తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  World Cancer Day : భారత్ లో క్యాన్సర్ కలవరం, 2026 నాటికి ఏటా 20 లక్షల మరణాలు!

World Cancer Day : భారత్ లో క్యాన్సర్ కలవరం, 2026 నాటికి ఏటా 20 లక్షల మరణాలు!

HT Telugu Desk HT Telugu

04 February 2024, 17:47 IST

google News
    • World Cancer Day : 2026 నాటికి మన దేశంలో ఏటా 20 లక్షల మంది క్యాన్సర్ తో మరణిస్తారని ఎయిమ్స్ నివేదిక తెలిపింది. వరల్డ్ క్యాన్సర్ డే సందర్భంగా క్యాన్సర్ పై అవగాహన పెంచుకుందాం.
 భారత్ లో క్యాన్సర్ కలవరం
భారత్ లో క్యాన్సర్ కలవరం (Pexels)

భారత్ లో క్యాన్సర్ కలవరం

World Cancer Day : "క్యాన్సర్‌" అనే వ్యాధి పేరు వింటే చాలు. వెన్నులో వణుకు పుడుతుంది. కాళ్లు చేతులు వణికిపోతాయి. ఈ వ్యాధిని గుర్తించిన మొదలు.. చికిత్స పూర్తయ్యే వరకు నరకయాతన అనుభవించాలి. ట్రీట్మెంట్‌ తర్వాత కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాలి. తిరిగి ఆరోగ్యవంతులు కావాలంటే ఎంత సమయం పడుతుందో కూడా చెప్పలేం. క్యాన్సర్‌ ప్రాణాలను సైతం బలితీసుకుంటుంది. రొమ్ము, ఊపిరితిత్తులు, చర్మం, గొంతు.. ఇలా శరీరంలోని వివిధ అవయవాలకు ఈ వ్యాధి సోకుతుంది. మన దేశంలో క్యాన్సర్‌ వ్యాధి గురించి, దాని లక్షణాల గురించి ఇప్పటికి చాలా మందికి అవగాహన లేదు. ముదిరిన దశలో వ్యాధిని గుర్తించడం వల్ల పరిస్థితి చేజారుతోంది. కొన్ని లక్షణాలను బట్టి క్యాన్సర్‌ వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడానికి వీలుంది. నేడు ప్రపంచ క్యాన్సర్‌ దినం సందర్భంగా ఇవేంటో తెలుసుకుందాం. అసలు క్యాన్సర్‌ అంటే ఏమిటీ? ఎలా ఏర్పడుతుంది? ఏయే క్యాన్సర్లను ఎలా గుర్తించాలి? తదితర అంశాలను తెలుసుకుందాం.

ప్రపంచ వ్యాప్తంగా 1.3 కోట్ల మరణాలు

క్యాన్సర్‌ వ్యాధి ప్రపంచ వ్యాప్తంగా మానవాళిని కబళిస్తోంది. సైన్స్‌ పరంగా ఎంత అభివృద్ధి చెందుతున్నా.. క్యాన్సర్‌ మరణాలు, వ్యాధి తీవ్రత తగ్గడం లేదు. 2015లో ప్రపంచవ్యాప్తంగా దాదాపు 90.5 మిలియన్ల మందికి క్యాన్సర్‌ వచ్చింది. 2019లో క్యాన్సర్‌ కేసులు 23.6 మిలియన్లకు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల మరణాలు సంభవించాయి. ఇది గత దశాబ్దంలో వరుసగా 26 శాతం పెరుగుదలను సూచిస్తుంది. మొత్తం మీద చాపకింద నీరులా యావత్‌ ప్రపంచాన్నే చుట్టేస్తున్న క్యాన్సర్‌పై మానవుడు నిత్యం పోరాడుతూనే ఉన్నాడు. మరీ బాధాకరమైన విషయం ఏమంటే ప్రపంచ వ్యాప్తంగా చిన్నారులు సైతం లక్షల్లో క్యాన్సర్‌ బారిన పడటం ఆందోళన కలిగిస్తోంది. పురుషులలో అత్యంత సాధారణమైన క్యాన్సర్‌ రకాలుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ప్రోస్టేట్‌ క్యాన్సర్‌, కొలొరెక్టల్‌ క్యాన్సర్‌, కడుపు క్యాన్సర్‌. స్త్రీలలో, అత్యంత సాధారణ రకాలు రొమ్ము క్యాన్సర్‌, కొలొరెక్టల్‌ క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, గర్భాశయ క్యాన్సర్‌. ప్రతి సంవత్సరం మొత్తం కొత్త క్యాన్సర్‌ కేసులలో మెలనోమా కాకుండా ఇతర చర్మ క్యాన్సర్‌లను చేర్చినట్లయితే ఇది దాదాపు 40 శాతం కేసులకు కారణం అవుతుంది. పిల్లలలో, తీవ్రమైన లింఫోబ్లాస్టిక్‌ లుకేమియా మెదడు కణితులు సర్వసాధారణం, ఆఫ్రికాలో తప్ప హాడ్కిన్‌ కాని లింఫోమా ఎక్కువగా సంభవిస్తుంది. 2012లో 15 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న 165,000 మంది పిల్లలు క్యాన్సర్‌తో బాధపడుతున్నారు. వయస్సుతో పాటు క్యాన్సర్‌ ప్రమాదం గణనీయంగా పెరుగుతుంది. అభివృద్ధి చెందిన దేశాలలో చాలా క్యాన్సర్లు ఎక్కువగా సంభవిస్తాయి. ఎక్కువ మంది ప్రజలు వృద్ధాప్యం వరకు జీవిస్తున్నందున అభివృద్ధి చెందుతున్న దేశాలలో జీవనశైలి మార్పులు సంభవిస్తున్నందున అనేక రెట్లు పెరుగుతున్నాయి.

