Corporator Husband: వీధి వ్యాపారులపై కార్పొరేటర్ భర్త వీరంగం..వ్యాపారిపై నడిరోడ్డుపై దాడి
Corporator Husband: విజయవాడలో రోడ్లపై పళ్లు అమ్ముకునే వ్యాపారులపై కార్పొరేటర్ భర్త దౌర్జన్యానికి దిగడం చర్చనీయాంశంగా మారింది. వీధి వ్యాపారాలకు మామూళ్ళు చెల్లించకపోవడంతో దాడి చేశారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
Corporator Husband: విజయవాడలో ఓ కార్పొరేటర్ భర్త నడిరోడ్డుపై రెచ్చిపోయారు. రోడ్డుపై స్వీట్ కార్న్ అమ్ముకుంటున్న వ్యాపారులపై దౌర్జన్యం చేసి దాడి చేయడం కలకలం రేపింది. నగరంలో ప్రధాన ఫ్రూట్ మార్కెట్ Fruit Market ఎదుట శనివారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎన్నికల తర్వాత తమ ప్రభుత్వమే వస్తుందని హెచ్చరిస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యూలేట్ అయ్యాయి.
విజయవాడ నగరంలోని కేదారేశ్వర పేట KedareswaraPet ప్రాంతం 34వ డివిజన్ పరిధిలోకి వస్తుంది. ఈ ప్రాంతంలో హోల్‌సేల్ Wholesale Fruitmarket ఫ్రూట్ మార్కెట్ కూడా ఉంది. విజయవాడతో పాటు పలు పట్టణాలు, జిల్లాలకు ఇక్కడ నుంచి సీజన్ల వారీగా పళ్ల వ్యాపారం జరుగుతోంది. స్థానిక వ్యాపారులపై అధికార పార్టీ కార్పొరేటర్, ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ IDC ఛైర్మన్ బండి పుణ్యశీల Bandi PunyaSeela భర్త రాజ్‌కుమార్ RajKumar పెత్తనం చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి.
స్థానిక వ్యాపారుల నుంచి బలవంతంగా మామూళ్ళు వసూలు చేసే క్రమంలో కొందరు వ్యాపారులు ఎదురు తిరిగారు. తాము కూడా వైసీపీకి YCPచెందిన వారిమేనని అడ్డు చెప్పడంతో ఆగ్రహించిన కార్పొరేటర్ భర్త వారిపై దాడి చేశాడు. ప్రతి నెల తమ నుంచి లక్షలాది రుపాయలు వసూలు చేస్తున్నారని, వ్యాపారాలు చేయనివ్వకుండా అడ్డుకుంటున్నారని వ్యాపారులు ఆరోపిస్తున్నారు.
హోల్ సేల్ వ్యాపారులు నెలనెల మామూళ్లు ఇవ్వకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పండ్ల లారీలు మార్కెట్లోకి రానివ్వకుండా గడ్డర్లను పాతించారని వ్యాపారులు ఆందోళనకు దిగడంతో కార్పొరేషన్ అధికారులు వెనక్కి తగ్గారని చెబుతున్నారు. ఎన్నికల సమయం కావడంతో డబ్బు వసూళ్ళ కోసం వేధింపులు శృతి మించినట్టు ఆరోపిస్తున్నారు.
కార్పొరేటర్ బండి పుణ్యశీల తన భర్తకు ఎమ్మెల్యే టిక్కెట్ కోసం చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. గుంటూరు జిల్లా రిజర్వుడు నియోజక వర్గాల్లో పోటీ చేసేందుకు అవకాశం ఇవ్వాలని కోరినా పార్టీ అంతర్గత సర్వేల్లో పనితీరు వెలుగు చూడటంతో పార్టీ పక్కన పెట్టినట్టు తెలుస్తోంది.
నగరంలో కార్పొరేటర్ల భర్తల అరాచకం...
విజయవాడ నగరంలో అధికార పార్టీ, ప్రతిపక్షం అనే తేడా లేకుండా చోటా నాయకుల బలవంతపు వసూళ్లు పెరిగిపోయాయి. రైతు బజార్లు, వీధి వ్యాపారాలు, తోపుడు బళ్ళపై వ్యాపారాలు చేసుకునే వారి నుంచి బలవంతపు వసూళ్లు యథేచ్ఛగా సాగుతున్నాయి. ఏ ప్రాంతంలో వ్యాపారాలు జరిగితే ఆ ప్రాంత నాయకులకు మామూళ్లు చెల్లించడం రివాజుగా మారింది. బలవంతంగా వసూళ్లతో రోజు వారీ సంపాదనపై ఆధారపడి వ్యాపారాలు చేసుకునే వారు విలవిలాడుతున్న కట్టడి చేసే చర్యలు మాత్రం కరువయ్యాయి.
ప్రైవేట్ సైన్యాలుగా ఉద్యోగులు...
నగరంలో సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఇళ్లు కట్టుకోవాలన్నా కార్పొరేటర్లకు కప్పం కట్టుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొందరు కార్పొరేషన్ Corporation Employees సిబ్బంది, టౌన్ ప్లానింగ్ ఉద్యోగులు, వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది సహకారంతో దళారులు ఎక్కడ ఇసుక కుప్ప కనిపిస్తే అక్కడ వాలిపోవడం.. స్థానిక నాయకులతో సెటిల్ చేసుకోవాలని సూచించడం పరిపాటైంది.
నగరమంతటా ఈ తరహా దందాలు యథేచ్ఛగా సాగుతున్నా అధికార యంత్రాంగం వాటికి అడ్డుకట్ట వేసే ప్రయత్నాలు మాత్రం చేయడం లేదు. అక్రమ నిర్మాణాలు, ప్లాన్లకు విరుద్ధంగా జరిగే నిర్మాణాలు కనిపిస్తే ఇలాంటి నేతలకు కాసులు కురిసినట్టే అవుతోంది.
అధికారంలో ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ఆతృతలో కార్పొరేటర్ల భర్తలు చేసే ఆగడాలకు నగరంలో అంతు లేకుండా పోతోంది. పేరుకు మహిళలు ప్రజా ప్రతినిధులుగా ఎన్నికైనా, వసూళ్ళ దందా మాత్రం భర్తల కనుసన్నల్లో సాగుతోంది. ఎన్నికల సమయం కావడంతో మరింత పేట్రెగిపోతున్నారు.
సంబంధిత కథనం