Lagacharla Incident : గుండెనొప్పి వచ్చిన వ్యక్తికి.. బేడీలు వేస్తారా.. కేటీఆర్ ఫైర్
12 December 2024, 14:38 IST
- Lagacharla Incident : వికారాబాద్ జిల్లా లగరచ్లలో అధికారులపై దాడి కేసు నిందితులు జైల్లో ఉన్నారు. అయితే.. వారిపట్ల ప్రభుత్వం, పోలీసులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు దారితీస్తోంది. తాజాగా ఓ వ్యక్తికి బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై బీఆర్ఎస్ భగ్గుమంది. ప్రభుత్వంపై ఫైర్ అయ్యింది.
హీర్యానాయక్‌కు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొస్తున్న దృశ్యం
రారాజు, చక్రవర్తిలా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారని.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. నెల కిందట ప్రభుత్వంపై లగచర్ల రైతులు తిరగబడ్డారన్న కేటీఆర్.. తమ నిరసనను రైతులు గట్టిగా వినిపించారని వ్యాఖ్యానించారు. తనపై ఎలాంటి దాడి జరగలేదని కలెక్టర్ స్వయంగా చెప్పారని.. అయినా రైతులతో పాటు పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
'రైతులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. నెల రోజులుగా 40 మంది జైలులో మగ్గుతున్నారు. జైలులో ఉన్న రైతుకు నిన్న గుండె నొప్పి వచ్చింది. ఈ విషయం బయటకు రాకుండా ప్రభుత్వం యత్నిస్తోంది. కుటుంబ సభ్యులకు కూడా తెలియజేయలేదు. గుండెనొప్పి వచ్చిన వ్యక్తికి.. బేడీలు వేసి ఆస్పత్రికి తీసుకురావడం దారుణం' అని కేటీఆర్ వ్యాఖ్యానించారు.
'దేశానికి అన్నం పెట్టే రైతన్న చేతికి బేడీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గ వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నాం. అనారోగ్యంతో బాధపడుతున్న లగచర్ల రైతుకు బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం హేయమైన చర్య. ఇంత కంటే దారుణం ఏముంటుంది. రైతు హీర్యా నాయక్ ఉగ్రవాదా..? లేక దోపిడీ దొంగనా..? రైతుల పట్ల ఎందుకు ఇంత కర్కశంగా వ్యవహరిస్తున్నారు. వాళ్ల భూములు గుంజుకుంటారు. తిరగబడితే అరెస్టులు చేస్తారు. వాళ్ళను ఉగ్రవాదులుగా భావిస్తూ అత్యంత క్రూరంగా వ్యవహరిస్తారు. రేవంత్ రెడ్డి.. ఇదేనా మీ ఇందిరమ్మ రాజ్యం. ఇదేనా మీ ప్రజాపాలన? ముమ్మాటికి మీది ప్రజా కంటక పాలన. రైతు కంటక పాలన' అని సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ట్వీట్ చేశారు.
'అనారోగ్యంతో ఉన్న అన్నదాతలకు బేడీలు వేసిన రాక్షస ప్రభుత్వం. రేవంత్ రెడ్డీ, నిన్ను ‘మా తెలంగాణ తల్లి’ క్షమించదు గాక క్షమించదు. ఇక మీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డయి. లగచెర్ల కేసులో మీరు జైలుకు పంపిన మా గిరిజన రైతు హీర్యా నాయక్ కు నిన్న రాత్రి గుండెపోటు వస్తే.. గాంధీ ఆస్పత్రికి మానవత్వం లేకుండా బేడీలు గొలుసులు వేసి మరీ తరలించిండ్రు మీ పోలీసులు. లోపల మరి కొంతమంది ఆరోగ్యం క్షీణించినా పట్టించుకోవడం లేదు మీ అధికారులు. మీరు ఆ రైతుల మీద కక్ష కట్టి నెల రోజుల నుండి బెయిల్ రాకుండా చేస్తున్న కుట్రలన్నీ త్వరలోనే బయటపెడ్తాం. మీది ప్రజా పాలన కాదు, ముమ్మాటికీ ప్రతీకార పాలనే' అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్వీట్ చేశారు.