Medaram Jatara : మేడారం.. వారం రోజుల మహానగరం-వేలాదిగా దుకాణాలు, గుడారాలు-warangal news in telugu medaram turns into city jatara one week lakhs of devotees visits sammakka saralamma ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Medaram Jatara : మేడారం.. వారం రోజుల మహానగరం-వేలాదిగా దుకాణాలు, గుడారాలు

Medaram Jatara : మేడారం.. వారం రోజుల మహానగరం-వేలాదిగా దుకాణాలు, గుడారాలు

HT Telugu Desk HT Telugu
Feb 22, 2024 08:51 PM IST

Medaram Jatara : మేడారం జాతర జరిగే వారం రోజులు ఈ ప్రాంతం మహానగరం మారిపోతుంది. వారం రోజుల పాటు గ్రేటర్ సిటీలకు ధీటుగా కనిపించే మేడారం.. ఆ తరువాత మళ్లీ కుగ్రామంగా మారిపోతుంది.

మేడారం ఈ వారం రోజుల మహానగరం
మేడారం ఈ వారం రోజుల మహానగరం

Medaram Jatara : మేడారం.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ కుగ్రామం. ములుగు జిల్లాలోని తాడ్వాయి ఫారెస్ట్ ఏరియాలో దాదాపు 2 వేల వరకు జనాభా ఉండే చిన్న గ్రామం. ఇక్కడ రెండేళ్లకోసారి నాలుగు రోజుల పాటు సమ్మక్క–సారలమ్మ జాతర(Sammakka Saralamma Jatara) జరగనుండగా.. ఆ కుగ్రామం కాస్త వారం రోజులపాటు మహానగరంగా వెలుగొందుతోంది. దేశ, విదేశాల నుంచి భక్తులు వన దేవతలైన సమ్మక్క–సారలమ్మ దర్శనానికి తరలి వస్తుండటం, ఊళ్లు, పట్టణాల నుంచి జనాలంతా మేడారానికి చేరుకుంటుండటంతో ఆ గ్రామం మెట్రో పాలిటన్ సిటీలా తయారైంది. దీంతో పాటు వివిధ రాష్ట్రాలకు చెందిన ఎంతోమంది ఉపాధి కోసం దుకాణాలు, ఆట వస్తువుల బిజినెస్ లు ఏర్పాటు చేసుకోగా.. జాతరకు వచ్చే భక్తులతో పరిసరాలన్నీ కిక్కిరిసిపోయాయి. అంతేగాకుండా ఇక్కడి రోడ్లపై బైకులు, కార్లు, బస్సులు తిరుగుతుండగా.. ఆకాశంలో హెలిక్యాప్టర్లు కూడా చక్కర్లు కొడుతున్నాయి. దీంతో మేడారం మహా నగరాలను మించిపోయి కనిపిస్తోంది. వారం రోజుల పాటు గ్రేటర్ సిటీలకు ధీటుగా కనిపించే మేడారం.. ఆ తరువాత మళ్లీ కుగ్రామంగా మారనుండటం గమనార్హం.

వెలిసిన వేలాది దుకాణాలు

మేడారం మహాజాతర(Medaram Jatara)లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఎంతోమంది దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. ఉపాధి కోసం వచ్చినవాళ్లంతా చికెన్, మటన్ షాపులతో పాటు ఆట వస్తువులు, ఫాస్ట్ ఫుడ్, వివిధ రకాల ఆటలు, ఎగ్జిబిషన్స్, లిక్కర్ షాపులు, కిరాణ షాప్ లు తదితర దుకాణాలు ఏర్పాటు చేసుకుని బిజినెస్ నడిపిస్తున్నారు. మేడారం గద్దెల నుంచి జంపన్నవాగు వెళ్లే మార్గంతోపాటు మేడారం వచ్చే వాహనాలు రాకపోకలు సాగించే అన్ని మార్గాల్లో వేలాది సంఖ్యలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. మేడారం మొత్తం మీద చిన్నవి, పెద్దవి అన్నీ కలిపి దాదాపు 20 వేల వరకు వివిధ దుకాణాలు ఏర్పాటయ్యాయని అంచనా. కాగా ఆయా షాపుల యజమానులతో పాటు అందులో పని చేసే వర్కర్లంతా కలిసి ఒక్కో దుకాణానికి కనీసం ఐదుగురైనా అందులో ఉంటున్నారు. ఉపాధి, ఉద్యోగ అవకాశాల కోసం ఎంతోమంది హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ లాంటి ప్రాంతాలను వెళ్లినట్టే వివిధ ప్రాంతాల నుంచి వచ్చి మేడారంలో దుకాణాలు పెట్టి ఉపాధి పొందుతున్నారు. దీంతో మేడారంలో దుకాణాల సందడి ఎక్కువగా కనిపిస్తోంది.

