యకర్తలను రపిస్తు్న్నారి పేర్కొన్నారు. జిల్లాలో శాంతిభద్రతల విఘాతం ఏర్పడే ప్రమాదం ఉందని నోటీసుల్లో పోలీసులు చెప్పారు. ఈ కారణంగా తక్షణమే ప్రజా సంగ్రామ యాత్రను నిలిపేయాలన్నారు. ఒకవేళ నోటీసును పరిగణనలోకి తీసుకోకుండా ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభిస్తే శాంతిభద్రతల సమస్య కింద చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు పోలీసులు.
పోలీసుల నోటీసులపై బండి సంజయ్ స్పందించారు. మొదటి సంగ్రామ యాత్ర విజయవంతమైందన్నారు. రెండో సంగ్రామయాత్రకు విశేష స్పందన వచ్చిందని చెప్పారు. కేసీఆర్ అనుకున్నదేమీ నెరవేరలేదని విమర్శించారు. తమపై దాడులు చేయిస్తున్నారన్నారు. బీజేపీ కార్యకర్తలపై రాళ్లు వేస్తున్నా ఎక్కడా భయపడలేదన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం ఉందా? అని బండి సంజయ్ ప్రశ్నించారు.
ప్రజల్లో తిరుగుతున్నామని.., అందుకే మాకు ప్రజల మద్దతు ఉందని బండి సంజయ్ అన్నారు. పోలీసుల అనుమతితోనే ప్రజా సంగ్రామ యాత్ర చేసుకుంటున్నామన్న బండి.. 21 రోజుల తర్వాత నన్ను అరెస్టు చేయడానికి కారణమేంటి? అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబానికి రూ.వేల కోట్లు ఎక్కడి నుంచి వచ్చాయని అడిగారు. కుమార్తె కోసమే ప్రజాసంగ్రామ యాత్రను అడ్డుకున్నారని ఆరోపించారు.
ప్రజాసంగ్రామ యాత్ర పక్కాగా చేస్తాం.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు. కేసీఆర్ లిక్కర్ స్కామ్‌పై స్పందించాలి. టీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చింది. ప్రజా సంగ్రామయాత్ర చూసి టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భయపడుతున్నారు. ప్రజాసంగ్రామ యాత్రలో యువత ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కార్యకర్తలు కేసులకు భయపడొద్దు. బీజేపీ అండగా ఉంటుంది. దిల్లీ నుంచి వచ్చిన పక్కా సమాచారంతోనే మాట్లాడుతున్నాం. ప్రజాసమస్యలపై మాట్లాడితే పోలీసులతో అరెస్టు చేయిస్తున్నారు.
- బండి సంజయ్