World cancer Day 2024: క్యాన్సర్ లక్షణాలను ముందే గుర్తిస్తే ఎక్కువ కాలం జీవించే అవకాశాలు పెరుగుతాయి
03 February 2024, 16:39 IST
- World cancer Day: ప్రపంచంలో క్యాన్సర్ కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. అందుకే క్యాన్సర్ లక్షణాలు, చికిత్స పై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రతి ఏడాది ఫిబ్రవరి 4న వరల్డ్ క్యాన్సర్ డే ను నిర్వహిస్తారు.
వరల్డ్ క్యాన్సర్ డే
World cancer Day: క్యాన్సర్... ప్రపంచంలోని మహమ్మారి రోగాలలో ఇది ఒకటి. క్యాన్సర్ వస్తే ఆరోగ్య పరంగా ఎన్నో సమస్యలు వస్తాయి. జీవించే కాలం కూడా తగ్గిపోతుంది. ప్రపంచవ్యాప్తంగా అనారోగ్యంతో మరణిస్తున్న వారి సంఖ్య పెరగడానికి క్యాన్సర్ రెండో అతిపెద్ద కారణం. 2018 లోనే ప్రపంచంలో మరణించిన ప్రతి ఆరుగురిలో ఒకరు క్యాన్సర్ కారణంగానే మరణించారు. 2018లో కేవలం క్యాన్సర్ కారణంగా మరణించిన వారి సంఖ్య కోటి పైగా ఉంది. పొట్ట క్యాన్సర్, కాలేయ క్యాన్సర్, ప్రో స్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్ ఎక్కువ మందిని ప్రభావితం చేస్తున్నాం. ముఖ్యంగా మహిళల్లో రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్ ఎక్కువగా వస్తున్నాయి.
క్యాన్సర్ ప్రమాదకరం
క్యాన్సర్ కారణాలను అర్థం చేసుకొని ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నా లేక దాని లక్షణాలను ముందుగానే పసిగట్టినా చికిత్స సులభతరం అవుతుంది. ఆ రోగి ఎక్కువకాలం జీవించే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ ముదిరిపోయాక ఈ రోగాన్ని గుర్తిస్తే చికిత్స కష్టతరంగా ఉంటుంది. అలాగే జీవిత కాలం కూడా తగ్గిపోతుంది. మన దేశంలో ప్రతి ఏడాది సుమారు 11 లక్షల మందికి కొత్తగా క్యాన్సర్ సోకుతున్నట్లు తెలుస్తోంది. అందులోనూ నోటి క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ వల్ల మన దేశంలో ఎక్కువమంది మనదేశంలో మరణిస్తున్నారు.
క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
మనదేశంలో క్యాన్సర్ విషయంలో చాలా తక్కువ అవగాహన ఉంది. ప్రతి ముగ్గురిలో ఇద్దరికి క్యాన్సర్ ముదిరిపోయిన తర్వాతే బయటపడుతోంది. దీంతో వారు బతికే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతున్నాయి. క్యాన్సర్ రావడానికి జన్యుపరమైన కారణాలు ఉంటాయి. కుటుంబ చరిత్రలో ఎవరికైనా క్యాన్సర్ ఉంటే వారి వారసులకు వచ్చే అవకాశం ఎక్కువ. అలాగే వయసు పెరుగుతున్న కొద్దీ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థ బలహీనంగా ఉన్నా కూడా క్యాన్సర్ కణితులు ఎక్కడైనా పెరగవచ్చు. అలాగే మద్యపానం, ధూమపానం వంటి అలవాట్లు ఉన్నవారికి ఇది వచ్చే అవకాశం ఉంది. చెడు ఆహారపు అలవాట్లు, అధిక బరువు వంటివి కూడా క్యాన్సర్ వచ్చే అవకాశాలను పెంచుతాయి. మనదేశంలో 40% క్యాన్సర్ వస్తున్నది పొగాకు వల్లనే. ఇది 14 రకాల క్యాన్సర్లకు కారణం అవుతుంది. ఈ పొగాకులో 80 రకాల క్యాన్సర్ కారకాలు ఉంటాయి. ఆ పొగను పీల్చినప్పుడు ఆ రసాయనాలు ఊపిరితిత్తుల్లోకి చేరుతాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, నోటి క్యాన్సర్ రావడానికి ఇవి కారణమవుతాయి. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడానికి ఊబకాయం ఒక కారణం. కొన్ని రకాల ఇన్ఫెక్షన్లు వైరస్‌ల వల్ల క్యాన్సర్లు రావచ్చు. ముఖ్యంగా సర్వైకల్ క్యాన్సర్ రావడానికి HPV అనే ఇన్ఫెక్షన్ కారణం. అధిక కొవ్వు ఉన్న పదార్థాలు, ఎర్రని మాంసాలు, ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఉప్పు అధికంగా వేసిన ఆహార పదార్థాలు తినకూడదు.
క్యాన్సర్ లక్షణాలు
తిన్నది అరగకపోవడం, గుండెల్లో మంట పెట్టడం, రాత్రుళ్ళు చెమట పట్టడం, గొంతు, ముక్కు నుంచి రక్తం కారడం, దగ్గు వదలకుండా ఎక్కువ కాలం పాటు ఉండడం, ఆహారం మింగడానికి ఇబ్బంది పడడం, వాంతుల్లో రక్తం కనిపించడం, మూత్రంలో రక్తం కనిపించడం, మూత్ర విసర్జన చేయడానికి ఇబ్బంది పడడం... ఇవన్నీ కూడా క్యాన్సర్ లక్షణాలే. వీటిలో ఏ లక్షణం కనిపించినా తేలిగ్గా తీసుకోవద్దు. వెంటనే వైద్యులను కలిసి పరీక్షలు చేయించుకోవడం ఉత్తమం.
క్యాన్సర్ చికిత్స
రేడియో థెరపీ, కీమో థెరపీ వంటి చికిత్సల ద్వారా క్యాన్సర్ నివారించేందుకు వైద్యులు చికిత్సలు అందిస్తారు. కొన్నిసార్లు క్యాన్సర్ సోకిన అవయవాలను తొలగించడం వంటివి చేస్తారు. క్యాన్సర్ ఎన్నో స్టేజ్ లో ఉందో దాని ప్రకారం శస్త్ర చికిత్స లేదా కీమోథెరపీ అనేది ఆధారపడి ఉంటుంది.