పొలాలన్నీ గుడారాలైనయ్

మేడారం గ్రామంలో ఉన్న రైతులంతా ఒక సీజన్ మాత్రమే సాగు చేస్తుంటారు. ఒక సీజన్ లో పంట వేసి ఇంకో సీజన్ ను మేడారం జాతర కోసం వదిలేస్తుంటారు. కాగా ఇప్పుడు మేడారం మహాజాతర సందర్భంగా రైతుల పొలాలన్నీ ఇప్పుడు గుడారాలు, దుకాణాలతో నిండిపోయినయ్. సమ్మక్క–సారలమ్మ గద్దెలకు చేరుకోవడానికి ముందే వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు ఇక్కడ గుడారాలు ఏర్పాటు చేసుకుని, తల్లుల రాకకోసం ఎదురుచూస్తుంటారు. సమ్మక్క–సారలమ్మ గద్దెలకు చేరుకోవడం నుంచి వన ప్రవేశం చేసేంత వరకు ఇక్కడే ఉండి తల్లుల సేవలో తరిస్తుంటారు. దీంతో అక్కడ తాత్కాలిక వెలిసిన గుడారాలు, దుకాణాలతో పాటు మేడారం చుట్టూరా 20 కిలోమీటర్ల వరకు వాహనాల రద్దీ కూడా ఎక్కువగానే కనిపిస్తుంటుంది.

కార్ల నుంచి గాలి మోటార్ల దాకా

సమ్మక్క–సారలమ్మ గద్దెలకు చేరక ముందు నుంచే మేడారం ముందస్తు మొక్కుల సందడి నెలకొంది. ఇక మహాజాతర ప్రారంభమైన తరువాత ఇక్కడి రోడ్లన్నీ మెట్రోపాలిటన్ సిటీలను మించిపోయాయి. అడుగు తీసి అడుగేయలేనంత రష్ ఏర్పడింది. దారి పొడవుగా దుకాణాలు, శివ సత్తుల పూనకాలతో సందడి నెలకొంది. కొద్దిరోజుల కిందటి వరకు కనీసం చూద్దామంటే ఎవరూ కనిపించని మేడారం గ్రామ రోడ్లన్నీ జనాలతో కిక్కిరిసిపోయి మహానగరాల్లో బిజినెస్ అడ్డాలను తలపిస్తున్నాయి. అంతేగాకుండా ఇక్కడి రోడ్లపై బైకులు, కార్లు, టాటా ఏస్లు, ఆటోలు కూడా తిరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో హెలీక్యాప్టర్ సేవలు కూడా అందుబాటులోకి తీసుకురావడంతో గాలి మోటార్లు కూడా ఇక్కడ చక్కర్లు కొడుతుండటం విశేషం.

వారం రోజులపాటు వెలుగులు

మేడారం జాతరకు దాదాపు 2 కోట్ల మంది వరకు భక్తులు రానుండటంతో అధికారులు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేశారు. అన్నిటికి మించి ఈ మహాజాతరలో కరెంట్ వెలుగులే ప్రధానమైనవి. దాదాపు 16 కోట్లతో ఇక్కడ కరెంట్ సంబంధ పనులు చేపట్టి జాతర పరిసరాలన్నింటికీ పవర్ సప్లై ఇచ్చారు. దీంతో నిరంతర వెలుగులతో మేడారం సిటీ మాదిరిగా కాంతులీనుతోంది. ఎక్కడికక్కడ హై మాస్ట్ లైట్లు, స్ట్రీట్ లైట్లు, దుకాణాలు, ఎగ్జిబిషన్ల వెలుగులతో మేడారం మొత్తం జిగేల్ మంటోంది. ఏడాది పొడవునా ఎలాంటి సందడి లేకుండా ఉండిపోయే ఈ గ్రామం కాస్త వారం రోజుల మహానగరంగా మారగా.. మరో నాలుగు రోజుల పాటు ఇదే రష్ కనిపించనుంది. ఇప్పటికే సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెలకు చేరుకోగా.. గురువారం సాయంత్రం సమ్మక్క కూడా గద్దెల మీదకు రానుంది. శనివారం సాయంత్రం అమ్మవార్లు వన ప్రవేశం చేయనుండగా.. ఆదివారం వరకు ఇక్కడ వెలిసిన గుడారాలన్నీ ఖాళీ కానున్నాయి. దీంతో వారం రోజులపాటు గ్రేటర్ సిటీలను మించిపోయి వెలుగులు పంచిన మేడారం కాస్త.. ఆదివారం తరువాత మళ్లీ కుగ్రామంగా మారనుంది.

(హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)

WhatsApp channel

సంబంధిత కథనం