Medaram Jatara 2024 : వనం నుంచి జనంలోకి సమ్మక్క - గద్దెపైకి ఆగమనం, జనసంద్రంగా మేడారం
Medaram Maha Jatara 2024 Updates: మేడారం జాతరలో రెండో కీలక ఘట్టం పూర్తి అయింది. వనం వీడి జనం మధ్యలోకి వచ్చిన సమ్మక్క తల్లి… గురువారం రాత్రి గద్దెకు చేరుకుంది. ప్రధాన పూజారి సమ్మక్కను ప్రతిష్టించారు.
Medaram Sammakka Sarakka Maha Jatara 2024: మేడారం జాతరలో అత్యంత కీలక ఘట్టం పూర్తి అయింది. చిలకలగుట్టపై నుంచి కుంకుమభరిణె రూపంలో జనం మధ్యలోకి సమ్మక్కను తీసుకువచ్చే కార్యం పూర్తి అయింది. ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ గాల్లోకి కాల్పులు జరిపి అధికార లాంఛనాలతో వనదేవతకు స్వాగతం పలికారు. మేడారం ప్రాంతమంతా జై సమ్మక్క నినాదాలతో మార్మోగిపోతుంది. సమ్మక్క గద్దెపైకి చేరుకున్న వేళ… మేడారం ప్రాంతమంతా జనసందోహంతో నిండిపోయింది.
చిలకలగుట్ట నుంచి సమ్మక్క గద్దెలకు తీసుకువస్తున్న సందర్భంగా సమ్మక్క రాకను స్వాగతిస్తూ దారి పొడవునా రంగు రంగుల ముగ్గులు వేసి ముగ్గులలో కోళ్ళను,మేకలను బలి ఇస్తు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవార్ల దర్శనానికి వచ్చిన హిజ్రాలు నిండుగా అలంకరించుకొని సమ్మక్కను తీసుకువచ్చే చిలకలగుట్ట దారిలో గుంపులు గుంపులుగా డప్పు చప్పుళ్ళు నడుమ నృత్యాలు చేస్తూ సమ్మక్క తల్లికి స్వాగతం పలికారు. దారి పొడవునా పండుగ వాతావరణం నెలకొంది.
ఆదివాసీ పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించి సమ్మక్కను గద్దెపైన కొలువుదీర్చారు. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు గద్దెలపై కొలువుదీరి భక్తులకు దర్శనమిస్తున్నారు. సమ్మక్క రాకతో మేడారానికి భారీగా భక్తులు తరలివస్తున్నారు.ఈ నెల 24వ తేదీన సమక్క-సారలమ్మ వన ప్రవేశంతో జాతర ముగుస్తుంది.
కేవలం వారు మాత్రమే….
సమ్మక్కను తీసుకొచ్చే రోజున దేవాదాయశాఖ ఇచ్చిన కొత్త బట్టలు ధరిస్తారు ప్రధాన పూజరి. కేవలం ఆయన బృందం మాత్రమే వనంలోకి వెళ్తుంది. అయితే అందరూ అనుకున్నట్టుగా.. లోపలివరకూ అందరికి ప్రవేశం లేదు. ప్రధాన పూజారి మాత్రమే వెళ్తారు. మిగిలిన వారంతా.. చిలుకలగట్ట సగం దగ్గరే ఆగిపోతారు. సమ్మక్క తల్లి కొలువై ఉండే రహస్య ప్రదేశంలో ప్రత్యేక పూజలు చేస్తారు. అమ్మవారిని కుంకుమ భరిణి రూపంలో తీసుకుని కిందకు దిగుతుంటే.. మిగిలిన బృందం సభ్యులంతా.. వాయిద్యాలతో శబ్ధాన్ని చేస్తారు. ఆ తర్వాత.. కిందకు రాగానే ప్రభుత్వ లాంఛనాల ప్రకారం.. గాల్లోకి కాల్పులు జరుపుతారు.
ఎప్పుడైతే సారలమ్మ గద్దెల మీదకు రాగానే.. జాతరలో ఓ విధమైన ఎమోషన్ మెుదలవుతుంది. మరోవైపు.. సమ్మక్క పూజారులు, వడ్డేలు రహస్య పూజల కోసం మేడారం సమీపంలోని అడవికి వెళ్తారు. రెండేళ్లకోసారి.. జరిగే ఈ జాతర కోసం.. కంక వనం తెచ్చెందుకు వాళ్లు రహస్య ప్రాంతానికి వెళ్తారు. అక్కడకు ఎవరినీ రానివ్వరు. వడ్డేలు, పూజారులు, తలపతులు అర్ధరాత్రి అడవికి వెళ్తారు. సామాన్య భక్తులు, స్థానికులు, ప్రభుత్వ అధికారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు.. ఇలా ఎవరైనా సరే.. అసలు అనుమతించరు. వాళ్లు మాత్రమే వెళ్తారు. సమ్మక్కను గద్దెపై నిలబెట్టాలి. అందుకోసం.. కంక చెట్టు కోసం చూస్తారు. కంక చెట్టు వెతికేందుకు.. రహస్య పద్ధతిలో గంటలతరబడి పూజలు చేస్తారు. అయితే ఈ పూజ కార్యక్రమం జరుగుతుండగానే.. సమ్మక్కను నుంచి ఆన వస్తుందని ఆదివాసులు చెబుతుంటారు. దాని ప్రకారమే.. ఓ కంక చెట్టును ఎంపిక చేస్తారు. అప్పటి నుంచి.. గురువారం తెల్లవారు జాము వరకు అడవిలోనే ఉంటారు. అప్పటి వరకు ప్రత్యేక పూజలు జరుగుతూనే ఉంటాయి. ఇలా అయిపోయిన తర్వాత.. చెట్టులో కొంత వెదురును నరుకుతారు. అడవిలో నరికిన వెదురు బొంగులతో అక్కడ నుంచి బయలుదేరుతారు. తమ భుజాలపై మోస్తూ.. మేడారం తీసుకువస్తారు. మేడారానికి ప్రారంభంలో ఉన్న పోతారజు గుడి వద్ద వెదురు బొంగులకు ప్రత్యేక పూజలు చేస్తారు. అనంతరం జాతర జరిగే ప్రదేశానికి వస్తారు. పూజల అనంతరం ఆ కంక వనాన్ని మేడారంలో సమ్మక్క గద్దెపై ప్రతిష్ఠిస్తారు. ఆ తర్వాత అమ్మవారిని కుంకుమ భరిణి రూపంలో గద్దెపైకి తీసుకొస్తారు.