Revanth Reddy : గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నాం.. అందుకే ఫినిష్ చేయాలని చూస్తున్నారు : రేవంత్ రెడ్డి
25 October 2024, 15:20 IST
- Revanth Reddy : హైదరాబాద్‌లో ఏబీపీ సదరన్ రైజింగ్ సమ్మిట్‌ను రేవంత్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో దక్షిణాది రాష్ట్రాల పాత్రను వివరించారు. కాంగ్రెస్ హయాంలో దక్షిణాదితో పాటు ఉత్తరాదికి మేలు జరిగింది.. ఎన్డీయేలో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
రేవంత్ రెడ్డి
కాంగ్రెస్ హయాంలో దేశాభివృద్ధి కోసం భాక్రానంగల్ నుంచి నాగార్జున సాగర్ వరకు ఎన్నో ప్రాజెక్టులు కట్టారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివరించారు. కొత్త యూనివర్సిటీలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. కానీ.. ఇప్పుడు వివక్షతో పరిపాలన చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
'ఇందిరా గాంధీ హయాంలో గరీబీ హఠావోతో ఎన్నో మార్పులు చేశారు. ప్రతి ఒక్కరికీ ఆహారం అందాలని చర్యలు చేపట్టారు. రాజీవ్ గాంధీ హయాంలో ఓటింగ్ వయసును 21 నుంచి 18 ఏళ్లకు మార్చారు. కంప్యూటర్లతో ఐటీ విప్లవం తీసుకొచ్చారు. టెలికాం రంగంలో మార్పులు తీసుకువచ్చారు. మహాత్మగాంధీ ఆలోచనల ప్రకారం స్థానిక సంస్థల్లో అధికారాలను కల్పించిన ఘనత కాంగ్రెస్ పార్టీదే' అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.
'పీవీ నరసిహారావు దక్షిణాది నుంచి ప్రధానిగా సేవలు అందించిన గొప్పవ్యక్తి. లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్‌తో కష్టాల్లో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించారు. నెహ్రూ నుంచి ఇందిరాగాంధీ వరకు కాంగ్రెస్ నేతలందరూ ప్రజలందరి మౌలిక అవసరాలు తీర్చాలని ప్రయత్నం చేశారు. తరువాత 30 ఏళ్లు టెక్నాలజీ, టెలికాం ఇతర రంగాల్లో కాంగ్రెస్, యూపీఏ సేవలు అందించింది. కాంగ్రెస్, యూపీఏ హయాంలో ఎన్నో విప్లమాత్మక మార్పులు వచ్చాయి' అని సీఎం వివరించారు.
'మూడోసారి ప్రధాని అయిన నరేంద్రమోదీ ఈ దేశ ప్రజల కోసం ఏ రెవల్యూషన్ తీసుకువచ్చారు? మోదీ హయాంలో దేశానికి ఏం సేవలు చేశారు? ఎవరికి ప్రయోజనం చేకూర్చారో చెప్పండి. పార్టీలను, ప్రభుత్వాలను విడగొట్టారు. ప్రభుత్వాలు ఏర్పాటు చేసేందుకు పనిచేశారు. ప్రజలకు మాత్రం ప్రధాని మోదీ పార్టీ ఏం చేయలేదు. పార్టీలను చీల్చడం, భావోద్వేగాలతో రాజకీయాలు చేయడం తప్ప మీరు చేసిందేంటీ? ఈ దేశంలో ఉత్తర, దక్షిణ భారతదేశం అనే విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారు' అని రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
'దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తోంది. సౌత్ స్టేట్స్‌కు ప్రధాని అందించిన సహకారం తక్కువ. నిధులు ఇవ్వకపోయినా.. ఇక్కడి ఓట్లు కావాలని ఎలా అడుగుతారు. నార్త్ స్టేట్స్‌తో పోలిస్తే.. సౌత్ స్టేట్స్ ఎక్కువ పన్నులు చెల్లిస్తున్నా.. వాటిలో తిరిగి పొందేది చాలా తక్కువ. కేంద్రానికి మేం ఒక్క రూపాయి పంపిస్తే.. కేవలం రూ.40 పైసలు తిరిగి వస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను దక్షిణాది రాష్ట్రాలు ఆహ్వానిస్తున్నా.. నిధుల విషయంలో వివక్ష జరుగుతూనే ఉంది' అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.
'అంతర్జాతీయ స్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూ ఘాట్‌ను అభివృద్ధి చేస్తాం. ప్రపంచమంతా హైదరాబాద్ వైపు చూసేలా అభివృద్ధి చేయబోతున్నాం. ఈసా, మూసా నదులు కలిసే చోట బాపూ ఘాట్ ఉంది. గుజరాత్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహంలా.. బాపూ ఘాట్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం. మూసీ పునరుజ్జీవాన్ని, బాపూ ఘాట్ అభివృద్ధిని బీజేపీ వ్యతిరేకిస్తోంది' అని రేవంత్ ఆరోపించారు.
'గాంధీ వారసులుగా మేం బాపూ ఘాట్‌ను అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసి తీరుతాం. దీన్ని బీఆర్ఎస్, బీజేపీ ఎందుకు అడ్డుకోవాలని చూస్తున్నాయి? మీరు గుజరాత్‌లో సబర్మతి రివర్ ఫ్రంట్ నిర్మించుకోవచ్చు.. కానీ మేము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారెందుకు.? ఎందుకంటే మేము గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నామని.. అందువల్లే తెలంగాణను, హైదరాబాద్‌ను ఫినిష్ చేయాలని.. బీజేపీ నేతలు మా ప్రభుత్వ నిర్ణయాన్ని అడ్డుకుంటున్నారు' అని రేవంత్ రెడ్డి ఆరోపించారు.
'పదేళ్లు ప్రభుత్వాన్ని నడిపించిన గత కేసీఆర్ పది సార్లు కూడా సెక్రటేరియట్‌కు రాలేదు. ప్రతిపక్ష హోదా ఇస్తే పది నిమిషాలు అసెంబ్లీలో కూర్చుని వెళ్లిపోయారు. కేసీఆర్‌కు ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఎందుకు బయటకు రావడం లేదు. కేసీఆర్ ఆయనే ఫ్రీడం ఫైటర్ అని చెప్పుకుంటాడు. నాకేమీ అభ్యంతరం లేదు. గత పది నెలల్లో ఒక్కసారి కూడా అసెంబ్లీకి రాలేదు. తానో జమిందార్, ప్రజలందరూ గులాంలని కేసీఆర్ అనుకుంటాడు. అందుకే బయటరు రావడం లేదు' అని రేవంత్ రెడ్డి విమర్శలు గుప్పించారు.