Revanth Reddy: పోడు భూమి పోరు భూమిని తలపిస్తోంది
Revanth reddy: పోడు భూముల అంశంపై కేసీఆర్ మాయమాటలు చెప్పారని విమర్శించారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. ఈ మేరకు ట్వీట్ చేశారు. మరోవైపు ఇదే అంశంపై బండి సంజయ్.. కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
Revanth reddy on podu lands issue: పోడు భూమి పోరుభూమిని తలపిస్తోందన్నారు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. మంచిర్యాల,మహబూబాబాద్,నాగర్ కర్నూల్,ఖమ్మం జిల్లాలు నిత్యం పోడు రణంతో రగులుతున్నాయని ట్వీట్ చేశారు. పోడు భూములకు హక్కు పత్రాలిస్తామని కేసీఆర్ ఓట్లు వేయించుకున్నారని విమర్శించారు. ఇప్పుడు ఆడబిడ్డలను వివస్త్రను చేసి ఈడ్చిపారేస్తున్నారంటూ ఓ వీడియోనూ తన పోస్టుకు జత చేశారు. రేపటి కురుక్షేత్రంలో ఈ దుర్యోధన పాలన అంతం కావటం ఖాయమని రాసుకొచ్చారు.
బండి సంజయ్ లేఖ…
Bandi Sanjay Letter to CM KCR: పోడు భూముల అంశంపై కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ లేఖ రాశారు. రెవెన్యూ సదస్సుల్లో పోడు రైతులకు హక్కు పత్రాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పోడుభూముల సమస్య పరిష్కారానికి రాష్ట్ర యంత్రాంగాన్ని అంతా తీసుకుని వచ్చి గిరిజనులకు పట్టాలిచ్చే కార్యక్రమాన్ని స్వయంగా పర్యవేక్షిస్తానని 2019 జులైలో కేసీఆర్ ఇచ్చిన హామీని లేఖలో గుర్తు చేశారు. పోడు భూముల సమస్య పరిష్కారం అయ్యేవరకు అటవీ, పోలీస్, రెవెన్యూ శాఖల అధికారులు జోక్యం చేసుకోకూడదని.. దాడులు నిలిపివేయాలన్నారు. ఆదివాసీలపై బనాయించిన తప్పుడు కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
పలు ప్రాంతాల్లో ఆందోళనలు…
రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతోంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్ పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. తాజాగా పలు జిల్లాల్లో పోడు రైతులు ఆందోళనకు దిగారు. మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలం కోయపోషగూడెంలో ఉద్రిక్తత ఏర్పడింది. పోడుభూముల్లో ఆదివాసీసులు వేసుకున్న గుడిసెలను అటవీశాఖ అధికారులు తొలగించారు. గిరిజనులు కాళ్లపై పడి వేడుకున్నా పట్టించుకోకుండా గుడిసెలను బలవంతంగా పీకేశారు. దీంతో అధికారులు-గిరిజనులకు మధ్య గొడవ జరిగింది. ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలం ఎల్లన్ననగర్ లో పోడు రైతులు, బీట్ అధికారి చందర్ రావుకు మధ్య గొడవ జరిగింది. మరోవైపు పట్టాభూములను ఇవ్వాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలం రామన్నగూడెంలో గిరిజనులు దీక్ష కొనసాగిస్తున్నారు. మొత్తంగా పోడు భూముల వ్యవహరంపై గిరిజనుల ఆందోళనలు ఉద్రిక్తంగా మారుతున్నాయి.