Karimnagar Gang War : కరీంనగర్ గ్యాంగ్ వార్ లో కొత్తకోణం, జైలులో ఉంటూ బయట బెదిరింపులు
08 June 2024, 20:11 IST
- Karimnagar Gang War : కరీంనగర్ జిల్లా పచ్చునూరు గ్యాంగ్ వార్ హత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఈ కేసులో అరెస్టైన రమేష్ పోలీసుల అండదండలు, స్థానిక పరిచయాలతో ఇష్టరీతిన వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. రమేష్ ప్రస్తుతం జైలులో ఉన్నా.. తనకు వ్యతిరేకంగా ఉన్న వారిని బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది.
కరీంనగర్ గ్యాంగ్ వార్ లో కొత్తకోణం, జైలులో ఉంటూ బయట బెదిరింపులు
Karimnagar Gang War : కరీంనగర్ జిల్లా పచ్చునూర్ లో గ్యాంగ్ వార్ హత్య కేసులో కొత్తకోణం వెలుగు చూసింది. ఇంటి స్థలం వివాదం విషయంలో పెద్దమనుషులుగా వెళ్లిన రౌడీషీటర్ లు గోపు ప్రశాంత్ రెడ్డి, నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ మధ్య వ్యక్తిగత కక్షలు పెరిగి ప్రశాంత్ హత్యకు దారి తీసింది. ఇంటి స్థలం విషయంలో నెలకొన్న వివాదం పరిష్కరించేందుకు జానీ భాయ్ ని వెంకటేష్ కు పరిచయం ఎవరు చేశారన్నదే హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ మీడియా సంస్థలో కెమెరా మెన్ గా పనిచేస్తున్న వెంకటేష్ కు, నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ ను ల్యాండ్ డీలింగ్ విషయంలో పరిచయం చేయడం వల్లే కక్షలు పెరిగి హత్యకు దారి తీసిందని స్థానికులు భావిస్తున్నారు. రౌడీ షీటర్ గా ఉన్న నన్నేవేని రమేష్ అలియాస్ జానీ భాయ్ కి హైదరాబాద్ లో ఉన్న వెంకటేష్ కు మధ్య రాయబారం నడిపి ఇద్దరు మిలాఖత్ అయ్యేలా వ్యవహరించిన తరువాతే ఈ తతంగం అంతా జరిగినట్టుగా ప్రచారం జరుగుతోంది. ఏ1 నిందితుడు రమేష్ అలియాస్ జానీభాయ్, వెంకటేష్ ఇద్దరు ఒకే గ్రామానికి చెందిన వారే అయినప్పటికీ మొదట్లో అంతగా పరిచయం లేదని, ఈ భూమి విషయంలో వీరిద్దరిని పరిచయం చేడయం వల్లే జానీ జోక్యం చేసుకున్నట్టుగా తెలుస్తోంది.
పలువురి అండదండలతో రెచ్చిపోయిన జానీ?
నీటిలో ఉండే అక్టోపస్ ఎక్కడికైనా వెల్లగలుగుతుంది అన్నట్టుగానే ఉంది నిందితుని తీరు. వివిధ రకాల ప్రొఫెషనల్స్ తో సాన్నిహిత్యం పెంచుకున్న జానీ భాయ్ ఏం చేసినా చెల్లుతుందన్న ధీమాతోనే హత్య చేసి ఉంటాడన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వివిధ రంగాల్లో ఉన్న వారితో టచ్ లో ఉంటూ హత్యకు స్కెచ్ వేసిన రమేష్ కు ఆయా రంగాల్లో ఉన్న పరిచయాలను గమనించిన మిగతా గ్యాంగ్ సభ్యులు హత్య చేసేందుకు తమవంతు సహకారం అందించి ఉంటారన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. జానీ భాయ్ కి కొందరు పోలీస్ అధికారులతో దోస్తాన్ ఉన్నట్లు తెలుస్తోంది. పెద్దల అండదండలతోనే రమేష్ అలియాస్ జానీ రెచ్చిపోయినట్లు ప్రచారం జరుగుతోంది.
జానీ జైలులో ఉన్నా తప్పని బెదిరింపులు
హత్య కేసులో 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇప్పటికే ప్రధాన నిందితుడు రమేష్ తో పాటు 11 మందిని అరెస్టు చేసి జైలుకు పంపారు. రమేష్ భార్యతో పాటు మరొకరు పరారీ ఉన్నారు. జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్నప్పటికీ రమేష్ కు వ్యతిరేకంగా ఉన్న వారికి హెచ్చరికలు వెళ్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒకప్పుడు అతనితో స్నేహంగా ఉన్న వారు వివిధ వర్గాల వారిని బెదిరిస్తూ బయటకు రాగానే నిన్ను మళ్లీ వేసేస్తాడని చెప్తున్నట్టుగా తెలుస్తోంది. జానీ భాయ్ వచ్చిన తరువాత నీ అంతు చూస్తాడని... కొంతమంది జర్నలిస్టులకు కూడా వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి తయారైందంటే జానీ భాయ్ కి ఏ స్థాయి నెట్ వర్క్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పచ్చునూరు గ్రామానికి చెందిన కొందరిలో ఇదే రకమైన భయాన్ని జొప్పించినట్టుగా ప్రచారం జరుగుతోంది. వాహనాంతో యాక్సిడెంట్ చేసి చంపేస్తాడంటూ ఒకరిద్దరు వ్యాఖ్యానించారంటే రమేష్ అనుచరుల ధైర్యం ఏంటో అర్థం చేసుకోవచ్చు.
HT తెలుగు ఉమ్మడి కరీంనగర్ జిల్లా కరస్పాండెంట్ కె.వి.రెడ్డి