Manchu Family Controversy: మంచు మనోజ్‌పై మోహన్ బాబు ఫిర్యాదు.. ప్రాణహాని ఉందంటూ రాచకొండ సీపీకి లేఖ
Mohan Babu Vs Manchu Manoj: మంచు మనోజ్ పోలీసులకి ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే.. మోహన్ బాబు ఏకంగా సీపీకి లేఖ రాస్తూ తనకి ప్రాణహాని ఉంది రక్షణ కల్పించండి అని కోరారు. దాంతో అసలు మంచు ఫ్యామిలీలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
మంచు ఫ్యామిలీలో విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఆదివారం గాయాలతో ఆసుపత్రిలో చేరిన మంచు మనోజ్.. సోమవారం హైదరాబాద్‌లోని పహాడీ షరీఫ్ పోలీసు స్టేషన్‌కు వెళ్లి తన తండ్రి మోహన్ బాబు అనుచరుడైన వినయ్ తనపై దాడి చేసినట్లు ఫిర్యాదు చేశారు. ఆదివారం జరిగిన ఈ దాడిలో తాను తీవ్రంగా గాయపడ్డానని.. ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు రిపోర్ట్‌లను కూడా ఫిర్యాదుకి మంచు మనోజ్ జత చేశారు.
కొడుకుపై ఫిర్యాదు చేస్తూ మోహన్ బాబు లేఖ
పోలీసులకి మంచు మనోజ్ ఫిర్యాదు చేసిన గంటల వ్యవధిలోనే మంచు మోహన్ బాబు ఒక లేఖ ద్వారా రాచకొండ సీపీకి ఫిర్యాదు చేశారు. తన కొడుకు మంచు మనోజ్ నుంచి తనకి ప్రాణహాని ఉందంటూ ఆ లేఖలో పేర్కొన్న మోహన్ బాబు.. తనకి రక్షణ కల్పించాల్సిందిగా విన్నవించారు.
ఆ లేఖలో మంచు మనోజ్ పేరుతో పాటు అతని భార్య మౌనిక పేరుని కూడా మంచు మోహన్ బాబు ప్రస్తావించారు. ఈ ఇద్దరి నుంచి రక్షణ కల్పించాల్సిందిగా కోరారు. అలానే త్వరలో వచ్చి లిఖిత పూర్వంగా ఫిర్యాదు చేస్తానని కూడా ఆ లేఖలో మోహన్ బాబు రాసుకొచ్చారు.
మనోజ్ ఇంటి దగ్గర బౌన్సర్లు
సోమవారం ఉదయం నుంచి మంచు మనోజ్ ఇంటి దగ్గర హడావుడి నడుస్తోంది. జల్‌పల్లిలోని మంచు మనోజ్ ఇంటి దగ్గరికి బౌన్సర్లతో వెళ్లిన వినయ్... సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అలానే అక్కడ 40 మంది బౌన్సర్లని కాపలాగా ఉంచగా.. మంచు మనోజ్ కూడా కొంత మంది బౌన్సర్లని నియమించుకున్నట్లు వార్తలు వచ్చాయి. దుబాయ్‌కి వెళ్లిన మంచు విష్ణు సోమవారం హైదరాబాద్‌కి రాబోతుండటంతో.. గొడవ జరిగే అవకాశం ఉన్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఆదివారం ఉదయం మొదలైన గొడవ
గతంలో కూడా మంచు ఫ్యామిలీ ఇలా గొడవలతో వార్తల్లో నిలిచింది. బంధువుల ఇంట్లో ఉన్న మంచు మనోజ్‌ని కొట్టేందుకు మంచు విష్ణు ప్రయత్నిస్తున్న వీడియో అప్పట్లో వైరల్‌గా మారింది. ఆదివారం కూడా గొడవ పడినట్లు ఉదయం వార్తలురాగా.. సాయంత్రానికి అలాంటిది ఏమీ లేదంటూ మంచు ఫ్యామిలీ నుంచి ప్రకటన వచ్చింది. కానీ.. రాత్రి బంజారాహిల్స్‌లోని ఆసుపత్రికి గాయాలతో మంచు మనోజ్ రావడంతో.. గొడవ జరిగినట్లు అందరికీ క్లారిటీ వచ్చింది.