Reservations for govt students: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు రిజర్వేషన్లు
Reservations for govt students: ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో 5% రిజర్వేషన్లు కల్పించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించింది.
Reservations for govt students: ప్రభుత్వ స్కూల్స్ లో చదువుతున్న విద్యార్థులకు అస్సాంలోని బీజేపీ ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీలలో 5% సీట్లు కేటాయిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
7 నుంచి 12 వరకు..
రిజర్వేషన్లకు సంబంధించి అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు చదివిన విద్యార్థులకు ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల్లో 5% రిజర్వేషన్లు కల్పిస్తామని అస్సాం విద్యాశాఖ మంత్రి డాక్టర్ రనోజ్ పెగు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే ఇంజినీరింగ్, మెడికల్ కాలేజీల్లో 5% సీట్లను ప్రభుత్వ పాఠశాలల్లో చదివి, ఉత్తీర్ణులైన విద్యార్థులకు కేటాయించాలని అస్సాం ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.
కేబినెట్ ఆమోదం..
కేబినెట్ సమావేశంలో రాష్ట్ర సంక్షేమం కోసం అనేక ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నామని, రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే అన్ని మెడికల్ మరియు ఇంజనీరింగ్ కాలేజీలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు 5% రిజర్వేషన్లు కల్పించే నిర్ణయం అందులో ఒకటని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ వెల్లడించారు. అయితే, ఆ విద్యార్థులు కనీసం 7వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాలలో అస్సాం స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డ్ (SEBA) సిలబస్ ను చదివి ఉండాలి. అలాగే, 11వ తరగతి, 12వ తరగతిలను అస్సాం హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్ కౌన్సిల్ (AHSEC) సిలబస్ ను ప్రభుత్వ కళాశాలల్లో చదవి ఉండాలి.
ప్రస్తుత రిజర్వేషన్ల పరిధిలోనే..
ఈ రిజర్వేషన్లను అదనంగా కల్పిస్తున్నవి కావని అస్సాం ప్రభుత్వం స్పష్టం చేసింది. షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగలు (ST), ఇతర వెనుకబడిన తరగతులు (OBC), మైనారిటీలు, ఇతర వెనుకబడిన తరగతులు (MOBC), ఆర్థికంగా బలహీనమైన విభాగం (EWS), జనరల్ కేటగిరీల్లోనే అంతర్గతంగా ఈ రిజర్వేషన్లను కల్పిస్తామన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతుందని భావిస్తున్నామన్నారు. విద్యార్థుల కొరత లేదా రిజల్ట్స్ సరిగ్గా రాకపోవడం వంటి కారణాల వల్ల ఇటీవల చాలా ప్రభుత్వ పాఠశాలలను మూసేశారు.