Opposition meet: బీజేపీ పై కలిసే పోరాడుతామంటున్న విపక్షం; వచ్చే నెల షిమ్లాలో మరో భేటీ
దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక విపక్ష పార్టీల సమావేశం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసే పోరాడుతామని ఆ విపక్ష పార్టీలు ప్రకటించాయి.
దేశవ్యాప్తంగా ఉన్న బీజేపీ వ్యతిరేక విపక్ష (Opposition) పార్టీల సమావేశం శుక్రవారం విజయవంతంగా ముగిసింది. 2024 లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి వ్యతిరేకంగా కలిసే పోరాడుతామని ఆ విపక్ష పార్టీలు ప్రకటించాయి. త్వరలో ఒక ఉమ్మడి ఎజెండాను రూపొందిస్తామని తెలిపాయి.
జులైలో షిమ్లాలో మరో సమావేశం
విపక్షాల ఐక్యతపై మరింత స్పష్టత కోసం వచ్చే నెల హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో మరో సారి సమావేశం కావాలని విపక్ష నేతలు నిర్ణయించారు. ‘మేం ఐక్యంగా ఉన్నాం. బీజేపీపై ఉమ్మడిగా పోరాడుతాం. ఇక్కడి నుంచే చరిత్ర ప్రారంభమవుతుంది. కేంద్రంలోని ఫాసిస్ట్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మా పోరాటం ఉంటుంది’’ అని తృణమూల్ కాంగ్రెస్ చీఫ్, వెస్ట్ బెంగాల్ సీఎం మమత బెనర్జీ స్పష్టం చేశారు. 2024 లోక్ సభ ఎన్నికలలో కలిసి పోరాడాలని ఈ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించామని బిహార్ సీఎం, జేడీయూ నేత నితీశ్ కుమార్ తెలిపారు.
ఆప్, కాంగ్రెస్ విబేధాలు
ఢిల్లీ ప్రభుత్వ అధికారాలకు వ్యతిరేకంగా అక్రమంగా తీసుకువచ్చిన ఆర్డినెన్స్ ను వ్యతిరేకించాలన్న ఆప్ డిమాండ్ ను కాంగ్రెస్ పట్టించుకోకపోవడం విపక్షాల ఐక్యతపై అనుమానాలు రేకెత్తించేలా ఉంది. కాంగ్రెస్ ఒక టీమ్ ప్లేయర్ గా ప్రవర్తించడం లేదని, ఆ ఆర్డినెన్స్ ను వ్యతిరేకించే విషయంలో కాంగ్రెస్ ఊగిసలాట సరికాదని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. ఇదే ధోరణి కొనసాగితే ఈ విపక్ష కూటమిలో కొనసాగడం కష్టమవుతుందని వ్యాఖ్యానించింది. వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఈ ఆర్డినెన్స్ ను రాజ్యసభలో కాంగ్రెస్ కు చెందిన 31 మంది ఎంపీలు వ్యతిరేకించి తీరాలని ఆప్ పట్టుబడ్తోంది. అలా అయితేనే, భవిష్యత్తులో జరిగే విపక్ష సమావేశాల్లో పాల్గొంటామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో.. భవిష్యత్తులో విపక్ష పార్టీలతో పట్టువిడుపులతో వ్యవహరిస్తామని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించడం ప్రాధాన్యతను సంతరించుకుంది.