Khammam Congress : కంచుకోట ఖమ్మంలోనూ ఎంపీ టికెట్ సందిగ్ధత వీడదేమి...?
Lok Sabha Elections in Telangana 2024: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి ఖరారుపై ఇంకా సందిగ్ధత కొనసాగుతూనే ఉంది. జిల్లాకు చెందిన ముగ్గురు మంత్రులు కూడా…. టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తుండటంతో ఇక్కడి రాజకీయం రసవత్తరంగా సాగుతోంది.
Khammam Lok Sabha Constituency: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చైతన్యానికి కొలమానంగా చెప్పుకునే ఏకైక జిల్లా ఖమ్మం. ఒకప్పుడు కమ్యూనిస్టుల కంచుకోటగా చెప్పుకునే ఈ జిల్లా క్రమక్రమంగా కాంగ్రెస్ చేతిలోకి వచ్చి ఒదిగిపోయింది. ఎంపీ నుంచి మొదలుకొని ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్మన్లుగా సైతం కమ్యూనిస్టులు గెలుచుకున్న ఖమ్మం జిల్లాలో(Khammam Politics) ఇప్పుడు ఎర్ర జెండాల ప్రాబల్యం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. గడిచిన దశాబ్ద కాలంగా ఖమ్మం జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా మారిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కమ్యూనిస్టుల ప్రాతినిధ్యం అంతకంతకు పడిపోయింది. చైతన్యానికి మారుపేరుగా చెప్పుకునే ఖమ్మం జిల్లా ప్రజలు పరిస్థితులకు అనుగుణంగా మార్పు చెందుతూ రాజకీయాలను సైతం అదే రీతిలో శాసిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే సిద్ధాంతాలను పక్కన పెట్టిన ఎర్ర జెండా పార్టీలను సైతం జిల్లా ప్రజలు పక్కకు పెట్టేశారు. దశాబ్ద కాలంగా కాంగ్రెస్ పార్టీకి పెట్టని కోటలా ఖమ్మం జిల్లా మారిపోయింది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా టిఆర్ఎస్ పార్టీని, ఆ పార్టీ అధినేత కేసీఆర్ ను తొలి నుంచి ఈ జిల్లా ప్రజలు విశ్వసించలేదు. ఈ క్రమంలోనే 2014, 2018 ఎన్నికలతో పాటు మొన్న జరిగిన 2023 ఎన్నికల్లోనూ ఆ పార్టీని ఒకే సీటుకు పరిమితం చేశారు. దీంతో తాజాగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ పార్టీ తిరుగులేని శక్తిగా మారింది.
ఎంపీ అభ్యర్థిపై వీడని సందిగ్దత….
Khammam Congress MP Candidate : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బలీయమైన శక్తిగా మారిన కాంగ్రెస్ తరపున ఖమ్మం ఎంపీ(Khammam Lok Sabha) స్థానానికి పోటీ చేసే అభ్యర్థి ఎవరనే మీమాంస ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సిట్టింగ్ అభ్యర్థిని తిరిగి ఖమ్మం బరిలో నిలుపుతుండగా భారతీయ జనతా పార్టీ సైతం అభ్యర్థిని ఖరారు చేసింది. బీజేపీ ఆచితూచి హిందుత్వ నేపద్యం కలిగిన కుటుంబానికి చెందిన అభ్యర్థి తాండ్ర వినోద్ రావును ఎన్నికల బరిలో నిలిపింది. అయితే అధికార కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థిని(Khammam Congress MP candidate 2024) ఖరారు చేయడంలో ఇంకా మల్లగులాలు పడుతోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ఖమ్మం జిల్లా నేతలు ముగ్గురు ఎంపీ టిక్కెట్ కోసం పోటీ పడుతున్న నేపథ్యంలో అభ్యర్థిని ఖరారు చేయడం అధిష్టానానికి పెద్ద సవాలుగా మారిపోయింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సైతం తమ వారికి టిక్కెట్ ఇప్పించుకునే క్రమంలో గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు.
జిల్లాకు చెందిన ఈ నేతలతో పాటు రాష్ట్ర స్థాయి నాయకుల చూపు సైతం ఖమ్మం పైనే పడింది. జెట్టి కుసుమ కుమార్ తో పాటు మరో సీనియర్ నేత వి హనుమంతరావు ఖమ్మం నుంచి పోటీ చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన ఒక వ్యాపారవేత్త టికెట్ ఆశిస్తున్నారు. ఆయనకు ప్రజాబలం లేనప్పటికీ ఆర్థిక అండదండలతో ఎంపీ టికెట్ కోసం పావులు కదుపుతున్నారు. అయితే మొన్నటి ఎన్నికల ఫలితాలు రాష్ట్ర ప్రజలను ఖమ్మం వైపు చూసేలా చేశాయి. డిప్యూటీ సీఎంతో పాటు కేబినెట్ లో ఇద్దరు కీలక మంత్రులు ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించడమే ఇందుకు నిదర్శనం. అయితే ఇప్పుడు ఈ పరిణామమే ఎంపీ టిక్కెట్ ఎంపికలో అధిష్టానానికి పెద్ద చిక్కుగా మారింది. సాక్షాత్తు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో అధిష్టానం వద్ద నెరిపిన చర్చల్లోనూ ఖమ్మం టిక్కెట్ పై స్పష్టత రాకపోవడం గమనార్హం. పోటీ పడుతున్న అభ్యర్థులు ఎవరికి వారు తోచిన మార్గాల్లో అధిష్టానంపై ఒత్తిడి తెస్తూనే ఢిల్లీ పెద్దల నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ప్రకటనలు చేయడం విస్మయం కలిగిస్తోంది. అయితే అన్ని కోణాల్లో కసరత్తు పూర్తి చేసి మరో వారం రోజుల్లో ఖమ్మం అభ్యర్థిని తేల్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.