తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Cold Wave In Telangana: చలి గజగజ.. ఆసిఫాబాద్​లో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

Cold Wave in Telangana: చలి గజగజ.. ఆసిఫాబాద్​లో 7.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత

HT Telugu Desk HT Telugu

20 November 2022, 10:13 IST

google News
    • Today Cold Wave Updates: తెలంగాణలో చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా తక్కువకు పడిపోవడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. ఇవాళ పలుచోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
తెలంగాణలో చలి తీవ్రత
తెలంగాణలో చలి తీవ్రత

తెలంగాణలో చలి తీవ్రత

Cold Wave Increased in Telangana: వర్షాకాలం(Rain Season) ముగియడంతో రాష్ట్రంలో క్రమంగా చలి పెరిగిపోయింది. అక్టోబర్ చివరి వారంలోనే చలి తీవ్రత పెరగటం మొదలైంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. సాయంత్రం 5 దాటితే చాలు .. చలి వణికిస్తోంది. ఉదయం పూట చాలా చోట్ల పొగ మంచు కమ్ముకుంటోంది. తెల్ల‌వారుజామున మంచు కురియ‌డంతో.. ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు వెళ్లాలంటే జంకుతున్నారు.

మీ నగరంలో వాతావరణం తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి

ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా నాలుగైదు డిగ్రీలు తక్కువకు పడిపోతున్నందున చలి తీవ్రత పెరుగుతోందని హైదరాబాద్ వాతావరణశాఖ పేర్కొంది. ఉత్తర, ఈశాన్య భారత ప్రాంతాల నుంచి రాష్ట్రంలోకి తక్కువ ఎత్తులో గాలులు వీస్తున్నాయని వెల్లడించింది. ఫలితంగా చలి గాలులు వీస్తున్నాయని వివరించింది. ఇవాళ తెల్లవారుజామున అత్యల్పంగా కొమురం భీం జిల్లాలో 7.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. ఇక సంగారెడ్డి జిల్లా సత్వార్‌లో 7.5 డిగ్రీలు, ఆదిలాబాద్‌ జిల్లాలో 8.3, నిర్మల్‌ జిల్లాలో 9.2, మెదక్‌ జిల్లా మంచిర్యాల జిల్లాలో 9.5, సిద్దిపేట జిల్లా హబ్సిపూర్‌లో 10.1 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

ఇక హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో 10 -11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిజామాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, వికారాబాద్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో 7 డిగ్రీల నుంచి 9 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదైనట్లు పేర్కొంది.

ఆది, సోమవారాల్లో రాష్ట్రంలో పగలు పొడి వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. రానున్న రెండు రోజుల్లో రాత్రిపూట చలి మరింత తీవ్రమవుతుందని వివవరించింది. సోమవారం దక్షిణ తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లా వ్యాప్తంగా చలి గాలులు అధికమయ్యాయి. ఆంధ్రా ఊటీగా పేరొందిన అరకులోయలో ఒక్కసారిగా ఉష్ణోగ్రతలు పడిపోయాయి. ఇవాళ చింతపల్లిలో అత్యల్పంగా 9.1 డిగ్రీలు నమోదయ్యాయి. అరకులోయ 11 డిగ్రీలు, మినుములూరులోనూ 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు రికార్డు అయ్యాయి. ఉష్ణోగ్రతలు పడిపోవడంతో అరకు ప్రాంత వాసులు చలితో ఇబ్బందులు పడుతున్నారు.

తదుపరి వ్యాసం