Khammam News : వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్-ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు-khammam traffic police special drive 50 vehicles seized number plate tampered ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Khammam News : వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్-ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

Khammam News : వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్-ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

HT Telugu Desk HT Telugu
Mar 18, 2024 09:49 PM IST

Khammam News : నంబర్ ప్లేట్ లేకుండా లేదా ట్యాంపర్డ్ చేసి వాహనాలు నడిపితే చర్యల తప్పవని ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు హెచ్చరించారు. సోమవారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి నిబంధనలు ఉల్లంఘించిన 50 వాహనాలు సీజ్ చేశారు.

ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు
ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు

Khammam News : లైసెన్స్, నంబర్‌ ప్లేట్‌ లేకుండా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తప్పవని ఖమ్మం(Khammam News) ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు తెలిపారు. ఖమ్మం పోలీస్ కమిషనర్ సునీల్ దత్ ఆదేశాల మేరకు నేరాల నియంత్రణతో పాటు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను వెంటనే గుర్తించడం, లైసెన్సు లేకుండా వాహనాలను రోడ్లపై తిరగకుండా చేసేందుకు ఖమ్మం ట్రాఫిక్ పోలీసులు గురువారం నుంచి ప్రత్యేక డ్రైవ్‌కు శ్రీకారం చుట్టారు. నగర పరిధిలో లైసెన్సు, నంబర్‌ ప్లేట్‌(Number Plate), నంబర్‌ సక్రమంగా లేని, నంబర్‌ ట్యాంపర్డ్‌ కలిగిన, నంబర్‌ తుడిపివేసిన వాహనాలను గుర్తించేందుకు ట్రాఫిక్ పోలీసులు వాహనాల తనిఖీలు చేపట్టారు. ఈక్రమంలో నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న 50 వాహనాల గుర్తించి సీజ్ (vehicle seize)చేసి జరిమానా విధించారు. వాహన యజమానితోనే నంబర్‌ సరి చేయించి కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ సీఐ మోహన్ బాబు మాట్లాడుతూ నగర పరిధిలో ప్రధాన కూడళ్లతో పాటు ప్రధాన రహదారులపై నిరంతరం స్పెషల్‌ డ్రైవ్‌ కొనసాగుతుందని తెలిపారు. ప్రస్తుతం ద్విచక్ర వాహనాలను తనిఖీ చేస్తుండగా రెండో ప్రాధాన్యత కింద నాలుగు చక్రాల వాహనాలను తనిఖీ చేయనున్నట్లు తెలిపారు.

వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్

అదేవిధంగా హెల్మెంట్‌ లేకుండా వాహనాలు నడపడం, పరిమితికి మించి వాహనంపై వెళ్లడంతో జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా వాహనదారులు జరిమానాల నుంచి తప్పించుకునేందుకు రిజిస్ట్రేషన్‌ అయి ఉన్పప్పటికీ కొంత మంది వాహనదారులు నంబర్‌ ప్లేట్‌ను(Number Plate) తొలగించడం, ఉన్న నంబర్‌ ప్లేట్‌ను వంచడం, నంబర్‌ తుడిపివేయడం చేస్తున్నారని, దీనిని అసరాగా తీసుకుని కొంత మంది దొంగతనాలకు పాల్పడినప్పుడు నంబర్‌ లేని వాహనాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. దీంతో చోరీలకు పాల్పడిన వారిని గుర్తించడం సవాల్‌గా మారుతోందన్నారు. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను గుర్తించడం కూడా కష్టంగా మారుతోందన్నారు. నేరాలను నియంత్రించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని గుర్తించేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మోటార్‌ వెహకిల్‌ నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్‌ లైసెన్స్‌(Driving License), వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు నంబర్‌ ప్లేట్‌ ఉండాలని, తనిఖీల సమయంలో వాహనాలకు నంబర్‌ ప్లేట్‌ లేకుండా రోడ్లపై తిరుగుతున్నప్పుడు పట్టుబడితే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా వింతశబ్దాలతో తోటి వాహనదారులను భయపెట్టేలా సైలెన్సర్లను అమరుస్తున్న ఆకతాయిలు వెంటనే వాటిని తొలగించాలని లేకుంటే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవి, వెంకన్న, సాగర్,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.

రిపోర్టర్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం

Whats_app_banner