తెలుగు న్యూస్  /  ఆంధ్ర ప్రదేశ్  /  Mango Fields : మామిడి పంటపై మంచు ప్రభావం, పూత రాలిపోతుందని రైతులు ఆందోళన

Mango Fields : మామిడి పంటపై మంచు ప్రభావం, పూత రాలిపోతుందని రైతులు ఆందోళన

HT Telugu Desk HT Telugu

18 December 2024, 21:46 IST

google News
  • Mango Feilds : రాష్ట్రంలో తగ్గిన ఉష్ణోగ్రతలు మామిడి పంటపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. మంచు కారణంగా మామిడి పూత రాలిపోతుందని రైతులు ఆందోన వ్యక్తం చేస్తున్నారు.

మామిడి పంటపై మంచు ప్రభావం, పూత రాలిపోతుందని రైతులు ఆందోళన
మామిడి పంటపై మంచు ప్రభావం, పూత రాలిపోతుందని రైతులు ఆందోళన

మామిడి పంటపై మంచు ప్రభావం, పూత రాలిపోతుందని రైతులు ఆందోళన

Mango Feilds : రాష్ట్రంలో అత్యల్ప ఉష్ణోగ్రత‌ల‌తో మామిడి పూత కోత‌కు గుర‌వుతుంది. దేశంలోని మామిడి ఉత్పత్తిలో రెండో స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో మంచు ప్రభావం రైతుల‌పై ప‌డుతోంది. ప్రస్తుతం మామిడి తోట‌ల‌ను మంచు దుప్పటి క‌ప్పేస్తోంది. రాత్రి వేళ‌ల్లో కురుస్తున్న మంచుతో మామిడి పూత‌పై తీవ్ర ప్రభావం చూపుతోంది.

రాష్ట్రంలోని మెట్ట ప్రాంతాల్లో మామిడి పంట సాగు అవుతోంది. సాగు విస్తీర్ణంలోనూ, దిగుబ‌డిలోనూ దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ కంటే ఉత్తర‌ప్రదేశ్ మొద‌టి స్థానంలో ఉంటుంది. ఏపీ త‌రువాత స్థానాల్లో క‌ర్ణాట‌క‌, తెలంగాణ‌, బీహార్‌, గుజ‌రాత్ రాష్ట్రాలు ఉన్నాయి. అయితే రాష్ట్రంలో ప్రతి ఏటా మారుతున్న పరిస్థితుల‌తో పాటు వాతావ‌ర‌ణ అన‌నుకూలత కార‌ణంగా దిగుబ‌డి త‌గ్గుతోంది. ప్రస్తుత లెక్కల ప్రకారం దేశ మామిడి ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ 16.07 శాతం ఉత్పత్తి అవుతోంది. తెలంగాణ నుంచి కేవ‌లం 8.54 శాతం మామిడి ఉత్పత్తే వ‌స్తోంది. అదే ఉత్తప్రదేశ్‌లో అయితే 23.06 శాతం మామిడి ఉత్పత్తి వ‌స్తోంది.

ఏపీ ఉద్యాన‌శాఖ లెక్కల ప్రకారం రాష్ట్రంలో 4.03 ల‌క్షల హెక్టార్లలో మామిడి పంట సాగులో ఉంది. దాని నుంచి 59.06 ల‌క్షల మెట్రిక్ ట‌న్నుల మామిడి దిగుబడి జ‌రుగుతోంది. రాష్ట్రంలో ఉద్యాన‌వ‌నం ప‌రిధిలో వ‌చ్చే అర‌టి త‌రువాత అత్యధిక దిగుబ‌డి వ‌చ్చే పంట మామిడే నిలిచింది. ఇటీవ‌లి రాష్ట్ర ప్రభుత్వం మామిడి పంట‌కు కూడా బీమా అమ‌లు చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేర‌కు బీమా వ‌ర్తింప చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది.

