Warangal News : వివాహితతో అక్రమ సంబంధం, ఆపై హత్య..! వెలుగులోకి అసలు విషయాలు
Warangal District News: అక్రమసంబంధం వ్యవహారం ఓ వివాహిత ప్రాణాలను బలి తీసుకుంది. ఈ ఘటన హన్మకొండలో వెలుగు చూసింది. వివాహితను హత్య చేసిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
Warangal District Crimet News : అక్రమ సంబంధం, ఆర్థిక వ్యవహారాలు ఓ వివాహిత ప్రాణం తీశాయి. ఓ మహిళతో సహ జీవనం చేస్తున్న యువకుడితో ఆమెకు పరిచయం కాగా, ఇద్దరి మధ్య తలెత్తిన గొడవ ఆమె హత్యకు కారణమైంది.
ఈ నెల 5న ఈ ఘటన జరగగా…. హత్యకు పాల్పడిన నలుగురు వ్యక్తులను హనుమకొండ జిల్లా మడికొండ పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ కు సంబంధించిన వివరాలను మడికొండ సీఐ ప్రతాప్ వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం వరంగల్ ఉర్సు కరీమాబాద్‌కు చెందిన మహమ్మద్ ఇంతియాజ్ ఆటోలను కిరాయికి ఇస్తుండేవాడు. ఈ క్రమంలోనే ఇంతియాజ్ మద్యం, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఇంతియాజ్ తాగుడు, వ్యవహారం నచ్చక అతడి భార్య కొంతకాలం కిందటే తల్లిగారింటికి వెళ్లిపోయింది. దీంతో అప్పటికే వ్యసనాలకు అలవాటు పడిన ఇంతియాజ్ సిద్దిపేట జిల్లాకు చెందిన గుండెబోయిన నాగలత అలియాస్ లతతో పరిచయం పెంచుకుని ఆమెతో సహజీవనం చేస్తున్నాడు.
మరో మహిళతో సంబంధం…..
ఇంతియాజ్ ఆటోలు కిరాయికి ఇచ్చే బిజినెస్ చేస్తుండగా ప్రస్తుతం అతడి ఆటో నడుపుతున్న వరంగల్ కు చెందిన దిడ్డి మహేశ్, గతంలో ఇంతియాజ్ ఆటో నడిపి ప్రస్తుతం సొంత ఆటో నడుపుకుంటున్న అలుపుల వంశీకృష్ణ, ఇంతియాజ్ ముగ్గురు నిత్యం మద్యం తాగేవారు.
ఈ క్రమంలో ఇంతియాజ్ సహజీవనం చేస్తున్న లత ద్వారా కాజీపేట లావుడ్య తండాకు చెందిన లావుడ్య కుమార్ భార్య లావుడ్య కుమారి అలియాస్ రాధికతో ఇంతియాజ్ కు పరిచయం ఏర్పడింది. దీంతో రాధికతో తరచూ మాట్లాడుతూ లతకు తెలియకుండా ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య చనువు పెరగడంతో రాధిక ఇంతియాజ్‌ను రూ.లక్ష అడిగింది. దీంతో ఇంతియాజ్ డబ్బులు ఇస్తానని ఒప్పుకున్నాడు. కానీ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది.
ఇదే విషయమై మాట్లాడేందుకు రాధిక పిలవగా ఈ నెల 5న ఇంతియాజ్ కాజీపేటలో ఉన్న ఆమె వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి ఆమెను కారులో తన ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరగడంతో అక్కడే ఉన్న లతకు రాధిక అసలు విషయం చెప్పింది. తనకు రూ.లక్ష ఇస్తానని నమ్మించి, ఇంతియాజ్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని, ఇప్పుడు ఇవ్వడం లేదంటూ గొడవ పడింది. ఇదే క్రమంలో లత, రాధిక మధ్య గొడవ జరిగింది. అదే సమయంలో ఇంతియాజ్ ఇంటికి ఆటో డ్రైవర్లు దిడ్డి మహేష్, అలుపుల వంశీకృష్ణ అక్కడికి చేరుకోగా.. రాధికను తీసుకెళ్లి చంపేయాల్సిందిగా ఇంతియాజ్, లత వారికి చెప్పారు.
స్పానర్ తో దాడి.. బండరాయితో మోది హతం…….
ఇంతియాజ్, లత చెప్పిన ప్రకారం రాధికను హతమార్చేందుకు మహేష్, వంశీకృష్ణ ఆమెను ఆటోలో కాజీపేట అమ్మవారిపేట సమీపంలోని సాయినాథ్ వెంచర్‌కు తీసుకెళ్లారు. అక్కడ గొడవ జరగగా రాధిక ప్రతిఘటించడంతో వంశీకృష్ణ తన ఆటోలోని స్పానర్‌తో కుమారి ఎడమ చెవిపై బలంగా కొట్టాడు. దీంతో ఆమె కిందపడిపోయింది.
దిడ్డి మహేష్ పక్కనే ఉన్న బండరాయితో రాధిక తలపై మోదడంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. రాధిక చనిపోయిందని నిర్థారించుకున్న తరువాత ఆమె వద్ద ఉన్న రెండు సెల్ ఫోన్‌లు, కాళ్ల పట్టీలు తీసుకొని అక్కడి నుంచి పరారయ్యారు.
5వ తేదీ మధ్యాహ్న సమయంలో సాయినాథ్ వెంచర్ వైపు వెళ్లిన కొందరు వ్యక్తులు రాధిక డెడ్ బాడీని చూశారు. వెంటనే డయల్ 100 కు ఫిర్యాదు చేయగా, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్కడ లభించిన ఆధారాలతో డెడ్ బాడీ రాధికదిగా గుర్తించారు.
అనంతరం మృతురాలి భర్తకు సమాచారం అందించారు. మృతురాలి భర్త లావుడ్య కుమార్ ఫిర్యాదు మేరకు ఇంతియాజ్, వంశీకృష్ణ, లత, మహేష్‌లపై హత్య కేసు నమోదు చేశారు. వివిధ కోణాల్లో దర్యాప్తు జరిపి నలుగురినీ అరెస్ట్ చేశారు. హత్యలో వాడిన కారు, ఆటో, స్పానర్, బండరాయిని స్వాధీనం చేసుకున్నారు. హత్య కేసును ఛేదించిన ఎస్సైలు రాజబాబు, దివ్య, ఏఎస్సై చంద్రమౌళి, హెడ్‌కానిస్టేబుల్ జయరాజ్, కానిస్టేబుళ్లు వెంకట్, రాంచందర్, రామ్మూర్తి, అశోక్, గోవర్థన్, నాగేశ్వర్‌రావు ను కాజీపేట ఏసీపీ తిరుమల్ అభినందించారు.
(రిపోర్టింగ్: హిందుస్థాన్ టైమ్స్ తెలుగు, వరంగల్ ప్రతినిధి)
టాపిక్