Bengaluru Opposition Meet: బెంగళూరు విపక్ష భేటీకి 26 పార్టీల హాజరు; భేటీలో యూపీఏకు కొత్త పేరుపై నిర్ణయం-from 24 in patna to 26 parties in bengaluru meet pm modi baffled congress ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Bengaluru Opposition Meet: బెంగళూరు విపక్ష భేటీకి 26 పార్టీల హాజరు; భేటీలో యూపీఏకు కొత్త పేరుపై నిర్ణయం

Bengaluru Opposition Meet: బెంగళూరు విపక్ష భేటీకి 26 పార్టీల హాజరు; భేటీలో యూపీఏకు కొత్త పేరుపై నిర్ణయం

HT Telugu Desk HT Telugu
Jul 17, 2023 06:10 PM IST

Bengaluru Opposition Meet: రానున్న లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించడం కోసం ఒక్కటవుతున్న విపక్ష పార్టీలు.. సోమవారం, మంగళవారం బెంగళూరులో సమావేశమవుతున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 26 పార్టీలు ఈ సమావేశానికి హాజరువుతున్నాయి.

విపక్ష పార్టీల సమావేశం సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన పోస్టర్
విపక్ష పార్టీల సమావేశం సందర్భంగా బెంగళూరులో ఏర్పాటు చేసిన పోస్టర్ (PTI)

విపక్ష పార్టీల రెండు రోజుల సమావేశానికి దేశవ్యాప్తంగా ఉన్న మొత్తం 26 పార్టీలు హాజరువుతున్నాయి. విపక్ష పార్టీల కూటమి తొలి సమావేశం (Opposition Meet) జూన్ 23వ తేదీన బిహార్ సీఎం నితీశ్ కుమార్ ఆధ్వర్యంలో పట్నాలో జరిగింది. ఇది రెండో భేటీ. తొలి సమావేశానికి మొత్తం 24 పార్టీలు హాజరయ్యాయి.

Bengaluru Opposition Meet: బీజేపీ ఓటమే లక్ష్యం

2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని, ఆ పార్టీ సారధ్యంలోని ఎన్డీయేను ఓడించడమమే లక్ష్యంగా కాంగ్రెస్ నాయకత్వంలో ఈ విపక్ష కూటమి ఏర్పడింది. ఆ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా కనీసం 450 సీట్లలో బీజేపీ అభ్యర్థికి ప్రధాన పోటీదారుగా విపక్ష కూటమి అభ్యర్థి మాత్రమే ఉండేలా చూడాలని ఆ కూటమి భావిస్తోంది. బెంగళూరులో జులై 17, జులై 18 తేదీల్లో జరుగుతున్న విపక్ష కూటమి సమావేశానికి కొన్ని ప్రధాన పార్టీల నాయకులు హాజరు కావడం లేదన్న మీడియా వార్తలను కాంగ్రెస్ నాయకుడు జై రాం రమేశ్ ఖండించారు. సోమవారం జరిగేది కీలక సమావేశం కాదని, ఆ రోజు కర్నాటక సీఎం సిద్ధ రామయ్య విపక్ష నేతలను డిన్నర్ ఏర్పాటు చేశారని జైరాం రమేశ్ వెల్లడించారు. మంగళవారం మాత్రమే విపక్ష కూటమి నేతల ప్రధానమైన భేటీ ఉంటుందని, ఆ సమావేశానికి అందరూ హాజరవుతారని వివరించారు.

26 పార్టీలు..

జూన్ 23న జరిగిన విపక్ష పార్టీల మొదటి సమావేశం విజయవంతమైందని, ఆ సమావేశానికి కొనసాగింపుగానే బెంగళూరులో ఈ సమావేశం నిర్వహిస్తున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ తెలిపారు. పట్నా సమావేశానికి 24 విపక్ష పార్టీలు హాజరు కాగా, ఈ సమావేశానికి 26 పార్టీలు హాజరు అవుతున్నాయని కేసీ వేణుగోపాల్ వివరించారు. ఈ సమావేశం మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుందన్నారు.

బీజేపీకి ఇప్పుడు ఎన్డీఏ గుర్తొచ్చింది..

పట్నాలో విపక్ష పార్టీల సమావేశం విజయవంతం కావడంతో బీజేపీలో భయం ప్రారంభమైందని జై రామ్ రమేశ్ వ్యాఖ్యానించారు. అందుకే ఇప్పుడు అకస్మాత్తుగా ఎన్డీయే గుర్తుకువచ్చి, ఎన్డీయే భాగస్వామ్య పక్షాల భేటీ నిర్వహిస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. పట్నా విపక్ష భేటీ కారణంగానే ఇప్పుడు మళ్లీ ఎన్డీయే ను తెర పైకి తెచ్చిందని బీజేపీని ఎద్దేవా చేశారు. మంగళవారం ఢిల్లీల ఎన్డీయే పక్షాల సమావేశం కూడా జరుగుతోంది.

యూపీఏకు కొత్త పేరు?..

బెంగళూరులో మంగళవారం జరిగే విపక్ష పార్టీల సమావేశంలో కూటమికి కొత్త పేరును ప్రకటించే అవకాశముందని కాంగ్రెస్ నేత కేసీ వేణు గోపాల్ సంకేతాలిచ్చారు. కాంగ్రెస్ నాయకత్వంలో గతంలో ఏర్పడిన యూపీఏ పేరును మార్చి, కొత్త పేరును ప్రకటించే అవకాశంపై నేరుగా స్పందించకుండా.. మంగళవారం భేటీలో అన్ని అంశాలను చర్చిస్తామని, ఆ అంశాలేమిటో ఇప్పుడే చెప్పలేనని వ్యాఖ్యానించారు. ఈ భేటీలో కొన్ని ప్రధాన నిర్ణయాలుంటాయన్నారు. బెంగళూరులో జరుగుతున్న ఈ విపక్ష పార్టీల సమావేశం నిర్వహణ బాధ్యతలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డీకే శివకుమార్ తీసుకున్నారు.

IPL_Entry_Point