2024-25, 2025-26 సంవత్సరాల్లో పునర్వ్యవస్థీకరణ తర్వాత వాతావరణ ఆధారిత పంటల బీమా పథకం (ఆర్‌డ‌బ్ల్యూబీసీఐఎస్‌) అమలుకు ప్రభుత్వం పరిపాలనాపరమైన ఆమోదం తెలిపింది. ఖరీఫ్ సీజన్‌లో ఏడు పంటలు, రబీ సీజన్‌లో రెండు పంటలను ఈ బీమా కవర్ చేస్తుంది. రబీ సీజన్‌లో మామిడిని అదనపు పంటగా చేర్చడానికి పథకాన్ని విస్తరించాల‌ని ప్రభుత్వం నిర్ణయించింది. మామిడి పంట‌కు పథకం అమలుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను నిర్దేశించిన విధానం ప్రకారం పూర్తి చేయాల‌ని సూచించింది.

రెండు విడ‌త‌ల్లో పూత‌

అయితే సాధార‌ణంగా రెండు విడ‌త‌ల్లో మామిడి పూత వ‌స్తుంది. డిసెంబ‌ర్‌, జ‌న‌వ‌రి మ‌ధ్య పూత వ‌చ్చి ఆ త‌రువాత పిందెలు రావాల్సి ఉంటుంది. ఈ సంవ‌త్సరం ఇప్పటి వ‌ర‌కు ఎక్కడా పూత క‌నిపించ‌డం లేదు. మొక్క తోట‌ల్లో మాత్రమే అక్కడ‌క్కడ పూత క‌నిపిస్తోంది. ఇది ఒక‌టి నుంచి రెండు శాతం కంటే ఎక్కువ ఉండ‌ద‌ని రైతులు చెబుతున్నారు. మొద‌టి విడ‌త‌లో పూత క‌నిపించ‌క‌పోయినా వాతావ‌ర‌ణంలో వ‌చ్చే మార్పుతో రెండో విడ‌త‌లో పూత విచ్చుకునే అవ‌కాశం ఉంద‌ని ఉద్యాన శాఖ అధికారులు తెలుపుతున్నారు. చీడ‌పీడ‌ల‌ను నివారించి, మేలైన యాజ‌మాన్య ప‌ద్ధతులు చేప‌డితే నాణ్య‌త‌గ‌ల మంచి దిగుబ‌డి అభిస్తాయ‌ని ఉద్యాన‌వ‌న యూనివ‌ర్శిటీ అధ్య‌ప‌కులు తెలిపారు.

రాష్ట్రంలో ఎన్ని రకాల మామిడి పంట?

రాష్ట్రంలో ప్రధానంగా బంగిన‌ప‌ల్లి, ర‌సాలు, కొత్తప‌ల్లి కొబ్బరి, సువ‌ర్ణరేఖ‌, తోత‌పూడి (క‌లెక్టర్‌), పండూరి మామిడి, ముంత‌మామిడి త‌దిత‌ర ర‌కాల మామిడి పంట రైతులు పండిస్తున్నారు. కొత్త‌ప‌ల్లి కొబ్బ‌రి, పండూరి మామిడి పండ్లుకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. తోత‌పూడి ర‌కం మామిడ పండ్ల‌ను జ్యూస్‌ త‌యారు చేసే కార్పొరేట్ కంపెనీలు సేకరిస్తుంటాయి. మామిడి తాండ్ర త‌యారీలోనూ కూడా అధికంగా వినియోగిస్తారు. ఇప్ప‌టికే రైతులు చీడ‌ల నివార‌ణకు అధిక మొత్తంలో ఖ‌ర్చు చేస్తున్నారు. కొంత మంది చిన్న, స‌న్నకారు మామిడి రైతులు గిట్టుబాటు రాక తోట‌ల‌ను ఎక‌రా రూ.12 వేల నుంచి రూ.15 వేల‌కు కౌలుకు ఇచ్చేస్తున్నారు. పూత కోత‌, చీడ‌ల నివార‌ణ‌కు ఉద్యాన‌వ‌న అధికారుల‌ను సంప్రదించి, వారు చెప్పిన పురుగు మందుల‌ను వాడాల్సి ఉంటుంది. అప్పుడే పూత కోత నివార‌ణను, చీడ‌ల నివార‌ణ‌ను అరిక‌ట్టగ‌లుగుతారు.

రిపోర్టింగ్ : జ‌గ‌దీశ్వర‌రావు జ‌ర‌జాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు

తదుపరి వ్యాసం