భారతదేశంలో పరిస్థితి ఏంటి?

భారతదేశంలో 2020 సంవత్సరంలో 13.92 లక్షలు మంది ప్రజలు క్యాన్సర్‌ బారిన పడగా, 2021లో 14.26 లక్షల మంది, 2022లో 14.61 ప్రజల మంది ఈ మహమ్మారి బారిన పడ్డారు. మన దేశంలో క్యాన్సర్‌ మరణాల సంఖ్య 2018లో 7.33 లక్షలకు పెరిగింది. 2022లో 8.08 లక్షల మంది ప్రజలు చనిపోయారు. అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ(ఎయిమ్స్‌) నివేదిక ప్రకారం 2026 నాటికి ప్రతి సంవత్సరం 20 లక్షల మంది క్యాన్సర్ తో మరణిస్తారని తెలిపింది. ఈ వ్యాధి నిరోధానికి ప్రాథమిక దశలోనే గుర్తిస్తే, ఈ వ్యాధిని కొంత వరకు నయం చేయవచ్చని తెలిపింది.

కణజాలం విపరీతంగా పెరగడమే..

శరీరం మొత్తం కణజాలంతో నిండి ఉంటుంది. శరీరంలో ఎక్కడైనా కణజాలం అవసరం లేకుండా విపరీతంగా పెరిగిపోవడమే క్యాన్సర్‌ అని క్యాన్సర్‌ వైద్య నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా శరీరంలో కణాల విభజన జరుగుతుంది. ఇలా ప్రతి కణం విభజనకు గురై పుడుతూ చనిపోతూ ఉంటాయి. అయితే శరీరంలో ఈ ప్రక్రియకు విఘాతం ఏర్పడితే కొన్ని కణాలు చనిపోకుండా అలాగే ఉండిపోతాయి. కణాల్లో ఉండే డీఎన్‌ఏలో మార్పుల వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఆహారపు అలవాట్లు, రేడియేషన్‌, స్మోకింగ్‌, ఊబకాయం తదితర కారణాల వల్ల కూడా డీఎన్‌ఏలో మార్పులు వస్తాయి. బ్రెస్ట్‌ క్యాన్సర్‌ (రొమ్ములు), స్కిన్‌ క్యాన్సర్‌ (చర్మం), లంగ్‌ క్యాన్సర్‌ (ఊపిరితిత్తులు), ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ (మూత్రాశయం), కొలోన్‌ లేదా రెక్టం క్యాన్సర్‌ (పెద్ద పేగు భాగం), కిడ్నీ క్యాన్సర్‌ (మూత్రపిండాలు), బ్లడ్‌ క్యాన్సర్‌ (రక్తం), సర్వైకల్‌ క్యాన్సర్‌ వంటివి ముఖ్యమైనవని వైద్యులు చెబుతున్నారు.

రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.

తదుపరి వ్యాసం