Wife Sets Husband On Fire : ఖమ్మంలో దారుణం, చెవిదిద్దులు కోసం భర్తకు నిప్పుపెట్టిన భార్య!
Wife Sets Husband On Fire : ఖమ్మంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. చెవిదిద్దులు కొనివ్వలేదని భర్తపై ఆయిల్ పోసి నిప్పుపెట్టింది భార్య. ఈ ఘటనలో భర్తకు తీవ్ర గాయాలయ్యాయి.
Wife Sets Husband On Fire : భర్త కోసం ప్రాణ త్యాగాలు చేసిన మగువలను చూశాం. యముడితో సైతం పోరాడి భర్త ప్రాణాలను కాపాడుకున్న ఉదంతాలను పురాణాల్లో విన్నాం. అయితే ఇది కలికాల మహత్యం కాబోలు! ఓ భార్య చెవి దిద్దులు కొనివ్వలేదన్న నెపంతో తన భర్త పైనే హత్యాయత్నానికి(Wife Sets Husband On Fire) పాల్పడింది. ఖమ్మం నగరంలో చోటు చేసుకున్న ఈ అమానవీయ ఘటన ఆలస్యంగా తెలుగులోకి వచ్చింది. మహబూబాబాద్ జిల్లాకు చెందిన సమీనాను ఖమ్మం(Khammam crime) నగరం నిజాంపేటకు చెందిన యాకూబ్ పాషా వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా కలిగారు. యాకుబ్ పాషా దినసరి కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని గడుపుతూ ఉండేవాడు. కాగా పాషా తల్లి విషయంలో సమీనా కొద్ది రోజులుగా గొడవ పడుతోంది. ఆమెను తమతో ఉంచుకోవడానికి వీలు లేదంటూ భర్తపై ఆంక్షలు విధించేది. దీంతో యాకుబ్ పాషా తల్లికి వేరొక చోట కాపురం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఆ తర్వాత చెవి దిద్దుల కోసం
ఒక వివాదం సమసి పోయిన తర్వాత సమీనా మరో వివాదాన్ని తెరపైకి తెచ్చింది. చెవి దిద్దులు(Ear Rings) కొనివ్వాలంటూ భర్తపై సమీనా కొద్ది రోజులుగా ఒత్తిడి తెస్తోంది. అయితే దిద్దుల కొనుగోలుకు కాస్త సమయం పడుతుందని పాషా సర్ది చెబుతూ వచ్చేవాడు. అయినా సరే సమీనా పట్టు వదలడం లేదు. దినసరి కూలీ కావడంతో భార్య కోరికను తీర్చలేని పరిస్థితిలో యాకుబ్ పాషా తరచూ ఏదో ఒక సమాధానం చెబుతూ వచ్చేవాడు. కాగా రెండు రోజుల కిందట పని ముగించుకుని ఇంటికి వచ్చిన యాకూబ్ పాషాపై మళ్లీ చెవిదిద్దుల కోసం భార్య యుద్ధం మొదలుపెట్టింది. ఈ క్రమంలో జరిగిన వివాదం చివరికి హత్యాయత్నానికి దారి తీసింది. ఆవేశానికి లోనైన సమీనా భర్త పై ఆయిల్ పోసి లైటర్ (Wife Sets Husband On Fire)తో నిప్పంటించింది. దీంతో కాలిపోతున్న యాకూబ్ పాషా బయటికి పరుగులు పెట్టి కేకలు వేశాడు. స్థానికులు అతని వద్దకు చేరుకొని మంటలార్పే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ 40 శాతం శరీర భాగాలు కాలిపోయాయి. తల్లి ఫిర్యాదు మేరకు సోమవారం ఖమ్మం నగర పోలీసులు పాషా భార్య సమీనాపై కేసు నమోదు చేశారు. కాగా 40 శాతం గాయాలతో యాకుబ్ పాషా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం
సంబంధిత కథనం