Khammam Loksabha Constituency : ఖరారు కాని ఎంపీ అభ్యర్థులు-ఖమ్మంలో రాజకీయ నిస్తేజం!
Khammam Loksabha Constituency : ఖమ్మం లోక్ సభ స్థానానికి బీఆర్ఎస్ మినహా బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులను ఫైనల్ చేయలేదు. ఈ స్థానానికి కాంగ్రెస్ లో అగ్రనేతల పోటీపడుతున్నారు. కానీ అభ్యర్థుల ఖరారు కాకపోవడంతో నేతలు, కార్యకర్తల్లో నైరస్యం కనిపిస్తుంది.

Khammam Loksabha Constituency : ఖమ్మం జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఉరకలేసిన ఉత్సాహం నీరుగారిపోయింది. పార్లమెంట్ ఎన్నికలు(Loksabha Elections) సమీపిస్తున్నాయన్న ఉత్సాహం కూడా లేకుండా పోయింది. రాజకీయ పార్టీల తీరుతో నేతలు, కార్యకర్తల్లో అంతులేని నైరాస్యం నెలకొంది. బీఆర్ఎస్ పార్టీ మినహా అధికార కాంగ్రెస్(Congress) తో పాటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సైతం అభ్యర్థులను ప్రకటించకపోవడంతో నేతల్లో నిరాశ, నిస్సృహలు అలముకున్నాయి. ఎన్నికల షెడ్యూల్(Election Schedule) ప్రకటించి కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఖమ్మం జిల్లాలో రాజకీయ పార్టీలు ఎన్నికల దిశగా కసరత్తు చేస్తున్నట్లు కనిపించడంలేదు. దీంతో అందరిలోనూ నైరాశ్యం అలుముకుంది.
నాడు సత్తా చాటిన శ్రేణుల్లో నేడు నిరుత్సాహం
అసెంబ్లీ ఎన్నికలు ముగిసి మూడు నెలలు దాటిపోయింది. ఆ ఎన్నికల్లో జిల్లాలో సత్తా చాటిన కాంగ్రెస్ శ్రేణులు పార్లమెంటు ఎన్నికల ముంగిట చతికలపడ్డాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పదికి 9 స్థానాలను గెలుచుకున్న కాంగ్రెస్ పార్టీలో(Congress) ఎంపీ ఎన్నికల ముంగిట ఆ కథనోత్సాహం కనిపించడం లేదు. దీనికి పార్లమెంటు స్థానంలో పోటీ చేసే అభ్యర్థులను ఖరారు చేయకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. అధికార కాంగ్రెస్ పార్టీలో విపరీతమైన పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. రాష్ట్ర కేబినెట్ లో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు ఉద్దండలు సైతం తమ కుటుంబ సభ్యులకు ఎంపీ టిక్కెట్ ఇప్పించుకునేందుకు సర్వశక్తులా పోరాడుతున్నారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Bhatti Vikramarka) తన సతీమణి నందినిని పోటీలో నిలపాలని తీవ్రంగా ప్రయత్నాలు సాగిస్తుండగా, రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్న పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సైతం తన సోదరుడు ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇప్పించుకునే ప్రయత్నంలో వెనకాడడం లేదు. అలాగే వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తనయుడు యుగంధర్ ను పోటీలో తెలపాలనే ఉత్సుకతతో ఉన్నారు. వీరితో పాటు రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు వి.హనుమంతరావు, కుసుమ కుమార్ సైతం ఖమ్మం ఎంపీ బరిలో నిలిచేందుకు పోటీ పడుతున్నారు. కేంద్ర మాజీ మంత్రి, ఖమ్మం మాజీ ఎంపీ రేణుక చౌదరికి రాజ్యసభ దక్కడంతో ఆమె పోటీ నుంచి తప్పుకున్నట్లయింది. మరో వంక ఖమ్మంలో ప్రముఖ వ్యాపారవేత్త వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ తనకు ఖమ్మం ఎంపీ స్థానం నుంచి పోటీ చేసే అవకాశం కల్పించాలని తోచిన మార్గాల్లో అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు.
