తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Khammam Jalagam: ఖమ్మంలో జలగంకు కలిసి రాని కాలం… బీజేపీ ఎంపీ టిక్కెట్‌ కూడా దక్కని వైనం…

Khammam Jalagam: ఖమ్మంలో జలగంకు కలిసి రాని కాలం… బీజేపీ ఎంపీ టిక్కెట్‌ కూడా దక్కని వైనం…

HT Telugu Desk HT Telugu

25 March 2024, 11:36 IST

google News
    • Khammam Jalagam: మాజీ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు తనయుడు, కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావుకు రాజకీయంగా గడ్డు కాలం నడుస్తోంది. ఖమ్మం ఎంపీ టిక్కెట్ పై ఆశ పడినా ఫలితం దక్కలేదు. 
జలగం వెంకట్రావుకే తప్పని నిరాశ
జలగం వెంకట్రావుకే తప్పని నిరాశ

జలగం వెంకట్రావుకే తప్పని నిరాశ

Khammam Jalagam: బీజేపీలో నాయకత్వ శూన్యతను అందిపుచ్చుకోవాలని భావించిన జలగం వెంకట్రావుకు Jalagam Venkatrao చివరికి మొండి చెయ్యే ఎదురైంది. ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఆశించి బీజేపీలో చేరిన ఆయనకు భంగపాటు తప్పలేదు.

మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కొత్తగూడెం టిక్కెట్ కోరిన జలగంకు టిక్కెట్ దక్కకపోవడంతో ఆ ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. BRS బీఆర్ఎస్ ను వీడుతున్నట్లు ప్రకటించకుండానే ఆయన ఎన్నికల బరిలో దిగారు.

ఆ ఎన్నికల్లో ఓటమి తర్వాత జలగం తన రాజకీయ భవిష్యత్ కోసం వేట ప్రారంభించారు. ఈ క్రమంలో ఆయనకు బీజేపీ BJP పార్టీ కనిపించింది. ఆ పార్టీలో నాయకత్వ శూన్యతను గమనించిన ఆయన పార్లమెంటు ఎన్నికల వేళ బీజేపీలో చేరడమే సరైన నిర్ణయమని భావించారు.

ఆయన పార్టీలో చేరుతున్న సమయంలో ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఇచ్చే హామీతోనే పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగింది. జిల్లాకు చెందిన సీనియర్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి Ponguleti సమక్షంలో బీజేపీ తీర్ధం పుచ్చుకున్న ఆయన తెలంగాణ సమగ్రాభివృద్ధి కోసమే తాను బీజేపీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

అయితే ఉమ్మడి ఖమ్మం Khammam జిల్లాలో ఖమ్మం ఎంపీ టిక్కెట్ ఆశించే వారి సంఖ్య పదికి చేరువైనా పార్టీలో జలగం చేరికతో ఎంపీ టిక్కెట్టుపై ఒకదశలో అందరూ ఆశలు వదులుకున్నారు. అయితే అనూహ్య రీతిలో ఆయన పేరు పక్కకు పోయి అసలు ఊసులోనే లేని కొత్త పేరు తెరపైకి రావడం రాజకీయ వర్గాలను ఆశ్చర్యానికి గురి చేసింది.

అనూహ్యంగా తాండ్ర పేరు..

ఖమ్మం జిల్లాకు చెందిన తాండ్ర వినోద్ రావును బీజేపీ అధిష్టానం ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక చేయడం అనూహ్య పరిణామమే. ఈ మేరకు అధినాయకత్వం ఆదివారం అధికారికంగా ప్రకటించింది. వినోదరావు ప్రజాసేవకు, ఆధ్యాత్మికత, ధార్మిక కార్యక్రమాలకు అంకితమైన కుటుంబం నుంచి వచ్చారు.

రాముడి సేవకు, హిందూ ధర్మ పరిరక్షణకు కట్టుబడిన వంశం వారిది. వీరి స్వగ్రామం జిల్లాలోని ముల్కలపల్లి మండలం తిమ్మంపేట గ్రామం. 1930లో వినోదరావు తాత సుదర్శన్ రావు భద్రాచలం రాములవారి ఆలయానికి ట్రస్టీగా ఉండేవారు.

ఆ హోదాలో ముత్యాల తలంబ్రాలు సమర్పించే వారు. వినోదరావు తండ్రి కృష్ణారావు వకీల్ గా పాల్వంచ ప్రాంతంలోనే కాకుండా జిల్లాలోనే మంచి పేరు పొందారు. వీరి పెదనాన్న టీవీ నరసింహారావు జడ్జిగా పని చేశారు.

వినోద్ రావు ఇంటర్ వరకు పాల్వంచలో చదువుకున్నారు. డబుల్ పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేశారు. అమెరికాలో మంచి ఉద్యోగంతో స్థిరపడటానికి మంచి అవకాశం ఉన్నా మాతృ భూమి మీద ప్రేమతో, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పంతో తిరిగి వచ్చారు.

వినోదరావు గత దశాబ్దానికి పైగా సోషల్ వర్కర్ గా పలు స్వచ్చంద సంస్థలలో ఉన్నత బాధ్యతలు సమర్ధవంతంగా నిర్వహించి పేదలకు సేవ చేశారు. ఆయన రియల్ ఎస్టేట్ రంగంలో ఉంటూనే 2015 నుంచి 2021 వరకు ఏకలవ్య ఫౌండేషన్ తర్వాత విద్య, ఆరోగ్యం, ఉపాధి, వ్యవసాయం లాంటి రంగాల్లో సేవలందించారు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక గ్రామాల్లో వారి నాయకత్వంలోని ఫౌండేషన్ అద్భుతమైన సేవ చేసింది. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో గిరిజనుల అభ్యున్నతి కోసం చేసిన కృషి పలువురి మన్ననలు అందుకుంది.

ప్రత్యేక విద్య కార్యక్రమం ద్వారా రెండు రాష్ట్రాల్లో 24 జిల్లాల్లో బడుగు, బలహీన, నిరుపేద కుటుంబాలకు సేవ చేస్తున్నారు. డాక్టర్ రామానాయుడు ఏకలవ్య ఫౌండేషన్ కృషి విజ్ఞాన కేంద్రం చైర్మన్ గా 2017 నుంచి జనవరి 2024 వరకు ఆయన అందించిన అద్భుత సేవలు ప్రశంసలు అందుకున్నాయి.వినోద్ రావు ఎంపిక విషయంలో బీజేపీ అధిష్టానం ఆచితూచి వ్యవహరించినట్లు స్పష్టమవుతోంది.

(రిపోర్టింగ్ - కాపర్తి నరేంద్ర, ఖమ్మం.)

తదుపరి వ్యాసం