Karimnagar Gang war: కరీంనగర్ గ్యాంగ్‌వార్ మర్డర్ కేసులో 9మంది నిందితుల అరెస్ట్, పరారీలో మరో నలుగురు
Karimnagar Gang war: కరీంనగర్‌లో సంచలనం సృష్టించిన గ్యాంగ్ వార్ వ్యవహారంలో నిందితుల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో 13మందిపై పోలీసులు కేసు నమెదు చేయగా 9మందిని అరెస్ట్ చేశారు.
Karimnagar Gang war: కరీంనగర్ జిల్లాలో గ్యాంగ్ వార్ హత్య కేసును పోలీసులు చేధించారు. మొత్తం 13 మందిపై కేసు నమోదు చేసిన పోలీసులు 9 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో నలుగురు పరారీలో ఉన్నట్లు ప్రకటించారు. హత్యకు ఉపయోగించిన స్విఫ్ట్ కారుతో పాటు, ఒక బ్లాక్ కలర్ మాడిఫైడ్ జీప్ , రెండు టూ వీలర్లను, 6 స్మార్ట్ ఫోనులు, రెండు కత్తులను స్వాధీనం చేసుకున్నారు.
ఇద్దరు రౌడీ షీటర్‌ల మధ్య నెలకొన్న భూ వివాదం నేపథ్యంలో మొదలైన వ్యక్తిగత కక్షలతో వారం రోజుల క్రితం ఒకరు హత్యకు గురి కావడం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో సంచలన సృష్టించింది. మానకొండూరు మండలం పచ్చునూరు గ్రామానికి చెందిన యువకుడు గోపు ప్రశాంత్ రెడ్డి గత నెల మే 28న దారుణ హత్యకు గురయ్యాడు. ఈ హత్యకు వ్యక్తిగత కక్షలేనని పోలీసుల విచారణలో తేలింది. అందుకు సంబంధించిన వివరాలను కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ వెల్లడించారు.
భూ వివాదంలో పెద్దమనుషులుగా తలదూర్చి..
పచ్చునూరు గ్రామానికి చెందిన మద్దెల వెంకటేష్, బండి సాయిలు ఇద్దరి మధ్య గత కొన్ని సంవత్సరాలుగా ఇంటి స్థలం విషయంలో వివాదం ఉంది. ఆ భూమి విషయంలో పలుమార్లు పంచాయతీ జరిగింది. బండి సాయిలుకు మద్దతుగా గోపు ప్రశాంత్ రెడ్డి ఉండగా, మద్దెల వెంకటేష్ కి మద్దతుగా హత్యలో ప్రధాన నిందితులైన నన్నవేనీ రమేష్, గాజు శంకర్ లు ఉన్నారు.
దీంతో వారి మధ్య విభేదాలు తలెత్తడంతో గతంలో జరిగిన ఇదే భూమి పంచాయితీలో గాజు శంకర్ , మృతుడు గోపు ప్రశాంత్ రెడ్డిని కొట్టాడు. వివాదం మరింత ముదరడంతో ఒకరినొకరు తిట్టుకోవడం, బెదిరింపులకు పాల్పడడంతో ప్రధాన నిందితుడు నన్నవేనీ రమేష్ , గాజు శంకర్ లకు మృతుడికి మధ్య కక్ష పెరిగింది.
గోపు ప్రశాంత్ రెడ్డిని ఎలాగైనా అడ్డు తొలగించుకోవాలని లేని పక్షములో గోపు ప్రశాంత్ రెడ్డి నుండి రమేష్ అతని కుటుంబానికి ప్రాణహాని ఉందని గ్రహించి, నిర్ణయించుకుని పథకం ప్రకారం ప్రధాన నిందితుడైన నన్నవేనీ రమేష్ తో పాటు అతని స్నేహితులు గాజు శంకర్ , మద్దెల వెంకటేష్ మరికొంతమందితో గోపు ప్రశాంత్ రెడ్డిని మే 28న వెంబడించి వేటాడారు. ఊటూర్ తలదాచుకున్న ప్రశాంత్ రెడ్డి ని పట్టుకుని కిరాతకంగా కొట్టి , గర్రెపల్లి గ్రామ శివారులోని మానేరు వాగు సమీపంలో పడేశారు. 12 గంటల తర్వాత డెడ్ బాడీని పోలీసులు గుర్తించారు.
హత్య కేసులో మహిళా నిందితురాలు పరారీ
మృతుడి సోదరుడైన గోపు శ్యామ్ సుందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టగా హత్య నిందితులు 9 మంది అరెస్టు అయ్యారని ఏసీపి తెలిపారు. అరెస్టు అయిన వారిలో నన్నవేనీ రమేష్, సుల్తానాబాద్ కి చెందిన అంతడుపుల సాయి కృష్ణ @ ఎస్ కె భాయ్, తాండ్ర మహేష్, కూరాకుల అనిల్, సర్దార్ కుల్దీప్ సింగ్ @ కార్తీక్, పొన్నాల మనోహర్, ఏరుకొండ మహేష్, కొమ్మడవేని హరీష్, ఓడ్నలా యజ్ఞేశ్ ఉన్నారు.
గాజు శంకర్, సుకే ఉదయ్ కుమార్ @ చింటు, మద్దెల వెంకటేష్, నన్నవేనీ భాగ్యలక్ష్మిలు పరారీలో ఉన్నారని తెలిపారు. హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న వారందరిపై ఐపీఎస్ 147,148,364,302,506,201,212,109,120-బి రెడ్ విత్ 149 సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని తెలిపారు. విచారణ ఇంకా కొనసాగుతుందని, పూర్తి స్థాయిలో విచారణ జరిపి హత్యకు కారణమైన ఏ ఒక్కరిని వదిలి పెట్టబోమని ప్రతి ఒక్క నిందితుడికి శిక్ష పడేలా చర్యలు చేపడతామన్నారు.
(రిపోర్టింగ్ కేవీ రెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లా)