ఎటూ తేల్చని అధిష్టానం
ఖమ్మం జిల్లాలో(Khammam) ఘన విజయం సాధించి రాష్ట్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రులు పోటీ పడుతుండడంతో అధిష్టానానికి ఈ వ్యవహారం తలనొప్పిగా మారింది. ఎవరికి వారు తీవ్రమైన ప్రయత్నాలు చేస్తూనే అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటామని ప్రకటనలు చేయడం విస్మయం కలిగిస్తోంది. ఇలాంటి పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర కాంగ్రెస్ పెద్దలు దిల్లీలో కసరత్తు మొదలుపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి సైతం దిల్లీ వెళ్లి అక్కడి పెద్దలతో సంప్రదింపులు జరుపుతూ టికెట్ల కేటాయింపుపై స్పష్టత కోసం ప్రయత్నిస్తున్నారు. తొలి దశలో ప్రకటించిన స్థానాల్లో ఖమ్మానికి ఎవరిని అభ్యర్థిగా దింపుతారనే అంశంపై స్పష్టత రాలేదు. మరో విడతగా అధిష్టానం ప్రకటించనున్న జాబితాలోనూ ఈ స్థానం అభ్యర్థి పేరు ఖరారు అవుతుందన్న గ్యారెంటీ లేకుండా పోయింది. దీంతో కాంగ్రెస్ శ్రేణుల్లో వల్లమాలిన నైరాస్యం అలుముకుంది.
బీజేపీలోనూ తీవ్రమవుతున్న పోటీ
ఖమ్మం జిల్లాలో కనీస ఉనికి కూడా లేని బీజేపీలో(BJP) సైతం ఖమ్మం ఎంపీ టికెట్ పై పోటా పోటీ ప్రయత్నాలు సాగుతున్నాయి. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కొత్తగూడెం స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన జలగం వెంకట్రావు ఖమ్మం ఎంపీ టికెట్ ఆశించే బీజేపీ తీర్థం పుచ్చుకుంటారన్న ప్రచారం జరుగుతోంది. ఈయనకు పార్టీలోని సీనియర్ నాయకుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి వెన్నుదన్నుగా నిలుస్తున్నారని చర్చ సాగుతోంది. అలాగే ఖమ్మం బీజేపీ టికెట్ కోసం సుమారు పది మంది ఆశావహులు రేసులో ఉండటం గమనార్హం. అయితే మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు పార్టీలో చేరాక దాదాపు అందరూ ఆశలు వదిలేసుకున్నారు.
తీరా హైకమాండ్ ఆయన పేరును ప్రకటించకపోవడంతో ఆశావహులంతా మళ్లీ ప్రయత్నాలు మొదలుపెట్టారు. హైదరాబాద్ కేంద్రంగా కులాల వారీగా తమ గాడ్ ఫాదర్లను ప్రసన్నం చేసుకోవడం, ఆయా నాయకులు కూడా హామీ ఇస్తుండడం ఆసక్తి రేపుతోంది. ఖమ్మం టికెట్ ఆశిస్తున్న వారిలో ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రంగా కిరణ్, ఖమ్మం నగరానికి చెందిన డాక్టర్ గోంగూర వెంకటేశ్వర్లు, వెలమ సామాజికవర్గానికి చెందిన తాండ్ర వినోద్ రావుకు, బీజేపీ సీనియర్ నేత, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఈవీ రమేశ్ ఉన్నారు. అసలే పెద్దగా ప్రాబల్యం లేని బీజీపీలో కూడా టిక్కెట్ పోరు సాగుతుండటంతో అభ్యర్థిత్వంపై సందిగ్ధత నెలకొంది. ఎటూ తేల్చని ఈ వ్యవహారంతో జిల్లాలో రాజకీయ నైరాశ్యం అలుముకుంది. కాగా బీఆర్ఎస్ మాత్రం సిట్టింగ్ ఎంపీ నామ నాగేశ్వరరావునే బరిలో దించుతున్నట్లు ఇప్పటికే ప్రకటించడం గమనార్హం.
రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.