తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Liquor Prices: మేడారంలో చుక్కలు చూపిస్తున్న లిక్కర్ రేట్లు.. జాతరలో ఒక్కో బాటిల్ రేట్ ఎంతో తెలుసా..?

Medaram liquor Prices: మేడారంలో చుక్కలు చూపిస్తున్న లిక్కర్ రేట్లు.. జాతరలో ఒక్కో బాటిల్ రేట్ ఎంతో తెలుసా..?

HT Telugu Desk HT Telugu

23 February 2024, 13:36 IST

    • Medaram liquor Prices: తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతరలో లిక్కర్ రేట్లు ఆకాశాన్నంటుతున్నాయి. సమ్కక్క–సారలమ్మ దర్శనం అనంతరం ఇక్కడ మందు, విందు కామనే అయినా.. సరదాగా ఓ చుక్క వేద్దామంటే లిక్కర్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి.
మేడారంలో మద్యం ధరలకు రెక్కలు
మేడారంలో మద్యం ధరలకు రెక్కలు

మేడారంలో మద్యం ధరలకు రెక్కలు

Medaram liquor Prices: మేడారం జాతరలో మద్యం ధరలు చుక్కలను అంటుతున్నాయి. సాధారణంగా వైన్స్ షాపుల్లో లభించే ధరలకు రూ.100 నుంచి రూ.150 వరకు అదనంగా వసూలు చేస్తుండటంతో ఓ పెగ్గు వేయాలన్నా.. బీర్ కొట్టాలన్నా మద్యం ప్రియులు ఆలోచించాల్సిన పరిస్థితి నెలకొంది.

వాస్తవానికి మేడారంలో లిక్కర్ అమ్మడానికి వైన్స్ కు టెండర్లు Tenders నిర్వహించినప్పటికీ మద్యం దందా బాగా నడుస్తుండటంతో ప్రతి చిన్నచిన్న షాపులో కూడా లిక్కర్ బాటిల్స్ దర్శనమిస్తున్నాయి. ఎమ్మార్పీ రేట్లకు విక్రయించాలనే రూల్ ఉన్నా.. దుకాణదారులు ఇష్టమొచ్చిన రేటుకు అమ్ముతున్నారు. మేడారంలో రేట్ల గురించి తెలుసుకున్న భక్తులు, అక్కడికి వెళ్లేటప్పుడే ఓ నాలుగైదు సీసాలు పట్టుకెళ్లేందుకు మొగ్గు చూపుతున్నారు.

లైట్ బీర్ రూ.250.. క్వార్టర్ సీసా రూ.330

మేడారం మహా జాతరలో లిక్కర్ బిజినెస్ Business దుకాణదారులకు కాసుల వర్షం కురిపిస్తుంటే.. కొనుగోలుదారుల జేబుకు మాత్రం చిల్లులు పడుతున్నాయి. బ్రాండ్ తో సంబంధం లేకుండా ప్రతి బాటిల్కు తక్కువలో తక్కువ రూ.వంద అయినా అదనంగా వసూలు చేస్తున్నారు.

బయట సాధారణ వైన్స్ షాపుల్లో కింగ్ ఫిషర్ లైట్ బీర్ KingFisher light beer రూ.150 ఉండగా.. మేడారం జాతరలో మాత్రం ఒక్క లైట్ బీర్ రూ.250 నుంచి రూ.270 వరకు అమ్ముతున్నారు. ఇక స్ట్రాంగ్ బీర్ ఎంఆర్పీ రేటు రూ.160 ఉంటే.. జాతరలో రూ.260 నుంచి 280 వరకు తీసుకుంటున్నారు. లైట్ బీర్లకు డిమాండ్ ఎక్కువగా ఉంటుండటంతో అవసరాన్ని బట్టి రేట్లు పెంచి అమ్ముతున్నారు.

ఇదిలాఉంటే సాధారణంగా పేద, మధ్య తరగతి జనాలు ఎక్కువగా తీసుకునే రూ.190, రూ.200 విలువైన క్వార్టర్ సీసాలు అక్కడ డబుల్ రేట్ పలుకుతున్నాయి. మేడారంలో ఒక్కో క్వార్టర్ బాటిల్ రూ.330 నుంచి రూ.450 వరకు అమ్ముతున్నారు. ఒక వేళ అక్కడ ఫుల్ బాటిల్ కొనుగోలు చేయాలంటే మాత్రం అదనంగా రూ.350 నుంచి రూ.450 అదనంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది.

అనధికారిక విక్రయాలు.. అడ్డగోలు ధరలు..

మేడారం మహాజాతర నేపథ్యంలో టెండర్లు నిర్వహించి అక్కడ 22 వైన్స్ షాపులు ఏర్పాటు చేశారు. అఫీషియల్ గా వీటికి మాత్రమే అనుమతి ఉండగా.. అనధికారికంగా వందల షాపుల్లో లిక్కర్ సేల్స్ జరుగుతున్నాయి. వందల సంఖ్యలో బెల్ట్ షాపులు ఏర్పాటు చేయగా.. మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి.

జాతరలో కూల్ డ్రింక్స్, పాల ప్యాకెట్లు, కిరాణ షాప్ ఏర్పాటుకు పర్మిషన్ తీసుకున్న కొంతమంది అనుమతులు లేకుండా బెల్ట్ షాపులు నడిపిస్తున్నారు. దుకాణం ముందు భాగంలో కూల్ డ్రింక్స్, కిరాణ సామాన్ పెట్టి, వెనుక వైపు లిక్కర్ సేల్స్ జరుపుతున్నారు. దీంతో మేడారం మహాజాతరలో ఏ షాప్ లో చూసినా లిక్కర్ బాటిల్సే కనిపిస్తున్నాయి.

జాతరలో కల్తీ లిక్కర్ ఆరోపణలు

మేడారం జాతరలో అన్ అఫీషియల్ గా నడిచే కొన్ని బెల్ట్ షాపుల్లో కల్తీ మద్యం అమ్ముతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కొంతమంది తాము ఏర్పాటు చేసుకున్న దుకాణాల్లోనే క్వార్టర్ హాఫ్ సీసాల్లో నీళ్లు నింపడమో.. లేదా తమకు తోచిన పద్ధతుల్లో కల్తీ చేస్తున్నట్లు భక్తులు ఆరోపిస్తున్నారు.

ముఖ్యంగా కార్మికులు, పేద, మధ్య తరగతి జనాలు ఎక్కువగా తాగే కిందిస్థాయి బ్రాండులను స్పిరిట్ తో కల్తీ చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతోనే ఇలాంటి కల్తీ మద్యం తాగిన చాలామంది భక్తులు గొంతు ఇన్ ఫెక్షన్లతో పాటు ఇతర అనారోగ్యాలకు గురవుతున్నారు.

వాస్తవానికి కల్తీ మద్యం కట్టడికి సరైన చర్యలు చేపట్టకపోవడం వల్లే మేడారం మహాజాతరలో కల్తీ మాఫియా రాజ్యమేలుతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై దృష్టి పెట్టాల్సిన ఎక్సైజ్ అధికారులు మాత్రం లైట్ తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

తదుపరి వ్యాసం