Khammam Collector : విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని కలెక్టర్ మధ్యాహ్న భోజనం, హడలెత్తిన ఉపాధ్యాయులు!
27 March 2024, 20:10 IST
- Khammam Collector : ఖమ్మం జిల్లాలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించేందుకు వెళ్లిన కలెక్టర్ ఉపాధ్యాయులకు షాక్ ఇచ్చారు. ఆకస్మికంగా పాఠశాలలను పరిశీలించిన ఆయన తాండలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనం చేశారు.
విద్యార్థులతో కలిసి నేలపై కూర్చుని కలెక్టర్ మధ్యాహ్న భోజనం
Khammam Collector : ఖమ్మం జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ సర్కార్ ప్రభుత్వ బడిలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం(Midday Meal) చేశారు. పార్లమెంట్ ఎన్నికలు(Lok Sabha Elections) సమీపిస్తున్న నేపథ్యంలో జిల్లాలోని తల్లాడ మండలంలో వివిధ పాఠశాలల్లో పోలింగ్ కేంద్రాలను ఆయన ఆకస్మికంగా పరిశీలించారు. అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ తర్వాత కొద్ది నెలల వ్యవధిలోనే లోక్ సభ ఎన్నికలు జరుపుతుండటంతో పోలింగ్ కేంద్రాల్లో(Polling Centers) వసతులను పరిశీలించేందుకు కలెక్టర్ వీపీ గౌతమ్ ఆకస్మిక పర్యటనకు వచ్చారు. తల్లాడ మండలంలోని గొల్లగూడెం, తెలగవరం, అంజనాపురం, మల్సూర్ తాండ గ్రామాల్లోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, మిట్టపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠాశాలలను ఆయన సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో వసతుల కల్పనను తనిఖీ చేసిన అనంతరం పాఠశాలల ప్రధానోపాధ్యాయులతో మాట్లాడారు. విద్యార్థుల నమోదును పరిశీలించారు.
విద్యార్థుల సంఖ్య పెరిగేలా చర్యలు
విద్యార్థుల నమోదు పెరిగేలా కార్యాచరణ అమలు చేయాలని కలెక్టర్ వీపీ గౌతమ్ సర్కార్ సూచించారు. ఉపాధ్యాయుల సంఖ్యను కూడా అడిగి తెలుసుకున్నారు. విద్యార్థుల నమోదు తక్కువగా ఉండడంతో వచ్చే విద్యా సంవత్సరంలో నమోదులు పెరిగేలా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో(TS Govt Schools) నిష్ణాతులైన ఉపాధ్యాయులు, ఆంగ్ల మాధ్యమంలో బోధన, ఉచిత పాఠ్య పుస్తకాలు(Free Books), యూనిఫామ్, మధ్యాహ్న భోజనం వంటి సౌకర్యాలను ప్రభుత్వం అందిస్తోందని, ఈ దిశగా పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారిలో నమ్మకం పెంచాలన్నారు.
హడలెత్తిన ఉపాధ్యాయులు
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేస్తున్న క్రమంలోనే కలెక్టర్ వీపీ గౌతమ్ సర్కార్ (Khammam Collector )మల్సూర్ తాండలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. వారితో కలిసి నేలపైనే కూర్చుని భోజనం(Midday Meals) పెట్టమని కోరారు. ప్లేట్ అందుకుని ఎంచక్కా భోజనం ఆరగించారు. పిల్లలతో ముచ్చటించి వారిని ఉత్తేజపరిచారు. మంచిగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని తెలిపారు. ఈ హఠాత్పరిణామంతో పాఠాశాల ఉపాధ్యాయులు హడలెత్తిపోయారు. ఏమైనా లోటుపాట్లు దొర్లుతాయేమోనని భయబ్రాంతులు చెందారు. చివరికి ఎలాంటి అవాంతరాలు చోటుచేసుకోకుండా కలెక్టర్ ప్రశాంతంగా వెళ్లిపోవడంతో పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. కలెక్టర్ వెంట తల్లాడ మండల తహసీల్దార్ రవి కుమార్, ఎంపీడీవో చంద్రమౌళి, అధికారులు ఉన్నారు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం