Opposition meet: బీజేపీని ఓడించే ఉమ్మడి లక్ష్యంతో విపక్షాల కీలక భేటీ; ఎవరు హజరయ్యారు? ఎవరు గైర్హాజరయ్యారు?
Opposition meet: 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీని ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యాయి.
Opposition meet: 2024 లోక్ సభ ఎన్నికలలో బీజేపీని ఓడించాలనే ఉమ్మడి లక్ష్యంతో దేశవ్యాప్తంగా ఉన్న ప్రధాన ప్రతిపక్షాలు శుక్రవారం ప్రత్యేకంగా సమావేశమయ్యాయి. బీజేపీని ఎదుర్కొనేందుకు వ్యూహాన్ని సిద్ధం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.
నితీశ్ కుమార్ నేతృత్వంలో..
బిహార్ ముఖ్యమంత్రి, జేడీయూ నేత నితీశ్ కుమార్ శుక్రవారం పట్నాలో ఈ విపక్షాల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి కాంగ్రెస్ తరఫున పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే, సీనియర్ నేత రాహుల్ గాంధీ, ఆర్జేడీ తరఫున లాలు ప్రసాద్ యాదవ్, బిహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్, పశ్చిమబెంగాల్ సీఎం, తృణమూల్ కాంగ్రెస్ చీఫ్ మమత బెనర్జీ, తమిళనాడు సీఎం, డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్.. తదితరులు హాజరయ్యారు. పట్నాలో జరుగుతున్న ఈ సమావేశానికి 15 విపక్ష పార్టీలకు చెందిన సుమారు 30 మంది నాయకులు హాజరయ్యారు.
తొలి అడుగు
కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అధికారంలో ఉన్న బీజేపీని రానున్న లోక్ సభ ఎన్నికల్లో ఉమ్మడి ఎదుర్కొనే దిశగా వేసిన తొలి అడుగుగా ఈ సమావేశాన్ని భావించవచ్చు. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఐక్యంగా ఎదుర్కోవడానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేసుకోవడం కోసం మొదటి సారి ప్రధాన విపక్ష పార్టీలన్నీ సమావేశమయ్యాయి. అయితే ప్రస్తుతానికి సీట్ షేరింగ్ విషయం కానీ, ఈ విపక్ష కూటమికి ఎవరు నాయకత్వం వహిస్తారన్న విషయం కానీ చర్చించకూడదని నిర్ణయించినట్లు సమాచారం.
ఎవరెవరు హాజరయ్యారు?
ఈ సమావేశానికి నితీశ్ కుమార్ (జేడీయూ), రాహుల్ గాంధీ (కాంగ్రెస్), మల్లిఖార్జున్ ఖర్గే (కాంగ్రెస్), మమత బెనర్జీ (టీఎంసీ), ఎంకే స్టాలిన్ (డీఎంకే), హేమంత్ సొరెన్ (జేఎంఎం), అరవింద్ కేజ్రీవాల్ (ఆప్), భగవంత్ మన్ (ఆప్), అఖిలేశ్ యాదవ్ (ఎస్పీ), ఉద్ధవ్ ఠాక్రే (శివసేన ఉద్ధవ్ వర్గం), శరద్ పవార్ (ఎన్సీపీ), సీతారాం యేచూరి (సీపీఎం), మెహబూబా ముఫ్తీ (పీడీపీ) లతో పాటు ఎన్సీ, ఇతర వామపక్షాల నేతలు కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యాన్ని కాపాడే లక్ష్యంతో సమావేశమవుతున్నామని ఖర్గే ట్వీట్ చేశారు.
ఎవరు హాజరు కాలేదు?
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్ర శేఖర రావు (బీఆర్ ఎస్), ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి (వైఎస్సార్సీపీ), ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ (బీజేడీ), జయంత్ చౌధరి (ఆర్ఎల్డీ) తదితరులు ఈ సమావేశానికి హాజరు కాలేదు. మరోవైపు, బీఎస్పీ నాయకురాలు మాయావతిని ఈ భేటీకి ఆహ్వానించలేదు.